Share News

CM Revanth Reddy: బీజేపీ.. క్యాన్సర్‌!

ABN , Publish Date - May 11 , 2024 | 05:30 AM

బీజేపీ ఒక రకమైన క్యాన్సర్‌లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: బీజేపీ.. క్యాన్సర్‌!

ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం

  • వేళ్లూనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే

  • దానికి అధికారమిస్తే మధ్యయుగాల పాలనే

  • ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు

  • రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర

  • ఆరు సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోబోతోంది

  • అక్కడ బీజేపీకి లాభం జరగబోతోంది

  • కేసీఆర్‌ మర్యాదగా మాట్లాడతానంటే నేనూ సిద్ధం

  • అవినీతిపరులను పక్కనబెట్టుకుని మోదీ ప్రవచనాలు

  • ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి

బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం

  • వారి పాలనలో ఉన్న యూపీనే ఉదాహరణ

  • అక్కడికి పెట్టుబడులు, కంపెనీలు వెళ్లడం లేదు

  • మతకల్లోలాలు పెట్టి తెలంగాణ నుంచి పెట్టుబడులను గుజరాత్‌కు మళ్లించేందుకు కుట్రలు

  • మక్తల్‌, షాద్‌నగర్‌, హైదరాబాద్‌లలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఒక రకమైన క్యాన్సర్‌లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ రావడం మంచిది కాదని, ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకూడదని ఆకాంక్షించారు. కేంద్రంలో బీజేపీకి మళ్లీ అధికారమిస్తే మధ్య యుగాల పాలనే సాగుతుందని, అప్పటి చక్రవర్తులు ‘రాజ్యమంటే నేను... నేనంటే రాజ్యమ’న్నట్లుగా ఉంటుందని ధ్వజమెత్తారు. దేశం భిన్న ప్రాంతాలు, చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోతుందని హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గం తాజ్‌ కృష్ణా హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు. ఆ వివరాలు..


బీఆర్‌ఎస్‌ ఎన్నికలను వదిలేసింది

బీఆర్‌ఎస్‌ ఎన్నికలను వదిలేసిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఆరు సీట్లలో డిపాజిట్లు కోల్పోతోందని అభిప్రాయపడ్డారు. తద్వారా, తెలిసో తెలియకో బీజేపీకి లాభం చేస్తోందని వివరించారు. అధికారం పోవడం, కుమార్తె జైలుకు వెళ్లడంతో కేసీఆర్‌ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని, దాంతో, రోజుకో రకంగా.. రకరకాలుగా మాట్లాడుతున్నారని తప్పుబడుతూనే ఆయనపై సానుభూతి వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పదేళ్ల తన పాలనలో వందేళ్లకు సంబంధించిన ఆర్థిక విధ్వంసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌ వాడే భాషనే తానూ వాడుతున్నానని, ఆటలో ఇద్దరికీ ఒకే నిబంధనలుండాలని, ఆయన కాలుతో ఆడితే నేను చేత్తో ఆడలేను కదా.? అని ప్రశ్నించారు. మర్యాదగా మాట్లాడతానని ఆయన కాగితంపై సంతకం పెడితే.. తాను కూడా సిద్ధమని స్పష్టం చేశారు.

బీజేపీకి అధికారమిచ్చే కుట్ర

త్యాగాల పునాదులపై పార్టీని విస్తరించుకోవడమే కాకుండా పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి.. రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన కేసీఆర్‌ కుటుంబం నిస్సహాయంగా, వ్యూహాత్మకంగా, తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ బేరసారాల్లో భాగంగా తెలంగాణ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చాలనుకుంటున్న బీజేపీకి అధికారాన్ని అప్పగించే కుట్ర చేస్తోందని రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రల నేపథ్యంలోనే రాష్ట్రంలో బీజేపీని నిలువరించాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్‌ బరిలో నిలిచిందని చెప్పారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని అన్నారు.


హైదరాబాద్‌కు పెట్టుబడులు అందుకే..

