Deputy CM Pawan Kalyan: అడవి తల్లికి బాటలు
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:01 AM
గిరిజనులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను తీర్చేందుకు పవన్‌కల్యాణ్ ₹1,000 కోట్లతో 'అడవి తల్లి బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డోలీమోతల రహిత మన్యం ప్రాంతాన్ని లక్ష్యంగా పెట్టుకొని సుదూర గ్రామాలకు రహదారులు నిర్మిస్తున్నారు.

డోలీ మోతల రహిత మన్యమే లక్ష్యం.. గిరిజన బిడ్డల మేలుకు కూటమి కట్టుబడింది
మాకు ఓట్లు వేయకపోయినా ప్రగతి చర్యలు
గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు నిధులడిగితే
24 గంటల్లో 49 కోట్లు మంజూరుచేసిన సీఎం
వైసీపీ హయాంలో ఏపీలో కేవలం 92 కి.మీ.రోడ్లు
ఏడాదిలోనే 1,069 కి.మీ.రహదారులు నిర్మించాం
అరకులోయను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తాం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడి
‘అడవితల్లి బాట’లో 373 రోడ్ల పనులకు
అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో శంకుస్థాపన
డుంబ్రిగుడ/పాడేరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): మన్యం ప్రాంతాన్ని డోలీమోతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వెల్లడించారు. సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో జరిగిన ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, నంద్యాల, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో రూ.1,005 కోట్లతో చేపట్టనున్న 373 రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పవన్‌కల్యాణ్ మాట్లాడారు. ‘‘రహదారులు లేక గిరిజన ప్రజలు పడుతున్న ఇబ్బందులను 2018లో పాడేరు, అరకులోయ ప్రాంతాల పర్యటనలో గమనించాను. వారి కష్టాలను తీర్చే శక్తి ఇవ్వాలని ఈనాడు దేవుడిని కోరుకున్నాను. ఇప్పటికి ఆ అవకాశం దక్కింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే గిరిజన ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి రూ.49 కోట్లు అడిగితే 24 గంటల్లోనే సీఎం చంద్రబాబు మంజూరు చేశారు.
వాటితో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని రెండు గ్రామాలకు పక్కా తారురోడ్లు వేశారు. ఆదాయం, రాజకీయ ప్రయోజనాలు వంటివి ఆశించకుండా గిరిజన బిడ్డలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోంది.’’ అని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈ ప్రాంతంలో తమకు ఓట్లు వేయకపోయినా.. గిరిజనుల కోసం రోడ్లు వేస్తున్నామని వ్యాఖ్యానించారు.
పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘అరకులోయ (వైసీపీ) ఎంపీ, ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. రాజకీయంగా భిన్నమైన భావాలుంటాయి. అంతమాత్రాన ఎవరూ శత్రువులు కాదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమష్టిగా పనిచేయాలి’’ అని అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం 92 కిలోమీటర్ల రోడ్డు వేయగా, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ.1,500 కోట్లతో 1,069 కిమీ రహదారులు నిర్మించిందన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని, తాము వచ్చాక 13,326 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరుచేశామని వివరించారు. ఈ ఏడాది 1,077 గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని, మిగిలిన గ్రామాలకు కూడా రానున్న రోజుల్లో రోడ్లు వేస్తామని తెలిపారు. కూటమి 15 ఏళ్లు పాలిస్తేనే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్నివిధాలా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మన్యంలో (పాడేరు, అరకునియోజకవర్గాలు) కూటమి జెండా ఎగురవేయాలని కోరారు.
అడవి బిడ్డలతో పవన్ మమేకం
అల్లూరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ విశాఖపట్నం నుంచి నేరుగా చాపరాయి ప్రాంతానికి చేరుకున్నారు. చాపరాయి గెడ్డ మీదుగా సుమారు కిలోమీటరు రోడ్డుమార్గంలో కలినడకన పెదపాడు చేరుకున్నారు. స్థానిక గిరిజనులు థింసా నృత్యాలు, డప్పుల వాయిద్యాలతో ఊరేగింపుగా గ్రామానికి తీసుకువెళ్లారు. పూలమాల వేసి, తిలకం దిద్ది గిరిజన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన సీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణులను ఆశీర్వదించారు. పోషకాహార కిట్లు అందజేశారు. ప్రాథఽమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మమేకయ్యారు. గిరిజనులు మాట్లాడే కోందు, కువిల భాషల గురించి అడిగి తెలుసుకున్నారు. కువి భాషలోని పదాలను తెలుగులో రాయించుకుని సరదాగా సంభాషించారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి, విత్తనాల ప్రదర్శనను తిలకించారు. ఒక వృద్ధురాలు అందించిన అడ్డాకులతో తయారుచేసిన టోపీని పవన్‌కల్యాణ్ ధరించారు.
ట్రాఫిక్‌తో పరీక్ష రాయలేకపోయాం: విద్యార్థులు
పవన్‌కల్యాణ్ పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన ఆంక్షలతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయలేకపోయామని విశాఖజిల్లా పెందుర్తికి చెందిన 23 మంది విద్యార్థులు తెలిపారు. పవన్ కాన్వాయ్ రోడ్డుమార్గంలో పెందుర్తిమీదుగా వెళ్లింది. ఆ మార్గంలోనే తమ పరీక్షా కేంద్రం ఉండటంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని, రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన తమను నిర్వాహకులు పరీక్ష రాయనీయలేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్‌కల్యాణ్, వాస్తవం ఏమిటనేది విచారణ జరపాలని ఆదేశించారు. అయితే, ట్రాఫిక్ ఆంక్షల కారణంగా జేఈఈ మెయిన్స్ రాయాల్సిన విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదని వెస్ట్ ఏసీపీ పృథ్వీతేజ్ తెలిపారు.
వెయ్యి కోట్లతో అడవితల్లి బాట
అమరావతి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ‘అడవి తల్లి’కి బాటలు పడుతున్నాయి. గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసే పరిస్థితి ఉండేది కాదు. ఏజెన్సీ ప్రాంతాల్లో నడక దారులు తప్ప వేరే గత్యంతరం లేకపోయేది. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల నక్సల్ బెడద తగ్గినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో ప్రతి రోజూ ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీమోతలు వార్తల్లోకెక్కుతూ ఉండేవి. కేంద్రం పీఎం-జన్మాన్ కింద మంజూరుచేసిన రూ.555 కోట్లను గత వైసీపీ సర్కారు పెద్దగా వినియోగించుకోలేకపోయింది. ఈ పథకం కింద రూ.80 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఏజెన్సీలో రహదారుల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. పీఎం-జన్మాన్ నిధులతో రూ.555 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. డోలీ మోతలున్న పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్(పీవీటీజీ) ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.400 కోట్లు సమకూర్చగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.50 కోట్లు మంజూరు చేసింది. వెరసి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో రూ.1000 కోట్లతో ‘అడవి తల్లికి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..