Share News

Hyderabad : రాష్ట్రంపై డెంగీ పంజా

ABN , Publish Date - Jul 10 , 2024 | 05:58 AM

రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్‌లో ఓ వైద్యుడు డెంగీ బారినపడి మృతిచెందారు.

Hyderabad : రాష్ట్రంపై డెంగీ పంజా

  • చేవెళ్లలో బాలుడు, హైదరాబాద్‌లో వైద్యుడి మృతి

  • జనవరి నుంచి 964 కేసుల నమోదు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 327

  • ఎన్‌సీవీబీడీసీ నివేదిక వెల్లడి

  • చేష్టలుడిగిన ప్రజారోగ్య విభాగం

  • మూడు జిల్లాల్లో అత్యఽధిక కేసులు

  • ఎన్‌సీవీబీడీసీ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 11 ఏళ్ల బాలుడు, హైదరాబాద్‌లో ఓ వైద్యుడు డెంగీ బారినపడి మృతిచెందారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 964 డెంగీ కేసులు నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ వెక్టర్‌-బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీవీబీడీసీ) తాజాగా వెల్లడించింది.

గత ఏడాది ఇదే సమయంలో కేవలం 706 కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఈ ఏడాది కేసుల తీవ్రత పెరుగుతున్నట్లు హెచ్చరించింది. మూడు నాలుగు జిల్లాల్లో డెంగీ తీవ్రత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు పేర్కొంది. 61 శాతం కేసులు హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాల్లోనే నమోదైనట్లు తెలిపింది.

రాష్ట్ర రాజధానిలో 327, ఖమ్మం జిల్లాలో 161, మేడ్చల్‌లో 103 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. గత ఏడాది తొలి ఆరు మాసాల్లో ఈ మూడు జిల్లాల్లో కేవలం 282 కేసులే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఈ ఏడాది డెంగీ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగీతో పాటు మలేరియా, చికున్‌గున్యా కేసులు కూడా పెరుగుతున్నాయి. జూన్‌ చివరి నాటికి రాష్ట్రంలో 71 మలేరియా, 33 చికున్‌ గున్యా కేసులు నమోదైనట్టు పేర్కొంది.


ప్రజారోగ్య విభాగం వైఫల్యం

సీజనల్‌ వ్యాధుల కట్టడిలో రాష్ట్ర ప్రజారోగ్య విభాగానిదే కీలక పాత్ర. కానీ దాని వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం.. ముందస్తు ప్రణాళిక లేకపోవడమేనని తెలుస్తోంది. పైగా ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేయని వారిని విభాగాధిపతిగా నియమించడం, అనుభవరాహిత్యం వంటి కారణాలు కూడా తోడవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలోనే కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ చేయలేదని సమాచారం.

డెంగీ బెడద ఉన్న జిల్లాలను ముందుగానే గుర్తించి అక్కడ పెద్దయెత్తున ఫాగింగ్‌, ప్రజలకు అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలి. డీఎంహెచ్‌వోలతో సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేయాలి. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోలే ఉండటంతో పాటు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులుగా కూడా ఇన్‌చార్జినే నియమించడంతో వారిలో సీరియె్‌సనెస్‌ కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

ఈ సీజన్‌లో తెలంగాణకు డెంగీ ప్రమాదం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరించింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డెంగీ తీవ్రత గురించి విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు రాష్ట్రంలో కనిపిస్తున్నాయని పేర్కొంది.

దక్షిణాదిలోనే కేసులు ఎక్కువ

దేశంలో కేరళలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేరళలో జూన్‌ చివరి నాటికి 8,004 కేసులు నమోదు కాగా, 22 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. ఎన్‌సీవీబీడీసీ గణాంకాల ప్రకారం.. కేరళ తర్వాత వరుస స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి. తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది.

Updated Date - Jul 10 , 2024 | 05:58 AM