Rohit Sharma: సెమీ ఫైనల్‌లో రోహిత్ విధ్వంసం.. ఆ రికార్డులు క్లీన్‌బౌల్డ్
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:48 PM
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన బ్యాట్‌కు పని చెప్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్రీజులో కుదురుకున్నాడంటే చాలు.. ఇక పరుగుల విధ్వంసమే. మైదానంలో ఫోర్లు, సిక్సులతో బౌండరీల..
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన బ్యాట్‌కు పని చెప్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్రీజులో కుదురుకున్నాడంటే చాలు.. ఇక పరుగుల విధ్వంసమే. మైదానంలో ఫోర్లు, సిక్సులతో బౌండరీల మోత మోగించేస్తాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టేలా పరుగుల సునామీ సృష్టిస్తాడు. ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అతను అదే దూకుడుని ప్రదర్శిస్తున్నాడు. అవును.. టోర్నీ ప్రారంభంలో కాస్త తడబడ్డాడు కానీ, ఆ తర్వాత పుంజుకొని సత్తా చాటుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులోనూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతను కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. దీంతో.. బౌండరీల పరంగా అతను రికార్డులను నెలకొల్పాడు. తొలుత ఫోర్ల విషయానికొస్తే.. ఆ ఆరు ఫోర్లు కొట్టడం వల్ల రోహిత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు.. శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111 ఫోర్లు) పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఇప్పుడు రోహిత్ 43 మ్యాచ్‌ల్లో 113 ఫోర్ల కొట్టి.. ఆ రికార్డుని పటాపంచలు చేశాడు. ఇక సిక్సుల విషయానికొస్తే.. ఆ రెండు సిక్సులతో రోహిత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 50 సిక్సర్ల మార్కుని దాటాడు. దీంతో.. క్రిస్ గేల్ (63) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ చరిత్రపుటలకెక్కాడు.
కేవలం ఆ రెండే కాదండోయ్.. మరో రెండు రికార్డులను సైతం రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకుముందు క్రిస్ గేల్ 21 సిక్సులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ 22 సిక్సులతో అతనిని అధిగమించాడు. ఇక భారత కెప్టెన్‌గా 5000 పరుగులు మైలురాయిని అందుకున్న ప్లేయర్‌గా అతను రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 12883 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఎంఎస్ ధోనీ 11,207 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అజహారుద్దీన్ (8095), గంగూలీ (7643), రోహిత్ (5012) నిలిచారు.
Read Latest Sports News and Telugu News