Irrigation Funding: ప్రాజెక్టుల నిర్మాణ పనులకు..
ABN , Publish Date - Jul 26 , 2024 | 03:59 AM
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు నిధులు కేటాయించింది.
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు నిధులు కేటాయించింది. మొత్తం రూ.22,301 కోట్లు కేటాయించింది. ఇందులో ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.10,829 కోట్లు వెచ్చించనున్నారు. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.2000 కోట్లు, మిగిలిన నిధులను రుణాల చెల్లింపులు, ప్రాజెక్టు నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ రుణాలకు రూ.10374 కోట్లు కట్టాల్సి ఉండగా.. రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చుకోవాలని నిర్ణయించారు.
అంతేగాక తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థకు తెచ్చుకున్న రుణాలకు కూడా రూ.3200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంటే రుణాలకే రూ.13574 కోట్లు కట్టాలి. గత ప్రభుత్వం తీసుకున్న స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలికంగా మార్చుకుంటే రుణ భారం రూ.9 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.10,829 కోట్లను వెచ్చించవచ్చని లెక్కకట్టింది. గత బడ్జెట్‌లో రూ.33,064 కోట్లను కేటాయించగా.. రూ.27367 కోట్లను వెచ్చించారు.