Share News

Farmers: పత్తి రైతుకు తేమ దిగులు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:44 AM

అన్నదాతను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి పగ బట్టినట్లుగా అకాల వర్షాలతో పంటలపై ప్రభావం చూపగా, చేతికొచ్చిన పంటకు తేమ శాతం పెరుగుతుండటంతో మద్దతు ధర లభించే పరిస్థితి కనిపించట్లేదు.

Farmers: పత్తి రైతుకు తేమ దిగులు!

  • మొదలైన సీసీఐ కొనుగోళ్లు అకాల వర్షాలతో పెరుగుతున్న తేమ

  • 8 నుంచి 12 శాతం లోపు ఉంటేనే మద్దతు ధర..

  • తేమ శాతం నిర్ధారణకు ప్రత్యేక కమిటీలు వేస్తామన్న మంత్రి సురేఖ

వరంగల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అన్నదాతను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రకృతి పగ బట్టినట్లుగా అకాల వర్షాలతో పంటలపై ప్రభావం చూపగా, చేతికొచ్చిన పంటకు తేమ శాతం పెరుగుతుండటంతో మద్దతు ధర లభించే పరిస్థితి కనిపించట్లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తితో పాటు ధాన్యంపై కూడా తేమ శాతం పెరుగుతోంది. దీంతో సీసీఐ, మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు తేమ పేరుతో భారీగా కోత విధిస్తుండటంతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. సోమవారం వరంగల్‌ ఎనుమాముల వ్యయసాయ మార్కెట్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. నెల రోజుల క్రితమే పత్తి మార్కెట్లోకి వస్తున్నా సీసీఐ కొనుగోళ్లను చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5,200 నుంచి రూ.7 వేల వరకు చెల్లించి పత్తిని కొనుగోలు చేశారు. అయితే సీసీఐ క్వింటాల్‌కు రూ.7,521 చెల్లిస్తోంది. దీంతో నెల రోజులుగా ఐదారు లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి భారీగా నష్టపోయామని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 320 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


  • తేమపై రైతుల్లో టెన్షన్‌..

అకాల వర్షాలతో భారీగా పడిపోయిన దిగుమతి దిగులు నుంచి దూది రైతులు కోలుకోక ముందే తేమ టెన్షన్‌ పెడుతోంది. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 శాతం మించి ఉండకూడదనే సీసీఐ నిబంధన రైతులను కలవర పెడుతోంది. నెలన్నర రోజులకు పైగా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చే పత్తి తడుస్తూ ఉండటంతో.. ఇంటికి తెచ్చి ఆరపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత శ్రమించినా తేమ శాతం మాత్రం పత్తిలో భారీగానే ఉం టుంది. దీంతో సీసీఐ వద్ద కూడా మద్దతు ధర వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ఇక కౌలు రైతులకు కొనుగోళ్ల చెల్లింపులపై సాంకేతిక సమస్యలు వస్తున్నా యి. సీసీఐ కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తున్న నేపథ్యంలో.. కౌలు రైతులు సీసీఐ వద్ద తమ పత్తిని విక్రయించాలంటే భూయాజమానుల నుంచి ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ బుక్‌ తీసుకెళ్లాల్సిందే. అయితే చాలా మంది ఆధార్‌ కార్డు, బ్యాంకు బుక్‌ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో గత్యంతరం లేక దళారులకే పత్తిని విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. తేమ నిబంధనలను కాస్తంత సడిలింపులతో పాటు కౌలు రైతులు తమ ఆధార్‌, పాస్‌బుక్‌ ఇచ్చేలా సీసీఐ అధికారులతో చర్చిం చి ఒప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


  • ప్రతి బస్తా కొనుగోలు చేస్తాం: సురేఖ

పత్తి రైతుల ఆందోళనల నేపథ్యంలో తేమ శాతాన్ని నిర్ధారించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రత్యేక కమిటీలను నియమి స్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ప్రతి బస్తా పత్తిని కొనుగోలు చేస్తామని.. మూడ్రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని వెల్లడించారు.

Updated Date - Oct 22 , 2024 | 04:44 AM