నూటికో ‘కోటి’కో ఒక్కడు...
ABN , Publish Date - Dec 08 , 2024 | 11:18 AM
‘ఇప్పుడతను నాకు మాత్రమే కొడుకు కాదు, బిహార్ పుత్రుడు’... ఐపీఎల్ ఆటగాళ్ల తాజా వేలం తర్వాత 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ మాటలివి. ముంబై, దిల్లీ క్రికెటర్ల పోటీని తట్టుకొని, దేశవాళీ క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా మారిన వైభవ్ ఎనిమిదేళ్లకే బ్యాట్‌తో సవారీ ప్రారంభించాడు.
‘ఇప్పుడతను నాకు మాత్రమే కొడుకు కాదు, బిహార్ పుత్రుడు’...
ఐపీఎల్ ఆటగాళ్ల తాజా వేలం తర్వాత 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ మాటలివి. ముంబై, దిల్లీ క్రికెటర్ల పోటీని తట్టుకొని, దేశవాళీ క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా మారిన వైభవ్ ఎనిమిదేళ్లకే బ్యాట్‌తో సవారీ ప్రారంభించాడు. 12 ఏళ్లకే రంజీ అరంగేట్రం చేసిన ఈ బుడతడు... యూత్ విభాగంలో వేగవంతమైన శతకం బాది రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్‌లోనూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ లిటిల్ బాయ్ విశేషాలివి...
బిహార్‌లోని సమస్తిపూర్ పట్టణం సమీపంలో ఉంటుంది తాజ్‌పూర్ గ్రామం. అక్కడే వైభవ్ తండ్రి సంజీవ్ కూడా పెద్ద క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. వ్యవసాయం చేస్తేనే ఇల్లు గడిచేది. పొలాన్ని వదిలి మైదానంలో క్రికెట్ ఆడితే ఏం వస్తుంది? ఒకవైపు ఇష్టమైన క్రీడ. మరొకవైపు జీవితం... అనునిత్యం అనేక ఆలోచనలతో సతమతమవుతూ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరికి ఆయన క్రికెట్ ఆటను వదిలేయక తప్పలేదు. అయిష్టంగానే రైతుగా మారాడు. అయితే తన ఆశయాన్ని ఎలాగైనా కొడుకు రూపంలో చూడాలనుకున్నాడు. ఎలాగైనా కొడుకును క్రికెటర్‌ను చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం సాగు భూమిలోని ఒక ఎకరాన్ని విక్రయించి... వైభవ్ క్రికెట్ ప్రయాణానికి పకడ్బందీ పిచ్‌ను ఏర్పరిచాడు.
మనీష్ ఓఝా శిక్షణలో...
ఐదేళ్ల వయసు నుంచి వైభవ్‌కు క్రికెటంటే మక్కువ. గ్రామంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతుంటే... అక్కడికెళ్లి ఆసక్తిగా చూడటం, ఇంటికొచ్చాక కర్ర లాంటిది ఏది దొరికినా... దాన్ని క్రికెట్ బ్యాట్‌గా ఊహించుకొని ఆడడం చేసేవాడు. ఎప్పుడూ అదే ధ్యాస. కొడుకు ఆసక్తిని గమనించిన సంజీవ్ ఇక ఆలస్యం చేయలేదు. మాజీ క్రికెటర్ మనీష్ ఓఝా అకాడమీలో అతడిని చేర్పించాడు.
సాధన ప్రారంభించిన కొన్ని నెలలకే వైభవ్‌లోని సహజమైన ప్రతిభ బయట పడింది. బ్యాటింగ్‌లో చెలరేగిపోయేవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే అండర్-16 ట్రయల్స్‌లో పాల్గొని విజయ్ మర్చంట్ ట్రోఫీకి అర్హత సాధించాడు. నాలుగేళ్లు తిరిగేసరికి వినూ మన్కడ్ అండర్-19 ట్రోఫీ బరిలోకి దిగాడు. గత ఏడాది జరిగిన క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌లో ఇండియా-బి జట్టు తరఫున ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో రెండు అర్ధ శతకాలు సహా 177 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
12 ఏళ్లకే రంజీ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 14 ఏళ్లకు, యువరాజ్ సింగ్ 15 ఏళ్లకు రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేస్తే... వైభవ్ 12 ఏళ్ల ప్రాయంలోనే పాల్గొని, అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఈ ఏడాది బిహార్ జట్టు తరఫున ముంబైపై అరంగేట్రం చేసి సంచలనం సృష్టించాడు. రంజీల్లో అత్యంత పిన్న వయసులో ఆడిన ఆటగాడితనే. వైభవ్‌ని తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌తో పోటీ పడి మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.కోటి 10 లక్షల ధరకు సొంతం చేసుకోవడంతో న్యూస్‌మేకర్‌గా మారాడు.
58 బంతుల్లో శతకం...
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే వైభవ్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అండర్-19 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన శతకం. 2005లో ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ 56 బంతుల్లో సెంచరీ సాధించి, ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇందులో 58 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ 4 సిక్సర్లు, 14 ఫోర్ల సహాయంతో 62 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ కళ్లలో పడిన వైభవ్‌ను వేలానికి ముందు ట్రయల్స్‌కు పిలిచారు. ఈ ట్రయల్స్‌లో వైభవ్ రెండు ఓవర్లలో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో హడలెత్తించడంతో అతడిని దక్కించుకోవాలని రాజస్థాన్ అప్పుడే నిశ్చయించుకుంది.
ఐపీఎల్‌లో ‘సూర్యో’దయం
దుబాయ్‌లో జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ మెరుపులను వచ్చే ఏడాది ఐపీఎల్‌లో చూడవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అతడి ఎంట్రీకి మరో రెండేళ్లు నిరీక్షించాల్సిందే. ఎందుకుంటే ఐసీసీ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు నిండకుండా ఆడడానికి వీలు లేదు. అప్పటిదాకా వైభవ్ దేశవాళీ, ఐపీఎల్ పోటీల్లో చేసే బ్యాటింగ్ విన్యాసాలే క్రికెట్ అభిమానులకు కనువిందు.
- సంజయ్ ఎస్‌ఎస్‌బి
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)