Share News

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దేశీ ప్రమాణాలు

ABN , Publish Date - Jan 13 , 2024 | 04:06 AM

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే పరీక్ష.. ‘పీఎ్‌సఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌)’. వయసును బట్టి ఈ పీఎ్‌సఏ విలువ ఆధారంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడిందీ లేనిదీ నిర్ధారిస్తారు.

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దేశీ ప్రమాణాలు

దేశవ్యాప్తంగా లక్షమందిపై 8 ఏళ్లపాటు

అపోలో ఆస్పత్రి వైద్యుల అధ్యయనం

ఫారినర్లకు భిన్నంగా మన ప్రమాణాలు

వాటినే ఇక అన్ని ఆస్పత్రుల్లో గుర్తిస్తాం

ఆ ప్రమాణాలకు అనుగుణంగా చికిత్స

అపోలో జాయింట్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే పరీక్ష.. ‘పీఎ్‌సఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌)’. వయసును బట్టి ఈ పీఎ్‌సఏ విలువ ఆధారంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడిందీ లేనిదీ నిర్ధారిస్తారు. అయితే, ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల ప్రమాణాల ప్రకారమే ఆ విలువను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కానీ, అందుకు భిన్నంగా మన దేశ ప్రమాణాలు ఏమిటో నిర్ధారించి.. ఆ విలువలకు అనుగుణంగా చికిత్స అందించాలని అపోలో ఆస్పత్రి నిర్ణయించింది. ఈ మేరకు దాదాపు ఎనిమిదేళ్లపాటు దేశవ్యాప్తంగా అన్ని వయసులకూ చెందిన లక్ష మందిపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించగా.. దేశీయ ప్రమాణాలు పాశ్చాత్య ప్రమాణాలకు భిన్నంగా ఉన్నట్టు అందులో వెల్లడైందని తెలిపింది. ఇకపై దేశంలో ఉన్న అన్ని అపోలో ఆస్పత్రుల్లో దేశీయ ప్రమాణాల ఆధారంగానే చికిత్సలు అందించనున్నట్టు.. శుక్రవారం అపోలో మెడికల్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి, యూరో-ఆంకాలజిస్టు డాక్టర్‌ సంజయ్‌ అడ్డాల తెలిపారు. కొత్త భారతీయ పీఎ్‌సఏ ప్రమాణాలు యువకులలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడంలో తోడ్పడతాయని వివరించారు. తాము నిర్వహించిన ఈ అధ్యయనం భారతదేశంలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్సలో కీలకమార్పులను తీసుకువస్తుందన్నారు. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో.. రిఫరెన్స్‌ విలువలను ఇప్పటికే మార్చామని, రానున్న మూడు నెలలలో దక్షిణాదిన ఉన్న అన్ని అపోలో ఆస్పత్రుల్లో ఈ బెంచ్‌ మార్కింగ్‌ను దశలవారీగా మారుస్తామని తెలిపారు. అపోలోలో సరికొత్త బీకే 5000 అలా్ట్ర సౌండ్‌ సిస్టంను అందుబాటులోకి తెచ్చామని, ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించడంలో అత్యంత అధునాతన విధానమని చెప్పారు.

ఇవీ దేశీ ప్రమాణాలు

పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం.. ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎ్‌సఏ) విలువ 41-50 వయసువారిలో 2.5లోపు ఉండాలి. అంతకు మించి ఉంటే అసాధారణం కింద లెక్క. అదే అపోలో కొత్తగా నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం 1.7 లోపే ఉండాలి. అయితే.. కొందరిలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లేకున్నా ఇతర కారణాల వల్ల పీఎ్‌సఏ ఎక్కువగా ఉంటుంది. సమస్య ఏమిటన్నది వైద్యులు మరికొన్ని పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు.

Updated Date - Jan 13 , 2024 | 04:06 AM