Phone Tapping Case: భుజంగరావుపై మరో కేసు..
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:15 AM
ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
ఖైతలాపూర్‌లో 340 ఎకరాల భూ దందా
ఏసీపీగా ఉన్నప్పుడు నిందితులకు సహకారం
బాధితులను భయపెట్టినట్లు ఆరోపణలు
సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు
రంగంలోకి ఈవోడబ్ల్యూ బృందాలు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భుజంగరావు ఏసీపీగా ఉన్నప్పుడు ఖైతలాపూర్‌లోని 340 ఎకరాల భూ దందాలో నిందితులకు సహకారం అందించారంటూ వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తునకు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)కు ఆదేశాలు జారీ చేశారు. మీర్ అబ్బాస్ అలీఖాన్ అనే వ్యక్తి తన తండ్రి నవాబ్ మీర్ హుస్సేన్ అలీఖాన్‌కు వారసత్వంగా 340 ఎకరాల ఆస్తి సంక్రమించినట్లు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 1952 నుంచి రిజిస్టర్డ్ సేల్‌డీడ్ పత్రాలున్నాయని.. ఆ భూమి 1960 నుంచి తన తండ్రి స్వాధీనంలో ఉన్నట్లు వివరించారు. పదేళ్ల క్రితం ఎస్‌ఎస్ మొహియుద్దీన్, యాసీన్ శేఖర్, శ్రీనివాసరావు(ప్రైమ్ ప్రాజెక్ట్స్) తన తండ్రిని సంప్రదించినట్లు తెలిపారు.
అప్పటికి తన తండ్రికి న్యాయపరమైన అంశాలపై అవగాహన లేకపోవడానికి తోడు ఆర్థిక కష్టాలను అనుకూలంగా మలచుకున్న ఈ ముగ్గురూ.. భాగస్వామిగా ఉంటే.. డెవల్‌పమెంట్ చేస్తామని నమ్మించినట్లు వివరించారు. నకిలీ దస్త్రాలను సృష్టించి, 340 ఎకరాలను కొట్టేయడానికి ప్రయత్నించారని, విషయం తెలుసుకున్న మీర్ హుస్సేన్ అలీఖాన్ 2014లో కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఆ సమయంలో కూకట్‌పల్లి ఏసీపీగా ఉన్న భుజంగరావును నిందితులు కలిశారని, వారికి ఆయన అండగా నిలిచారని ఆరోపించారు. ‘‘ఈ క్రమంలో ఏసీపీ ఆదేశాలతో పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేశారు. బాధించారు. కేసు నుంచి తప్పుకోవాలంటూ బెదిరించారు.
ఈ వ్యవహారంలో భుజంగరావు కీలక పాత్ర పోషంచారు’’ అని బాధితుడు సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులనే భయపెట్టి ఠాణాలో కూర్చోబెట్టాలని కూకట్‌పల్లి పోలీసులును భుజంగరావు ఆదేశించినట్లు చెప్పారు. తమను భయపెట్టి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించుకున్నట్లు వివరించారు. 2020లో తన తండ్రి చనిపోయారని, ఆయన మరణ ధ్రువీకరణ పత్రాన్ని సైతం నకిలీది సృష్టించి, ఆస్తిని కొట్టేయాలని కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి గ్రీన్‌కో కంపెనీ ఎండీ చామలశెట్టి అనిల్ ఫండింగ్ చేశారని ఆరోపించారు. కేసును రీఓపెన్ చేస్తే.. భుజంగరావు అక్రమాలు వెలుగులోకి వస్తాయని సీపీకి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన సీపీ.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఈవోడబ్ల్యూని ఆదేశించారు. కూకట్‌పల్లి కేసును రీఓపెన్ చేసి, లోతుగా పరిశీలించి.. నిజానిజాలను నిగ్గుతేల్చాలని సూచించారు.