Unsafe Abortions: విచ్చలవిడిగా గర్భవిచ్ఛిత్తి!
ABN , Publish Date - Nov 05 , 2024 | 04:32 AM
అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి సురక్షితమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు! గ్రామాల్లో సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించింది.
గ్రామీణ మహిళల్లో అవగాహన లేమి
సొమ్ము చేసుకుంటున్న ఆర్‌ఎంపీలు
ములుగు, సిద్దిపేట ఘటనలతో కలకలం
మార్కెట్లో అందుబాటులో అబార్షన్ పిల్స్
వైద్యుల సిఫారసు లేకున్నా విక్రయాలు
అమ్మకాలపై సర్కారు పర్యవేక్షణ ఏదీ?
వరంగల్/వరంగల్ మెడికల్, హైదరాబాద్ సిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి సురక్షితమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు! గ్రామాల్లో సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించింది. కానీ.. చాలా మంది గ్రామీణ మహిళల అమాయకత్వాన్ని కొందరు ఆర్‌ఎంపీలు అవకాశంగా తీసుకుని విచ్చలవిడిగా, సురక్షితం కాని విధానాల్లో అబార్షన్లు చేసి వారి ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు! ఇటీవల ములుగు జిల్లాలో ఇద్దరు, సిద్దిపేట జిల్లాలో ఒక మహిళ.. అబార్షన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకుండా ఆర్‌ఎంపీలను సంప్రదించి, మందుల దుకాణాల్లో అడిగి నకిలీ మాత్రలు వాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి.. కడుపులో పెరిగే శిశువు వల్ల తల్లికి ప్రాణానికి అపాయం ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేనప్పుడు, ఇద్దరు బిడ్డలున్న తల్లి మూడో కాన్పు వద్దనుకున్నప్పుడు.. గైనకాలజిస్టు అనుమతితో భర్త అంగీకారంతో అబార్షన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. అబార్షన్ చేసే సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పని సరిగ్గా ఆ మహిళ వెంట ఉండాలి. తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు కూడా చేయించాలి.
రక్తం తక్కువగా ఉన్నప్పుడు గర్భస్రావం చేస్తే.. తల్లి ప్రాణాలకే ముప్పు. ఇన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టే.. చాలామంది మహిళలు గర్భస్రావం కోసం ప్రభుత్వ, ప్రైవేటు అస్పత్రులకు వెళ్లేందుకు మొహమాటం పడుతున్నారు. గుట్టుగా ఆర్‌ఎంపీలను సంప్రదించి కడుపులో పిండాన్ని తొలగించుకునేందుకే మొగ్గు చూపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారి అవసరాన్ని ఆర్‌ఎంపీలు సొమ్ము చేసుకుంటున్నారు. మహిళల ఆర్థిక పరిస్థితులను బట్టి గర్భ విచ్ఛిత్తికి ధర నిర్ణయించి భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ఏడు వారాలు దాటిన గర్భిణికి గర్భస్రావం చేయాలంటే స్కానింగ్ తప్పనిసరి. కానీ, కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఎలాంటి పరీక్షలూ లేకుండానే గర్భ విచ్చిత్తి మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అవి వికటించడంతో చాలా మంది మహిళలు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. గర్భవిచ్ఛిత్తికి సంబంధించి వైద్యులు ఇచ్చే రెండు ఔషధాలూ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ కిందికి వస్తాయి. వాటిని ప్రిస్ర్కిప్షన్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మకూడదు. ఏ డిస్ట్రిబ్యూటర్ వద్ద కొన్నామో, ఎవరికి అమ్ముతున్నామో అనే వివరాలు విధిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ.. అత్యధిక మందుల దుకాణాలు ఈ నిబంధనను పట్టించుకోవట్లేదు. అయినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డులు ఉండట్లే!
గర్భస్రావంచేసే నర్సింగ్‌హోమ్‌లు.. ‘మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ), 1971’ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి. అబార్షన్ చేసిన వారి వివరాలు పూర్తి సమాచారంతో రికార్డులో నమోదు చేసి ఉండాలి. భర్త, భార్య సంతకాలు ఉండాలి. ఎందుకు అబార్షన్ చేయాల్సి వస్తోందో అందులో వివరించాలి. కానీ చాలా నర్సింగ్‌హోములు ఇలాంటి రికార్డులను నిర్వహించడం లేదు. అలాగే.. గర్భస్రావం చేయాలంటే ఆధునాతన సదుపాయాలు, పరికరాలు, ఐసీయూ వంటివి ఉండాలి. ఐసీయూ సదుపాయం లేకపోతే గర్భిణికి ప్రాణాపాయం ఏర్పడినప్పుడు ఉరుకులు పరుగుల మీద మరో ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తుంది. అలాగే.. ఆపరేషన్ థియేటర్‌లోకి ఎవరు పడితే వారు వెళ్లకూడదు. నర్సింగ్ స్టాఫ్ ఆ సమయంలో ధరించాల్సిన దుస్తులు, మాస్క్‌లు ధరించాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో ఈ నిబంధనలేవీ పాటించట్లేదు సరికదా.. ఆపరేషన్ థియేటర్‌లోకి ఎప్పుడు పడితే అప్పుడు నర్సింగ్ స్టాఫ్ తిరుగుతునే ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్సలకు కావాల్సిన వాతావరణం ఉండదని వైద్యులు తెలిపారు.
