Cabinet expansion: కీలక శాఖల్లో మార్పులు!
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:36 AM
కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. అయితే విశ్వావసు నామ సంవత్సరంలో చేపట్టనున్నట్లు భావిస్తున్న ఈ విస్తరణ.. కొత్త మంత్రుల చేర్పునకే పరిమితం కాబోవడంలేదు.

క్యాబినెట్ విస్తరణతోపాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి
అధిష్ఠానం పట్ల విశ్వాసం, శాఖ నిర్వహణలో
జాగ్రత్తలు తీసుకునే వారికి ప్రధాన శాఖలు
కాంగ్రెస్ హైకమాండ్‌దే తుది నిర్ణయం
ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పెద్దలు
సీఎం వద్దే ఉండనున్న విద్యాశాఖ, హోంశాఖ!
ఉగాది లేదా ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణం
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం దగ్గరపడుతోంది. అయితే విశ్వావసు నామ సంవత్సరంలో చేపట్టనున్నట్లు భావిస్తున్న ఈ విస్తరణ.. కొత్త మంత్రుల చేర్పునకే పరిమితం కాబోవడంలేదు. క్యాబినెట్ విస్తరణతోపాటు.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వంలోని అత్యంత కీలకమైన శాఖల్లో ఈ మార్పులు చోటుచేసుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌తో పార్టీ అధిష్ఠానం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణతోపాటు మంత్రిత్వ శాఖల మార్పులపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఆయా శాఖలకు సంబంధించి మంత్రుల పనితీరుపై వివిధ మార్గాల్లో అధిష్ఠానం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. దీనికితోడు శాఖల నిర్వహణలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతోపాటు వివిధ వర్గాల వారూ అధిష్ఠానానికి ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. పలువురు మంత్రుల శాఖల మార్పులపైనా చర్చించినట్లు చెబుతున్నారు. కొత్తగా తీసుకునే మంత్రులకు ఏయే శాఖలు కేటాయించాలన్న చర్చలో భాగంగా ఈ అంశంపైనా చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వంలో అత్యంత ప్రధాన శాఖలుగా పరిగణించే శాఖలను ఆయా మంత్రుల నుంచి ఇతరులకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అధిష్ఠానం పట్ల విశ్వాసం, శాఖల నిర్వహణలో అత్యంత జాగ్రత్త తీసుకునే వారికి ఆ శాఖలను కేటాయించే ఆలోచనలో అధిష్ఠానం ఉందని అంటున్నారు.
అధిష్ఠానం కోర్టులోనిర్ణయం!
విస్తరణలో భాగంగా ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, వారికి ఏయే శాఖలు కేటాయించాలన్నది ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్ఠానం కోర్టులో ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ల అభిప్రాయాలను అధిష్ఠానం పెద్దలు తీసుకున్నారు. ఇక నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది. అయితే చర్చల్లో భాగంగా.. ఆయా ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత, తీసుకుంటే జరిగే పరిణామాలు, అసంతృప్తులకు ఇవ్వాల్సిన వాగ్దానాలు వంటి వాటిపైనా చర్చించారు. పార్టీలో అంతర్గతంగా ఆ కసరత్తు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, కీలక శాఖలను మార్చే క్రమంలో.. వాటి స్థానే ఆయా మంత్రులకు కేటాయుంచాల్సిన శాఖలపై తర్జన భర్జన నడుస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త మంత్రులకు సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖలతోపాటు ఇతర మంత్రుల వద్ద అదనంగా ఉన్న శాఖల్లో ఏయే శాఖలను కేటాయించాలన్న దానిపైనా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. అయితే విద్యాశాఖ, హోంశాఖను మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి తన వద్దనే ఉంచుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ పెద్దలు ముహూర్తాలు కూడా పరిశీలించారు. ఉగాది రోజు(మార్చి 30)తోపాటు ఏప్రిల్ 2సాయంత్రం, ఏప్రిల్ 3, 4వ తేదీల్లో ఉదయం బాగుందంటూ అధిష్ఠానానికి వారు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపై అధిష్ఠానం తుది నిర్ణయాన్ని ప్రకటించగానే ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు.
నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్
కొడంగల్: పేదల తిరుపతిగా పేరొందిన వికారాబాద్ జిల్లా కొడంగల్ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తాండూరు రోడ్డులోని హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకొని బ్రహ్మోత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొడంగల్‌లో నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
రేపు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు
ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
హైదరాబాద్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల ఆధ్వర్యంలో ఈ నెల 30 తేదీన ఉదయం 10గంటలకు రవీంద్రభారతిలో ‘శ్రీ విశ్వావసు’ నామ ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ సమావేశమై చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసీ జారీ చేసిన అనుమతి, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వేడుకల్లో భాగంగా ‘పంచాంగ శ్రవణం’ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Betting Apps Case.. మరో ఆరుగురికి నోటీసులు..
కేసీఆర్ క్యాంపు కార్యాలయానికి టులెట్ బోర్డు..
Read Latest Telangana News And Telugu News