రాముడు దేవుడు.. కానీ ఆయనను ఓ పార్టీకి లీడర్‌ను చేశారు
ABN , Publish Date - Apr 13 , 2024 | 03:36 AM
రాముడు దేవుడేనని, కానీ ఆయనను ఓ పార్టీకీ లీడర్‌ను చేశారని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు....
మెదక్‌లో ఆ పార్టీ పేరు ఎత్తకండి
ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌స పార్టీల మధ్యే పోటీ
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): రాముడు దేవుడేనని, కానీ ఆయనను ఓ పార్టీకీ లీడర్‌ను చేశారని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గణేశ్‌గడ్డ వద్ద కాంగ్రెస్ ప్రచార రఽథాలను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మంత్రి కొండా సురేఖ.. జగ్గారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాముడిని లీడర్‌ను చేసిన ఆ పార్టీ పేరును మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎక్కడా ప్రస్తావించవద్దన్నారు. ఈ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇక మూడో అభ్యర్థి తమకు పోటీయే కాదని చెప్పారు. దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డపై మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామన్నారు. కాగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ బీసీ అయినప్పటికీ అన్ని కులాల మద్దతు అవసరమన్నారు. అన్ని కులాలు మతాలతో కూడుకున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం సంగారెడ్డిలో తన భార్య నిర్మల కష్టపడుతున్నారని, తాను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని తెలిపారు. తొలుత మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఇందిరమ్మ గెలిచారని, ఆ తర్వాత దివంగత మాజీ మంత్రి ఎం.బాగారెడ్డి పలుమార్లు గెలిచి పార్టీనీ బలోపేతం చేశారన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించాలని, ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని జగ్గారెడ్డి కోరారు.