పరారీలో ఆర్‌ఎంపీ
వరంగల్ మెడికల్: ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన గర్భిణికి అబార్షన్ మాత్రలు ఇచ్చిన ఆర్‌ఎంపీని... మంగపేటకు చెందిన రాముగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. అయితే.. అతడు ఇంటికి తాళం వేసి పరారైనట్టు తెలిసింది. దీంతో ఆ ఆర్‌ఎంపీ కోసం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెతుకుతున్నారు.
పిల్స్.. ఎలా పడితే అలా వద్దు
గర్భవిచ్ఛిత్తికి సంబంధించిన మాత్రలను ఎలా పడితే అలా వేసుకోకూడదు. కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వేసుకోవాలి. గర్భం ఎన్ని వారాలు ఉంది? గర్భిణి పూర్వచరిత్ర ఏమిటి? ఇలా చాలా విషయాలను పరిశీలించి.. అసలు గర్భస్రావం చేయాలా వద్దా? చేస్తే ఎలా చేయాలి? అనే నిర్ణయాలను వైద్యులు తీసుకుంటారు. పిల్స్ వేయలేని వారిని ఆస్పత్రిలో ఉంచి డి అండ్ సీ విధానంలో అబార్షన్ చేయాల్సి ఉంటుంది. ఏడు వారాల లోపు గర్భం ఉన్నప్పుడే మాత్రల గురించి ఆలోచిస్తారు. 9 వారాలు దాటితే సర్జికల్ ప్రక్రియ చేయాలా? మెడికల్ మేనేజ్‌మెంట్ చేయాలా అనే విషయంపై డాక్టర్ నిర్ణయం తీసుకుంటారు. అలాగే.. కొంత మందికి గర్బసంచిలో కాకుండా గర్భాశయ నాళాల్లో పిండం ఏర్పడుతుంది. ఆ పిండాన్నితొలగించడానికి పిల్స్ పనిచేయవు. ఒక వేళ వేసుకుంటే ట్యూబ్‌లో ఉన్న పిండం బయటకు రాకుండా, లోపల ఉండకుండా చిట్లిపోయి రక్తస్రావం అవుతుంది. రిజిస్ట్రేషన్ లేని వైద్యులు పిల్స్‌ను యాంటిబయాటిక్ మెడిసిన్ మాదిరిగా ఇస్తున్నారు. దీంతో ఓవర్ బ్లీడింగ్ జరిగి ప్రాణాల మీదకు వస్తుంది. ఆ మాత్రలను కూడా.. సరైన మోతాదు, నిర్ణీత పద్ధతి ప్రకారం ఇవ్వాలి. కొంతమంది.. ఒకసారి వేసుకున్న మాత్రలు పనిచేయకపోతే రెండు, మూడు పిల్స్ వేసుకుంటున్నారు. అలా వేసుకోవడం మరింత ప్రమాదం.
- డాక్టర్ హవ్య పోలవరపు, సీనియర్ గైనకాలజిస్టు, కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రి
వైద్య నిపుణుల సలహా తప్పనిసరి
గర్భవిచ్ఛిత్తి మాత్రలను గైనకాలజిస్టు సలహా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఆ మాత్రల వల్ల అధిక రక్తస్రావం కావడంతోపాటు.. పిండ కణజాలం లోపలే కొంతమేర మిగిలి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తొలగించకపోతే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది గర్భిణి ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. తద్వారా శరీరం మొత్తం విషతుల్యమై ప్రాణాపాయం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి.. ఆర్‌ఎంపీలు, పీఎంపీల సలహాలు పాటించి ప్రాణం మీదికి తెచ్చుకోవద్దు. నిపుణులైన వైద్యుల సలహా ప్రకారం నడుచుకోవాలి.
- డాక్టర్ నరేశ్ కుమార్ వేములపల్లి, చైర్మన్ పబ్లిక్ రిలేషన్ కమిటీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్
మూడో నెల దాటితే పిల్స్‌తో మరింత ముప్పు
గర్భస్రావం చేయించుకోవాలంటే.. త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఏడు వారాల లోపలే చేయించుకోవడం మంచిది. ఆ తర్వాత పిల్స్ వేసుకుంటే పూర్తిస్థాయిలో అబార్షన్ జరగకపోవచ్చు. కొన్ని పిండం ముక్కలు గర్బంలోపలే ఉండే ప్రమాదం ఉంది. మరికొన్ని గర్భసంచి ముఖ ద్వారం వద్ద వచ్చి ఆగిపోతాయి. దాన్ని అసంపూర్తి గర్భస్రావంగా పరిగణిస్తాం. వాటిని పూర్తిగా తొలగించేంత వరకు అవి బయటకు రావు. ఇక.. మూడోనెల దాటితే పిల్స్ వేసుకోవడం మరింత ప్రమాదం. అప్పటకే గర్బస్థ శిశువుకు అవయవాలు ఏర్పడుతాయి. మాత్రల వల్ల కొన్ని పిండం ముక్కలు లోపలే ఉండిపోతే.. ఎక్కువ రక్తస్రావం జరుగుతుంది. బిడ్డ, తల్లి.. ఇద్దరికీ తీవ్ర ఇబ్బందులు వస్తాయి.
- డాక్టర్ పూజిత దేవి, సురనేని,
సీనియర్ గైనకాలజిస్టు, రెయిన్‌బో ఆస్పత్రి