ఎన్నికల్లో గెలవడానికి మతాలు, భాషల మధ్య విద్వేషాలను సృష్టించడం, వ్యక్తుల మధ్య విషాన్ని చిమ్మడం బీజేపీ విధానమని, ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని సీఎం రేవంత్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదని, అక్కడికి పెట్టుబడులు రావడం లేదని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఇందుకు బీజేపీ పాలన విధానమే కారణమని చెప్పారు. ‘‘అదే హైదరాబాద్‌లో 1994 నుంచి 2004 వరకు టీడీపీ హయాంను తీసుకున్నా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌.. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నాయి. సిద్ధాంతాలపరంగా వైరుధ్యం ఉండొచ్చు. పరిపాలనలో భిన్న అభిప్రాయాలుండొచ్చు. కానీ, ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా.. మతాలను విభజించకుండా.. వ్యక్తుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టకుండా పాలన సాగించాం. అందుకే ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్‌ కేంద్రంగా మారింది’’ అని వివరించారు.

మోదీ.. విద్వేష ప్రధాని

పదేళ్లు ప్రధానిగా చేసి.. మూడోసారి పీఠం ఎక్కాలని అనుకుంటున్న మోదీ ప్రజల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి, దేశ మనుగడకే ప్రమాదం తెస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశం భిన్న ప్రాంతాలుగా, చిన్న చిన్న సంస్థానాలుగా విడిపోవడానికి ఇది దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పాకిస్థాన్‌కు సుపారీ ఇచ్చి, తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఆరోపించారని, ఎన్నికైన తర్వాత ఎందుకు విచారణ చేయించలేదని నిలదీశారు. కాంగ్రె్‌సకు అధికారం ఇస్తే.. ఆస్తులతోపాటు పుస్తెలను కూడా లాక్కుని ముస్లిములకు పంచి పెడతారని మోదీ ఆరోపిస్తున్నారని, భావోద్రేకాలను రెచ్చగొట్టడం.. ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడమే ఎన్నికల్లో మోదీ వ్యూహమని వివరించారు. అందుకు దేశం ఏమైనా పర్వా లేదన్నది ఆయన విధానమన్నారు. వ్యక్తుల చేతుల్లో వ్యవస్థలన్నీ బందీలై బానిసల్లా పని చేయాలని భావిస్తున్నారని, అందుకే, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.


తెలుగు రాష్ట్రాలపై వివక్ష

రాజకీయంగా, ఆర్థికంగా, అభివృద్ధిపరంగా దక్షిణ, ఉత్తర భారతాల మధ్య ఇప్పటికే అంతరం పెరుగుతోందని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో 26 మంది ఎంపీలుంటే ప్రధాని పదవితోపాటు ఏడు కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నారని, ఉత్తరప్రదేశ్‌కు 12 మంత్రి పదవులు తీసుకున్నారని, కానీ, తెలుగు రాష్ట్రాల్లో 42 లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులున్నా.. ఒకే ఒక మంత్రి పదవి ఇచ్చారని తప్పుబట్టారు. తెలంగాణ నుంచి ఒక రూపాయి పన్నును చెల్లిస్తే... తిరిగి వచ్చేది 43 పైసలేనని, అదే బీహార్‌ నుంచి రూపాయి చెల్లిస్తే... ఏడు రూపాయల ఆరు పైసలు వెళుతున్నాయని వివరించారు.

నియోజకవర్గాల పునర్విభజన ప్రమాదకరం

రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాలకు మెడ మీద కత్తిలా వేలాడుతోందని సీఎం రేవంత్‌ చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాలను విభజిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. ‘‘ఆనాడు ప్రధానమంత్రులు, పాలకులు ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ పాటించారు. జనాభా తగ్గింది. కానీ... ఉత్తరంలో జనాభా పెరిగింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే... మన మనుగడ, ఉనికి ప్రమాదమే. మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండదు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా అధికారంలోకి వస్తేనే సమ న్యాయం జరుగుతుందని అన్నారు.


