Share News

Hyderabad: పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల విధులు.. హోంగార్డుల జీతాల్లో కోత

ABN , Publish Date - May 16 , 2024 | 05:34 AM

వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్‌ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.

Hyderabad: పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల విధులు.. హోంగార్డుల జీతాల్లో కోత

  • ఇక్కడ గైర్హాజరంటూ డీడీఏలోనూ కోత

  • ఇతర రాష్ట్రాల్లో అదనపు భత్యాలు

  • ఇక్కడ మాత్రం జీతాల్లో కోతలు

  • గతంలో మధ్యప్రదేశ్‌లో హోంగార్డు మృతి

  • ఆ కుటుంబానికి ఇంకా అందని సాయం

  • హోంగార్డులకు జీవిత బీమా దక్కని వైనం

హైదరాబాద్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్‌ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది. నిజానికి భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చెప్పిన సంఖ్యలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాల ఎన్నికల విధులకు పోలీసులను పంపాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు రెండో ఆలోచన లేకుండా పంపించేది హోంగార్డులనే..! లోక్‌సభతో పాటు.. పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా హోంగార్డులను ఆయా రాష్ట్రాలకు తరలించారు. ముఖ్యంగా తెలంగాణ హోంగార్డులు ఛత్తీ్‌సగఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఇక్కడ మాత్రం గైర్హాజరీ

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు తమ సొంత యూనిట్లలో గైర్హాజరు వేస్తున్నారు. దాంతో వేతనంలో కోతతోపాటు.. రోజువారీ విధులకు సంబంధించిన భత్యం(డీడీఏ) కూడా దక్కడం లేదు. ఎన్నిరోజులు పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తే.. అన్ని రోజులు ఇక్కడ వేతనంలో కోత విధిస్తున్నారు. నిజానికి హోంగార్డుకు రోజంతా పనిచేస్తే.. ఓ తాపీ మేస్త్రీకి దక్కే కూలీ కంటే తక్కువగా గౌరవ వేతనం(రూ.921) వస్తోంది. ఇక్కడ విధులు నిర్వర్తించినప్పుడు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం 24 గంటలూ నిలువుకాళ్ల జీతం చేస్తున్నారు. 24 గంటలూ కష్టపడ్డా వారికి ఈసీఐ ద్వారా అదే రూ.921 దక్కుతోంది. ఆయా రాష్ట్రాల్లో డైట్‌ చార్జీల కింద రూ.250 అదనంగా ఇస్తారు. డైట్‌ చార్జీల వంకతో ఉన్నతాధికారులు వీరికి భోజన వసతులను సైతం కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ చేతిలో లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేకుండా పనిచేసే తమ పట్ల ఇంతటి వివక్ష తగదని హోంగార్డులు వాపోతున్నారు. కానిస్టేబుళ్లు ఇతర రాష్ట్రాల్లో బందోబస్తు నిర్వహిస్తే వారికి రవాణా భత్యం, ఇతర భత్యాలు అందుతాయని గుర్తుచేస్తున్నారు. తమకు గైర్హాజరు పేరుతో వేతనంలో కోత విధించకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించి, విధులు నిర్వర్తించి, తిరిగి వచ్చిన వెంటనే విశ్రాంతి కూడా లేకుండా వెంటనే డ్యూటీలో చేరాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేస్తున్నారని, కానిస్టేబుళ్ల మాదిరిగా తమకు కూడా సాంత్వన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


పొరుగు రాష్ట్రాల్లోనే నయం!

ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హోంగార్డులకు గౌరవ వేతనంతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు అదనపు భత్యం, ఈసీఐ ఇచ్చే వేతనం లభిస్తోంది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు పలువురు హోంగార్డులు వచ్చారు. వారి డైట్‌ చార్జీలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర హోంగార్డులు వివరిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నారు.


ఇతర రాష్ట్రాల్లో చనిపోతే అంతే..?

పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించే హోంగార్డులను మరో భయం వెంటాడుతోంది. అక్కడ విధి నిర్వహణలో మరణిస్తే.. తమ కుటుంబాలు రోడ్డున పడడం తప్ప.. ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన శ్యామ్‌కుమార్‌అనే హోంగార్డు.. గుండెపోటుతో మృతిచెందారు. అప్పట్లో ఉన్నతాధికారులు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఇచ్చిన రూ.10 వేలు తప్ప.. శ్యామ్‌కుమార్‌ కుటుంబానికి దక్కిందేమీ లేదు. హోంగార్డులకు ప్రభుత్వం జీవిత బీమాను కల్పిస్తున్నా.. శామ్‌కుమార్‌ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, అది సహజ మరణమని పేర్కొంటూ బీమా కంపెనీ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానిస్టేబుళ్ల విషయంలో భద్రత ఉంటుందని, వారిని కాదని.. తమను ఇతర రాష్ట్రాలకు పంపడమేంటని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - May 16 , 2024 | 05:34 AM