అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:25 AM
రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నారాయణపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట
వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా
పూర్తి నివేదిక అందగానే పరిహారం: తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నారాయణపేట, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో 2,200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. వరి, మొక్కజొన్నతోపాటు ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు. రంగారెడ్డి, నిర్మల్, జనగామ జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు 920 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు మరో నివేదికలో పేర్కొన్నారు. అంటే రెండు రోజుల్లో కలిపి 3,120 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మెదక్, పెద్దపల్లి, వనపర్తి, జగిత్యాల, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, మహబూబాబాద్.. తదితర జిల్లాల్లో కూడా అకాల వర్షాలతో పంటనష్టం జరిగింది. ఈ వివరాలను కూడా వ్యవసాయశాఖ అధికారులు సేకరిస్తున్నారు. పంట నష్టంపై రైతులవారీగా వివరాలను సేకరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రైతు పేరు, పంట పేరు, సర్వే నంబరు, జరిగిన పంట నష్టం, పట్టాదారు పాసుపుస్తకం ఖాతా నంబరు, బ్యాంకు అకౌంట్ నంబరు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్, బ్యాంకు పేరు.. తదితర సమగ్ర వివరాలు సేకరించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి క్రాప్ బుకింగ్ యాప్‌లో సాగు వివరాలు నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా రైతుల వారీగా సర్వే చేస్తున్నారు. వడగళ్లు, గాలి దుమారాలు, అకాల వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలపై రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశాలున్నాయి.
నివేదికలు వచ్చాక పరిహారం: తుమ్మల
వర్షాలతో జరిగిన పంట నష్టంపై అధికారులు సర్వే చేస్తున్నారని, నివేదికలు అందిన వెంటనే నష్టపరిహారం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల వారీగా సర్వే చేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. గత మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టంపై సర్వే పూర్తయిందని, రైతులకు నష్టపరిహారం పంపిణీ చేయటానికి ఎన్నికల సంఘం అనుమతి కోరినట్లు తెలిపారు. ఇంతవరకు అనుమతి రాలేదని, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని... మరోమారు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు కాగా వానాకాలం సీజన్‌కు సరఫరాచేసే పచ్చిరొట్ట విత్తనాల టెండర్ల నిర్వహణకు అనుమతి ఇచ్చినందుకు ఎన్నికల సంఘానికి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.