Share News

Khammam: నామ నాగేశ్వరరావు ఆస్తులు రూ.155 కోట్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 06:02 AM

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.

Khammam: నామ నాగేశ్వరరావు ఆస్తులు రూ.155 కోట్లు

95 ఎకరాల వ్యవసాయ భూమి, రెండున్నర కిలోల బంగారం.. రూ.కోటి విలువ చేసే కారు

ఖమ్మం, ఏప్రిల్‌24(ఆంధ్రజ్యోతి): ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కుటుంబానికి రూ.155.90కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఇందులో 95.47 ఎకరాల వ్యవసాయ భూములు, రెండున్నర కిలోల బంగారం, రూ.కోటి విలువైన కారు, భవనాలు, షేర్లు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మొత్తం ఆస్తిలో నామ పేరిట రూ.71.68 కోట్లు, భార చిన్నమ్మ పేరిట రూ.78.25కోట్లు, అవిభాజ్య కుటుంబానికి రూ.5.96కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.


ఇందులో రూ.72 కోట్ల చరాస్తులు ఉండగా నామ పేరిట రూ.56.97 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. నామ సతీమణి పేరిట రూ.15.05 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. ఇందులో రూ.కోటి విలువ చేసే రెండున్నర కిలోల బంగారం, రూ.1.13కోట్లు విలువ చేసి ఆడీ కారు ఉన్నాయి.

అవిభాజ్య కుటుంబ ఆస్తి కింద రూ.50వేలు ఉంది. నామ కుటుంబానికి ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో పాటు, ఏపీ, కర్ణాటక, గోవా, న్యూఢిల్లీ తదితర ప్రాంతాల్లో భూములు, భవనాలు కలిపి రూ.83.87 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల్లో రూ.23.70 కోట్ల విలువైన 95.47 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో నామ పేరిట 45.42 ఎకరాలు, ఆయన సతీమణి పేరు మీద 25.04 ఎకరాలు, అవిభాజ్య ఆస్తిలో 27.35ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. నామ నాగేశ్వరరావుపై రెండు కేసులు ఉన్నాయి.


పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి ఆస్తి 22.65 కోట్లు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌ గొమాసేకు రూ.22.65 కోట్ల విలువైన ఆస్తులు, రూ.64.49 లక్షల అప్పులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌ గొమాసేకు రూ.54.50 లక్షల విలువైన చరాస్తులు, ఆయన భార్య పేరిట రూ.27.76 లక్షల చరాస్తులు ఉన్నాయి. అలాగే, శ్రీనివాస్‌ పేరిట రూ.22,40,51,375 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పేరిట స్థిరాస్తులు లేవు.

శ్రీనివాస్‌ చేతిలో రూ.2 లక్షలు, ఆయన భార్య వద్ద రూ.1.50 లక్షల నగదు ఉంది. శ్రీనివాస్‌ పేరిట రెండు కార్లు ఉన్నాయి. ఆయనకు వివిధ బ్యాంకుల్లో రూ.64,49,145 రుణాలు ఉన్నాయి. శ్రీనివాస్‌ పేరిట రూ.7.50 లక్షల విలువైన పది తులాల బంగారు ఆభరణాలు, ఆయన భార్య పేరిట రూ.26.25 లక్షల విలువైన 35 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. శ్రీనివాస్‌ గొమాసేపై ఎటువంటి. కేసులు లేవు.


రూ.44 కోట్ల ఆస్తులు.. మూడు తుపాకులు

నల్లగొండ, ఏప్రిల్‌ 24 : నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి వద్ద మూడు లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నాయి. ఆయనకు రూ.44.63 కోట్ల విలువైన ఆస్తులు, రూ.17.41 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. రఘువీర్‌ రెడ్డికి రూ.44.63.53.628 విలువైన స్థిర, చరాస్తులు, వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల్లో రూ. 17,41,50,000 వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. పోలీసు శాఖ అనుమతితో ఆత్మరక్షణ కోసం రూ.2.50 లక్షల విలువైన మూడు లైసెన్స్‌డ్‌ తుపాకులు కొనుగోలు చేశారు. ఇందులో 0.32ఏపీబీ తుపాకీ, 0.12 బోర్‌ డీబీడీఎల్‌ గన్‌, 0.22 ఎన్‌పీబీ రైఫిల్‌ ఉన్నాయి. ఆయనపై రెండు కేసులు విచారణలో ఉండగా, వేర్వేరు పోలీసుస్టేషన్లలో మరో రెండు కేసులు ఉన్నాయి.

భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థికి 19.94కోట్ల ఆస్తులు

యాదాద్రి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డికి రూ.19,94,15,160 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఆయనకు రూ.7,63,79,660 విలువైన చరాస్తులు, రూ.12,30,35,500 విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య డింపుల్‌ పేరిట రూ.7,17,45,500 స్థిరాస్తులు, రూ.1,60,50,808 చరాస్తులు ఉన్నాయి. చామలకు రూ.35,53,937 అప్పులు ఉండగా, ఆయన భార్యపేరిట రూ.37,94,436 అప్పు ఉంది. వేర్వేరు పోలీసుస్టేషన్లలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.


సొంత వాహనం లేని ఆరూరి

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌ కుటుంబానికి రూ.28 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నా సొంత వాహనం లేదు. రమేశ్‌ పేరిట రూ.8,92,591, ఆయన భార్య కవితకుమారి పేరిట రూ.5,44,11,450 విలువైన చరాస్తులున్నాయి. రమేశ్‌ పేరిట రూ.12,20,50,000, ఆయన భార్య పేరిట 11.01కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. రమేశ్‌పై ఆరు కేసులు ఉన్నాయి.


వెంకట్రామిరెడ్డి కుటుంబ ఆస్తి 62.84 కోట్లు

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కుటుంబానికి రూ.62,84,43,006 విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. ఇందులో 3కిలోలకు పైగా బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలున్నాయి. ఆయనకు పెద్దపల్లి జిల్లా ఇందుర్తిలో రూ.7.88 లక్షల విలువైన ఎకరా 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది.

కుత్బుల్లాపూర్‌లో 311 చదరపు అడుగుల ప్లాట్‌, శేరిలింగంపల్లిలో 830 గజాల ప్లాట్‌, తెల్లాపూర్‌లో 17 గుంటల భూమి ఉంది. రూ.6.62 లక్షల విలువైన వంద గ్రాముల బంగారం, రూ.1,57,91,946 బ్యాంకు డిపాజిట్లున్నాయి. ఆయన భార్య ప్రణీత రెడ్డి పేరిట మహేశ్వరంలో ఉన్న రాజపుష్ప ఫామ్స్‌ విలువ 4.48 కోట్లు. ఆమె వద్ద 3.49 కోట్ల విలువైన 3.332 గ్రాముల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 06:02 AM