మోదీ పక్కనే అవినీతిపరులు

అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ ఎలక్టోరల్‌ బాండ్స్‌పై చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్‌ సవాలు చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ సమావేశంలో నాటుసారా అమ్మే వారిని, మద్యం దుకాణాల నుంచి వసూళ్లు చేసే వారిని, ఎవరి పేరు చెబితే దొంగలు కూడా భయపడతారో అలాంటి వారిని పక్కన కూర్చోబెట్టుకుని అవినీతి గురించి ప్రధాని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కుమారస్వామి, ఏకనాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌, నవీన్‌ జిందాల్‌, అశోక్‌ చవాన్‌ వంటి వారిని పక్కన కూర్చోబెట్టుకుని మోదీ అవినీతి గురించి మాట్లాడటం సరికాదన్నారు. తాను నిజాయితీపరుడినని మోదీ అంటున్నారని, కానీ, రూ.60 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను రూ.6 లక్షల కోట్లకు బినామీలు, మిత్రులు, పార్టీ సహచరులకు అమ్మేశారని, ఆయన తరఫున సమూహాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడతున్నవారు మళ్లీ ఆయన పక్కనే వచ్చిచేరుతున్నారని, బీజేపీలో చేరగానే అవినీతిపరులు పునీతులైపోతున్నారని చెప్పారు. రాజు నీతిగా ఉంటే సరిపోదు రాజ్యం నిజాయితీగా నడపాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎంత భారీగా ఖర్చు పెడుతోందో చూస్తున్నామని, రైలు టికెట్లు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో కాంగ్రెస్‌ ఎన్నికలను ఎదుర్కొంటోందని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ పెట్టిన సమావేశాల మీద కమిటీ వేసి ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందనే దానిమీద మోదీ చర్చకు సిద్ధమా అని సవాలు చేశారు. ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకు ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. అవినీతి డబ్బుతో ఎన్నికల ప్రచారం చేయడం లేదని మోదీ, అమిత్‌ షాతో పాటు బీజేపీ ముఖ్యులు భద్రాచలంలోని రామాలయంకు వచ్చి ప్రమాణం చేయగలరా అని సవాలు విసిరారు. అలా చేస్తే ఎన్నికల ప్రచారం నుంచి తాను తప్పుకుంటానన్నారు. మోదీ దిగజారుడు ఆరోపణలు ఆయన కుర్చీకి గౌరవాన్ని తీసుకురావన్నారు.


అవి ఆరెస్సెస్‌ సిద్ధాంతాలు..

ఆధారాల ప్రాతిపదికనే బీజేపీపై విమర్శలు చేస్తున్నానని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. రాజ్యాంగంలో సంస్కరణలు, మార్పుల గురించి వెంకటాచలం కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఇప్పుడు కనిపించడం లేదన్నారు. 1925లో ఆర్‌ఎ్‌సఎ్‌సను మొదలు పెట్టినప్పుడు హెగ్డేవార్‌ వందేళ్లలోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేలా కార్యాచరణ మొదలు పెట్టారన్నారు. 2025లో ఆర్‌ఎ్‌సఎస్‌ వందేళ్లు పూర్తి చేసుకుంటుందని, దాని కార్యాచరణను అమలు చేయడానికి ఏర్పడిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ప్రస్తుతం ఆర్‌ఎ్‌సఎస్‌ ఎజెండాలో మిగిలినవి రెండే అంశాలని, ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం, రెండోది రిజర్వేషన్లు రద్దు చేయడమని అన్నారు. 400 సీట్లు వస్తే వీటిని చేయవచ్చని భావించి.. ఈ దఫా 400 సీట్లు అనే నినాదాన్ని బీజేపీ తెరమీదకు తెచ్చిందన్నారు. ఏ విధానాలను తీసుకు రావాలని రహస్యంగా ముందుకు వస్తున్నారో వాటిని తాను కదిలించానన్నారు. తన స్థాయి చాలా చిన్నదైనా మోదీని ఎదుర్కొనే ప్రయత్నం చేశానన్నారు. ఈ నేపథ్యంలోనే హోం శాఖ ఆధ్వర్యంలో తనపై అమిత్‌ షా క్రిమినల్‌ కేసు నమోదు చేయించారన్నారు.

అసద్‌ను గెలిపించేందుకే మోదీ సహకారం..

హైదరాబాదులో అసదుద్దీన్‌ ఒవైసీని గెలిపించేందుకే మోదీ ఇక్కడ హార్డ్‌కోర్‌ హిందుత్వవాదికి టికెట్‌ ఇచ్చారని సీఎం రేవంత్‌ ఆరోపించారు. 60 శాతం ముస్లింలున్న హైదరాబాదులో ముస్లింకు కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే మాధవీలతకు టికెట్‌ ఇవ్వడం వెనక ఆంతర్యం ఇదేనన్నారు. నిజానికి, అసదుద్దీన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఓడిపోయే పరిస్థితి ఉందని, కానీ, ఆయను గెలిపించేందుకు.. ముస్లిముల ఓట్లను పోలరైజ్‌ చేయడానికే మాధవీలతకు మోదీ టికెట్‌ ఇచ్చారని అన్నారు. మాధవీలత హిందూ ముస్లిముల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, దీంతో తీవ్ర అభద్రతా భావంలో ముస్లింలు తప్పని పరిస్థితుల్లో తమ ఓట్లు ఒవైసీకే వేయాల్సి వస్తోందని చెప్పారు. మళ్లీ ఒవైసీని గెలపించే ప్రణాళిక ఇదని, దీనిని మోదీ రూపొందించారని ఆరోపించారు. కార్యక్రమానికి ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మోడరేటర్‌గా వ్యవహరించగా... మీడియా అకాడమీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేణుగోపాలనాయుడు పాల్గొన్నారు.


