ఏసీబీ వలలో ఆదిలాబాద్ డీఈఎంవో
ABN , Publish Date - Mar 29 , 2025 | 05:20 AM
ఓ కేసు విషయంలో మెడికల్ షాపు యాజమాని నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్‌టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డీఈఎంవో) రవి శంకర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు.

రూ.30 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత
ఆదిలాబాద్ రూరల్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఓ కేసు విషయంలో మెడికల్ షాపు యాజమాని నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్‌టెన్షన్ మెడికల్ ఆఫీసర్ (డీఈఎంవో) రవి శంకర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మన్నూర్‌లో ఓ యువతికి అబార్షన్ చేసి ఆమె మృతికి కారణమైన కేసులో మందులు ఇచ్చిన మెడికల్ షాపు యాజమానిపై చర్యలు తీసుకునేందుకు వైద్యాధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ వ్యవహారంలో తన తప్పేంలేదని, తనపై ఏ చర్యలు తీసుకోవద్దంటూ మెడికల్ షాప్ యజమాని.. డీఈఎంవో రవిశంకర్‌ను కలిసి వేడుకున్నాడు.
అయితే ఇందుకు రూ.లక్ష ఇవ్వాలని రవిశంకర్ డిమాండ్ చేశాడు. తర్వాత బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం శుక్రవారం తన కార్యాలయంలో మెడికల్ షాప్ యజమాని నుంచి రవిశంకర్ రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనను కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.