ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ
ABN , Publish Date - May 15 , 2024 | 03:29 AM
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని, ఆ రెండు పార్టీల వ్యవహారం ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి
బీజేపీని గెలిపించడానికి శ్రమించిన రేవంత్
ఆరేడు చోట్ల కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులు
కేసీఆర్ బస్సుయాత్రతో రాజకీయాల్లో మలుపు
దేశంలో రెండు కూటములకూ మెజారిటీ రాదు
ప్రాంతీయ పార్టీలదే నిర్ణయాత్మక పాత్ర: కేటీఆర్
సిరిసిల్ల/హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయని, ఆ రెండు పార్టీల వ్యవహారం ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఆరేడు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన, డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జీవన్‌రెడ్డి కరీంనగర్‌లో పోటీ చేయాలనుకుంటే.. ఆయనను బలవంతంగా నిజామాబాద్‌లో పోటీ చేయించారని తెలిపారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదని ఎద్దేవా చేశారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి చివరి పది రోజుల్లో ప్రచారం కూడా చేయలేదని, మల్కాజిగిరి అభ్యర్థి ఆ ప్రాంతానికి సుపరిచితులు కాదని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీని గెలిపించడానికి కిషన్‌రెడ్డి కంటే ఎక్కువ కష్టపడ్డారని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితుల్లేవని, ప్రాంతీయ పార్టీలదే హవా అని పేర్కొన్నారు. ఏ కూటమిలోనూ లేని బీఆర్‌ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ వంటి ప్రాంతీయ శక్తులు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో 17 సీట్లలోనూ బీఆర్‌ఎస్ గట్టీ పోటీ ఇచ్చిందని, రెండు నెలల కాలంలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గులాబీ సైనికులు ముచ్చెమటలు పట్టించారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందని, రెండు జాతీయ పార్టీల నాయకులు తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితిని కల్పించిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధించబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్రవ్యతిరేకత కనిపించిందన్నారు. ఐదు నెలలుగా ప్రభుత్వాన్ని కాంగ్రెస్.. టైంపా్‌సగా నడిపిందని ఆరోపించారు. ఇక బీజేపీ తరఫున గత ఎన్నికల్లో నలుగురిని ఎంపీలుగా గెలిపించినా.. వారితో ఒరిగిందేమీ లేదనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాగా, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు.