Konda Surekha: రోడ్డు ప్రాజెక్టులకు అటవీ అనుమతుల్లో జాప్యం
ABN , Publish Date - Oct 27 , 2024 | 04:31 AM
అటవీ అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో 59 రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోయాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
కేంద్రం తీరుతో ఆగిపోయిన 59 ప్రాజెక్టులు
అనుమతుల సాధనకు ఆర్‌అండ్‌బీ, అటవీ శాఖ మధ్య సమన్వయానికి బృందం
సమీక్షలో మంత్రులు కోమటిరెడ్డి, సురేఖ
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అటవీ అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో 59 రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోయాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం సచివాలయంలోని మంత్రి కోమటిరెడ్డి చాంబర్‌లో ఇరువురు సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి అనేక రోడ్లకు అనుమతులు సాధించినా అటవీ అనుమతుల్లేక ఆగిపోవడంతో.. కొత్త రోడ్ల మంజూరు కోసం అడగడం ఇబ్బందిగా మారిందని కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులను మంజూరు చేయించాలంటే ఇప్పటికే మంజూరైన రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే అటవీ అనుమతులు సాధించేందుకు శాఖల మధ్య సమన్వయం కోసం అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
దీనిని పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ఎస్‌ఈ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించనున్నట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. డీఎ్‌ఫవోల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఫైళ్ల క్లియరెన్స్‌లో ఫాస్ట్ ట్రాక్ పద్థతిలో పూర్తి చేేసలా చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డికి హామీ ఇచ్చారు. అనుమతులను వేగంగా సాధించేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణ అధికారులను నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్‌కు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు చివరికల్లా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌పై ఒక స్లాబ్‌ను పూర్తి చేయాలని మోర్త్ ఆర్వో కృష్ణప్రసాద్, ఎస్‌ఈ ధర్మారెడ్డికి మంత్రి కోమటిరెడ్డి సూచించారు.