Share News

Hyderabad: కాంగ్రెస్‌, బీజేపీలు సింగరేణిని ఖతం చేస్తాయా?

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:12 AM

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపగలిగింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ఖతం చేయాలని చూస్తున్నాయి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

Hyderabad: కాంగ్రెస్‌, బీజేపీలు సింగరేణిని ఖతం చేస్తాయా?

  • తెలంగాణలో మాత్రం వేలమా?

  • బీజేపీ రిటర్న్‌గిఫ్ట్‌ ఇదేనా?: కేటీఆర్‌

  • టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే.. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపింది

  • తెలంగాణలో గనుల వేలం ఆపలేరా?

  • ఎవరికిచ్చినా మేం వచ్చాక రద్దే

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

  • గతంలో వేలం వద్దన్న రేవంత్‌.. ఇప్పుడెలా సమర్థించుకుంటారని ప్రశ్న

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపగలిగింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ఖతం చేయాలని చూస్తున్నాయి’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు సింగరేణిని ప్రైవేటీకరించాలన్న కుట్రను ఆపలేకపోతున్నాయని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లిస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్‌ చెబితే, రేవంత్‌ ఎద్దేవా చేశారని.. ఇప్పుడు మన బొగ్గు గనులను దుర్మార్గంగా వేలం వేయాలని చూస్తుంటే అడ్డుకునే వారే లేకపోయారని పేర్కొన్నారు. పార్లమెంటులో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉంటే ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేవారన్నారు.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు గనులను వేలం వేయొద్దని ప్రధానికి లేఖ రాసిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి కేంద్ర గనుల శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి నియమితులైతే.. మనకు ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ రావాల్సింది పోయి ఉన్నదాన్ని అమ్మే పరిస్థితికి తెచ్చారని కేటీఆర్‌ విమర్శించారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ లేనందువల్లే కేంద్రం సింగరేణిని ఖతం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లిస్తే ప్రజలకు వారిచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇదేనా? అని ఆయన నిలదీశారు. బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికి అప్పగించేలా చూడాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత ఇనుము గనులు లేకపోవడం వల్లనే నష్టాల్లోకి వెళ్తిందన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బైలదిల్ల గనిని క్యాప్టివ్‌ మైన్‌ కింద విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించమని అడిగితే కేంద్రం ఇవ్వలేదని, దాన్ని వేలంలో అదానీకి అప్పగించిందని చెప్పారు. సొంత గని లేకపోవడం వల్ల నష్టాల్లోకి వెళ్లిన విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మాలని చూశారన్నారు. సింగరేణి విషయంలో కూడా అదే వ్యూహం అవలంబించబోతున్నారన్నారని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తే, నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు.


మేం వచ్చాక రద్దు చేస్తాం..

నాలుగున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం తమదేనని కేటీఆర్‌ అన్నారు. కేంద్రం కుట్రలో భాగంగా వేలంలో ఎవరైనా బొగ్గు గనులను దక్కించుకుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేస్తామని చెప్పారు. సింగరేణికి దక్కాల్సిన బొగ్గు గనులను ఇతరులకు అప్పగించేలా వేలం నిర్వహించాలని బీజేపీ తీసుకున్న నిర్ణయానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఎందుకు వంత పాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. గతంలో ఈ బొగ్గు గనులను వేలం వేయాలని ప్రయత్నిస్తే దాన్ని సమర్థించబోమంటూ అప్పటి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాయడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని చెప్పారు. తెలంగాణలోని బొగ్గు గనులను వేలం వేయకుండా ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ రక్షణ కవచంలా నిలిచిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు.


సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలంటూ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2021 డిసెంబరు 11న కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి వైఖరి ఇప్పుడు ఎందుకు మారిపోయిందని ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణకు పరోక్షంగా ఒప్పుకున్నట్లేనా అని ప్రశ్నించారు. బొగ్గు గనులను వేలం వేసి, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

Updated Date - Jun 21 , 2024 | 04:12 AM