Share News

ప్రోత్సహిస్తే పండులాంటి ఆదాయం

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:35 PM

జీడిమామిడి రైతులు ఇప్పటి వరకు కేవలం పిక్కలతోనే ఆదాయం పొందుతున్నారు. అయితే జీడిమామిడి పండ్లపై కూడా ఆదాయం పొందేలా ఐటీడీఏ ప్రోత్సహిస్తే వారి ఇంట సిరులు పండినట్టవుతుందని ఉద్యానవన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రోత్సహిస్తే పండులాంటి ఆదాయం
కొయ్యూరు మండలంలో పండిన జీడిమామిడి పండ్లు (ఫైల్‌ ఫొటో)

కేవలం పిక్కలతోనే ఆదాయం పొందుతున్న జీడిమామిడి రైతులు

పండ్లను వృథాగా పారేస్తున్న వైనం

పండ్లతో 20 రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చునంటున్న ఉద్యానవన శాస్త్రవేత్తలు

ప్రభుత్వం ప్రోత్సహించి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తే సిరుల పంట

కొయ్యూరు, మార్చి 19(ఆంధ్రజ్యోతి): జీడిమామిడి రైతులు ఇప్పటి వరకు కేవలం పిక్కలతోనే ఆదాయం పొందుతున్నారు. అయితే జీడిమామిడి పండ్లపై కూడా ఆదాయం పొందేలా ఐటీడీఏ ప్రోత్సహిస్తే వారి ఇంట సిరులు పండినట్టవుతుందని ఉద్యానవన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీడిమామిడి పండ్లతో సుమారు 20 రకాల అనుబంధ ఉత్పత్తులు తయారు చేయవచ్చునని వారు సూచిస్తున్నారు. అయితే రైతులకు దీనిపై అవగాహన లేకపోవడం, ప్రాసెసింగ్‌ యూనిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సీజన్‌లో పండ్లను వృథాగా వదిలేస్తున్నారు. వీటిని వినియోగంలోకి తెచ్చేలా ఐటీడీఏ ముందుకు వచ్చి రైతులను ప్రోత్సహిస్తే వారి ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

జిల్లాలో సుమారు 85 వేల ఎకరాల్లో జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో జీడిమామిడిని అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కొయ్యూరు మండలంలోనే సుమారు 5 వేల హెక్టార్లు పైబడి తోటలు విస్తరించి ఉన్నాయి. మిగిలిన మండలాల్లో కూడా ఈ తోటలు అధికంగానే ఉన్నాయి. సరైన సస్యరక్షణ చేపట్టనందున హెక్టారుకు సగటున రెండు టన్నుల పిక్కలు రావలసి ఉన్నా, టన్ను మించి రావడం లేదు. మైదాన ప్రాంతమైన అనకాపల్లి జిల్లా నాతవరం, మాకవరపాలెం, కోటవురట్ల, రోలుగుంట, రావికమతం మండలాల్లో సుమారు 35 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీరంతా పిక్కలు సేకరించి పండ్లను పారేయడంతో అదనంగా వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నారు. మన్యంలో ఐటీడీఏ రెండు, మూడు చోట్ల పండ్ల ప్రాసెసింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే జీడిమామిడి సాగు చేస్తున్న రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. కనీసం ఐటీడీఏ రుణ సౌకర్యం కల్పిస్తే రైతులు ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వివిధ రకాల జ్యూస్‌లతో పాటు ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే ఆల్కహాల్‌ తయారీకి ఉపయోగపడే జీడిమామిడి పండ్లు వృథాగా పోకుండా సద్వినియోగమయ్యేలా చర్యలు చేపడితే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీడిమామిడి పిక్కల సీజన్‌ ఆరంభమయ్యేలోపు జీడిమామిడి పండ్ల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 19 , 2025 | 11:35 PM

News Hub