Share News

Festival Celebrations: పండుగ రోజే ఎందుకు

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:50 AM

ప్రభుత్వం హిందువుల పండుగ రోజున కార్యక్రమాలను ప్రారంభించడం వల్ల ఉద్యోగులు పండుగలు జరుపుకోలేకపోతున్నారు.దీంతో వారి కుటుంబాలు నిరుత్సాహానికి గురి అవుతున్నాయి.

Festival Celebrations: పండుగ రోజే ఎందుకు

పండుగ రోజే ఎందుకు? రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ఎన్నో పండుగలు ఉన్నా, అందులో ముఖ్యమైనవి తెలుగు సంవత్సరం మొదటి పండుగ ఉగాది, తర్వాత దసరా, దీపావళి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కార్య్రకమాన్ని హిందువుల పండుగ రోజే మొదలు పెట్టడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగస్తులు ఆ పండుగలు జరుపుకోలేకపోతున్నారు. దీంతో వారి భార్యాపిల్లలు నిరుత్సాహానికి గురి అవుతున్నారు. ఉదాహరణకు గత ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు దసరా రోజే ప్రారంభించడం, అది కూడా రాత్రిపూట పోస్టింగ్స్‌ ఇవ్వడంతో ఆదరాబాదరాగా కుటుంబానికి దూరంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వచ్చింది. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఉగాది రోజే అంటే, మార్చి 30న రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది.


ఈ కార్యక్రమాన్ని హుజూర్‌నగర్‌ నుంచి ముఖ్యమంత్రి ప్రారంభిస్తే, మిగతా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలు పెట్టాలని నిర్ణయించారు. దీంతో ఆ రోజు ముఖ్యంగా రెవెన్యూ ఉద్యోగులు, పౌరసరఫరాల సిబ్బంది కుటుంబంతో ఉగాది పండుగ జరుపుకునే అవకాశం కోల్పోతారు. దీంతో కుటుంబసభ్యులు నిరుత్సాహానికి గురై, మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పండుగ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను చేపట్టేలా తగు చర్యలు తీసుకోవాలి.

– సురేష్‌ పోద్దార్‌ రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌

Updated Date - Mar 29 , 2025 | 05:52 AM