లేటరైట్ తవ్వకాలకు పైరవీలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:34 PM
మన్యంలో లేటరైట్ గనుల తవ్వకాలకు మైనింగ్ మాఫియా పైరవీలు చేస్తున్నది. కొంతకాలంగా గిరిజన ప్రాంతంలో పాగా వేసిన మాఫియా బాక్సైట్ తరహా లేటరైట్ గనులను దోచుకునేందుకు జీకేవీధి మండలంలోని పలు చోట్ల గిరిజనులతో దరఖాస్తులు చేయిస్తున్నది.

చక్రం తిప్పుతున్న మైదాన ప్రాంత వ్యాపారి
చాపరాతిపాలెంలో తవ్వకాల అనుమతులకు గిరిజనుడి పేరిట దరఖాస్తు
పంచాయతీ తీర్మానానికి సభ్యుల ఆమోదం
రెవెన్యూ అధికారులు సిఫారసు
జనసేన నాయకుల అండతో మైనింగ్‌శాఖకు ఫైల్
అనుమతి వచ్చిన వెంటనే తవ్వకాలకు ఏర్పాట్లు
గిరిజన కుటుంబాలకు నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తామని వ్యాపారి ఒప్పందం
గూడెంకొత్తవీధి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మన్యంలో లేటరైట్ గనుల తవ్వకాలకు మైనింగ్ మాఫియా పైరవీలు చేస్తున్నది. కొంతకాలంగా గిరిజన ప్రాంతంలో పాగా వేసిన మాఫియా బాక్సైట్ తరహా లేటరైట్ గనులను దోచుకునేందుకు జీకేవీధి మండలంలోని పలు చోట్ల గిరిజనులతో దరఖాస్తులు చేయిస్తున్నది. ఇందులో భాగంగా చాపరాతిపాలెంలో లేటరైట్ గనుల తవ్వకాలు చేపట్టేందుకు ఓ మైదాన ప్రాంత వ్యాపారి రంగంలోకి దిగాడు. లేటరైట్ తవ్వకాల అనుమతుల కోసం స్థానిక గిరిజనుడితో దరఖాస్తు చేయించాడు. నెల రోజుల క్రితం గ్రామ సభ నిర్వహించకుండా పంచాయతీ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపేలా పావులు కదిపాడు. జనసేన నాయకుల ఒత్తిడితో రెవెన్యూ అధికారులు సర్వే చేసి మైనింగ్‌శాఖకు అనుమతుల కోసం సిఫారసు చేశారు. కాగా లేటరైట్ తవ్వకాలు ప్రారంభమైతే గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామని ఆ వ్యాపారి ఒప్పందం చేసుకున్నాడు.
జిల్లాలోని గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో విలువైన ఖనిజ సంపద ఉంది. 1997-99 ప్రాంతంలో చింతపల్లి మండలం సిరిపురం, గూడెంకొత్తవీధి మండలం చాపరాతిపాలెంలో ఓ మైనింగ్ మాఫియా బాక్సైట్ తరహా లేటరైట్ గనుల తవ్వకాల అనుమతులు పొందేందుకు కార్యాచరణ ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి అనే బినామీ మైనింగ్ వ్యాపారి చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ సిరిపురంలో దోనె పోతురాజు అనే గిరిజనుడి పేరిట 2001 అక్టోబరు 14 నుంచి 2021 అక్టోబరు 13 వరకు సర్వే నంబర్లు 59/1,2, 60/1,2, 60/3లోనున్న 4.270 హెక్టార్ల డీఫారం పట్టా భూముల్లో లేటరైట్ గనుల తవ్వకాలు చేపట్టేందుకు భూగర్భ గనులశాఖ అనుమతులు పొందాడు. ప్రస్తుతం ఈ లేటరైట్ క్వారీ లీజు అనుమతుల గడువు ముగిసిపోయింది. అలాగే గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ చాపరాతిపాలెం గ్రామంలో విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ బినామీ మైనింగ్ వ్యాపారి కొయ్యూరు మండలం వలసంపేట గ్రామానికి చెందిన గిరిజనుడు పొత్తూరు దేముడు పేరిట సర్వే నంబర్లు 19/1,2,4,5, 20/2, 21/1,2, 22/1,7లో ఉన్న 11.610 హెక్టార్ల భూమిలో లేటరైట్ గనుల తవ్వకాలకు 2004 జనవరి 13 నుంచి 2024 జనవరి 12 వరకు భూగర్భ గనులశాఖ అనుమతులు పొందాడు. ఈ క్వారీ అనుమతుల గడువు సైతం ముగిసిపోయింది. 2016-17 ప్రాంతంలో చాపరాతిపాలెం, సిరిపురం ఎర్రమట్టి క్వారీల్లో తవ్వకాలు జరపవద్దని స్థానిక గిరిజనులు ఆందోళనలు ఉధృతం చేశారు. స్థానిక గిరిజనులు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాటి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అభ్యర్థన మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తవ్వకాలను నిలిపివేశారు.
వైసీపీ హయాంలో ఏడాదిన్నర పాటు తవ్వకాలు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూతపడిన చాపరాతిపాలెం క్వారీలో ఏడాదిన్నరపాటు తవ్వకాలు సాగించారు. వైసీపీకి చెందిన ఓ మంత్రి, లేటరైట్ వ్యాపారుల మధ్య పర్సంటేజీల వ్యవహారంలో ఒప్పందం కుదరకపోవడం, ట్రాన్స్‌పోర్టుకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో మైనింగ్ వ్యాపారులు తవ్వకాలను నిలిపివేశారు.
కూటమి ప్రభుత్వంలోనూ ప్రయత్నం
కూటమి ప్రభుత్వం వచ్చాక జనసేన నాయకుల సహకారంతో చాపరాతిపాలెంలో బినామీ వ్యాపారులు లేటరైట్ తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రామ సభ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపేలా పావులు కదిపారు. వాస్తవానికి గ్రామ సభ తీర్మానం కీలకం. దీనికి సభ్యులు ఆమోదం తెలిపితే రెవెన్యూ, పోలీసు, అటవీశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. ఈ అనుమతుల ఆధారంగా మైనింగ్ శాఖ లీజును కేటాయిస్తుంది. చాపరాతిపాలెంలో లేటరైట్ గనుల తవ్వకాలకు పంచాయతీ ఆమోదం లభించడంతో అనుబంధ శాఖలు, గనులశాఖ అనుమతులు పొందేందుకు జనసేన నాయకుల అండతో బినామీ వ్యాపారి ప్రయత్నాలు చేస్తున్నారు.
రింతాడలో మైనింగ్ మాఫియాకు చెక్
రింతాడ గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ మాఫియాకు వార్డు సభ్యులు చెక్ పెట్టారు. రింతాడ పరిధిలో నల్లరాయి, గ్రానైట్, లేటరైట్ తవ్వకాలకు 2024 జనవరిలో వైసీపీ పెద్దల అండతో గిరిజనుల పేరిట మైనింగ్ అనుమతులు పొందేందుకు వ్యాపారులు గ్రామ సభ తీర్మానం కోసం వచ్చారు. స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మూకుమ్మడిగా గ్రామ సభలో మైనింగ్ తవ్వకాలకు అనుమతించేది లేదని తీర్మానించారు. కూటమి ప్రభుత్వం రావడంతో తాజాగా మరోసారి గ్రామ సభ తీర్మానం కోసం ప్రయత్నించినప్పటికి పంచాయతీ సభ్యులు అంగీకరించకపోవడంతో మైనింగ్ వ్యాపారులు వెనక్కి వెళ్లిపోయారు.