Hyderabad: ‘చర్లపల్లి’ నుంచి పట్నం నరేందర్ రెడ్డి విడుదల
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:12 AM
లగచర్ల ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కుషాయిగూడ, కంది, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటన నిందితుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గురువారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బుధవారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన వారి కూడా బెయిల్ మంజూరయినా పత్రాలు అందక సంగారెడ్డి జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. విడుదలయిన సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ‘న్యాయం గెలిచింది’, ఇది ‘బీఆర్‌ఎస్ పోరాటానికి దక్కిన మరో విజయమని’ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కక్ష సాధింపులకు పాల్పడకుండా, చేతనైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా, కేటీఆర్‌ను కూడా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జైలు వద్దకు చేరుకొని పట్నం నరేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. ఇదే సంఘటనలో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న 28 మంది లగచర్ల గ్రామస్థులు మాత్రం గురువారం విడుదల కాలేదు. వారికి కూడా బుధవారం నాంపల్లి కోర్టు బెయిలు మంజూరు చేసింది. వారు విడుదలవుతారని భావించి కందిలోని సంగారెడ్డి సెంట్రల్ జైలు వద్ద ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, సంగారెడ్డి రూరల్, కొండాపూర్, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ల సీఐల ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. సాయంత్రం ఆరు గంటల వరకు కూడా బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో విడుదల చేసే సమయం మించిపోయింది. వాటిని తీసుకొని న్యాయవాదులు రాత్రి 9 గంటల ప్రాంతంలో జైలుకు వచ్చారు. గడువు దాటిపోవడంతో ఆ పత్రాలను గేటుకు ఉన్న బాక్స్‌లో వేసి వెళ్లిపోయారు.