‘పుల్వామా’ కేంద్ర వైఫల్యమే..

దేశ అంతర్గత భద్రత కేంద్రం బాధ్యతని, దానిని నెరవేర్చడంలో మోదీ సర్కారు విఫలమైందని పుల్వామా ఘటనతో తేలిపోయిందని సీఎం రేవంత్‌ ఆరోపించారు. అసలు పుల్వామా ఘటన ఎందుకు జరిగిందో కేంద్రం ఇంతవరకు వెల్లడించలేదని, తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు తర్వాత సర్జికల్‌ స్టైక్‌ అన్నారని వివరించారు. ‘‘సర్జికల్‌ స్ర్టైక్‌ జరిగిందో లేదో ఎవ్వరికీ తెలియదు. కేంద్రాన్ని ఏమైనా ప్రశ్నిస్తే జై శ్రీరాం అంటున్నారు. మాకు జైశ్రీరాం తాతల నాటినుంచే తెలుసు. బీజేపీ వారు అన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, చేసిన పనులు చెప్పుకునేందుకు ఏమీలేక.. దేవుడి పేరు వాడుకుంటోంది’’ అని విమర్శించారు.

మోదీ రిటైర్‌ అవుతారా!?

రాజకీయాల నుంచి 75 ఏళ్లకు రిటైర్‌ కావాలని స్వయంగా మోదీ చెప్పారని, ఆ కారణంతోనే ఆడ్వాణీ, మురళీ మనోహన్‌ జోషీలను పక్కనబెట్టారని, ఇప్పుడు మోదీ వయసు 74 ఏళ్లని, వచ్చే ఏడాది ఆయన రాజకీయాల నుంచి రిటైర్‌ అవుతారా..? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన మోదీ కనీస అవగాహన లేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ముస్లిములలోని దూదేకులకు ఎప్పటి నుంచో రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. వైఎ్‌సఆర్‌ ఆర్థిక ప్రాతిపదికనే ముస్లిములకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని మేనిఫెస్టోలో చెప్పామని, దాంతో కంగారుపడి.. రాజకీయ లబ్ధి కోసం మోదీ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.


జగన్‌.. ముందు ఇల్లు సరిదిద్దుకో

ఏపీలో టీడీపీ గెలిస్తే రాష్ట్రం తెలంగాణ చేతుల్లో ఉంటుందన్న జగన్‌ విమర్శలపై సీఎం రేవంత్‌ స్పందించారు. ఆయన మాటలను సొంత చెల్లి, కన్నతల్లే విశ్వసించడం లేదని, అటువంటప్పుడు ఆయన మాటలకు విలువ లేదని కొట్టిపారేశారు. ముందుగా చెల్లి, కన్నతల్లి మాటలకు బదులివ్వాలని జగన్‌కు సూచించారు. ముందు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలని జగన్‌ను కోరుతున్నానన్నారు. చంద్రబాబుపై గౌరవం ఉందని, కానీ, రాజకీయ సంబంధాలు లేవని చెప్పారు. ఏపీలో షర్మిల ముఖ్యమంత్రి అవుతారని, అక్కడ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.

బీజేపీపై పోరాటం సామాజిక బాధ్యత..

అన్ని మతాలు సోదరభావంతో ఉంటున్న దేశంలో బీజేపీ చిచ్చు పెడుతోందని, అందుకే కాషాయ పార్టీపై తన పోరాటమని సీఎం రేవంత్‌ అన్నారు. తనతోపాటు కాంగ్రెస్‌ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించిందని, ఇప్పుడు హైదరాబాదులో అనేకమంది ఢిల్లీ పోలీసులు ఉన్నారని, ఫేక్‌ వీడియో పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - May 11 , 2024 | 05:31 AM