Share News

Hyderabad budget: హైదరాబాద్‌కు 10 వేల కోట్లు!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:23 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి ఈసారి బడ్జెట్‌లో గణనీయంగా నిధులు కేటాయించారు. గత సర్కారుకు భిన్నంగా రేవంత్‌ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల భారీ మొత్తంతో మహానగర అభివృద్ధికి తెర తీసింది.

Hyderabad budget: హైదరాబాద్‌కు 10 వేల కోట్లు!
Hyderabad

  • ‘గ్రేటర్‌’పై రేవంత్‌ సర్కారు ప్రత్యేక దృష్టి

  • గతానికి భిన్నంగా అధిక నిధులు..

హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి ఈసారి బడ్జెట్‌లో గణనీయంగా నిధులు కేటాయించారు. గత సర్కారుకు భిన్నంగా రేవంత్‌ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల భారీ మొత్తంతో మహానగర అభివృద్ధికి తెర తీసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిని ఔటర్‌ రింగు రోడ్డు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు మౌలిక వసతులకు నిధుల కొరత లేకుండా కేటాయింపులు జరిపింది. గత ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీకి రూ.182 కోట్లు కేటాయిస్తే.. తాజా బడ్జెట్‌లో ఏకంగా రూ.3,065 కోట్లు కేటాయించారు. ఇది దాదాపు 16 రెట్లు ఎక్కువ.. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చే జలమండలికి సైతం భారీగా కేటాయింపులు జరిపారు. గత బడ్జెట్‌లో వాటర్‌ బోర్డుకు రూ.1,960.7 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.3,385 కోట్లకు పెంచారు. మూసీ సుందరీకరణ, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తే.. దాన్ని ఈసారి రూ.1,500 కోట్లకు పెంచేశారు.


హైడ్రాకు రూ.200 కోట్లు..

ఔటర్‌ వరకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కోసం కొత్తగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’కు రూ.200 కోట్లు సర్కారు కేటాయించింది. ఇక మెట్రో రైల్‌విస్తరణకు గత సర్కారు బడ్జెట్‌లో రూ.2,427.35 కోట్లు కేటాయించగా.. అది ఈసారి మాత్రం రూ.1,100 కోట్లకు తగ్గింది. ప్రతిపాదనల్లో పాతబస్తీకి రూ.500 కోట్లు, నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రూ.100 కోట్లు, హెచ్‌ఎంఆర్‌కు రూ.500 కోట్లు కేటాయింపులు జరిపారు. ఇక ఔటర్‌ రుణాల చెల్లింపు.. పలు ప్రాంతాల్లో ప్రతిపాదిత అభివృద్ధి పనుల కోసం హెచ్‌ఎండీఏకు రూ.710 కోట్లు సర్కారు కేటాయించింది. అంతర్జాతీయంగా భాగ్యనగర ఖ్యాతి పెంచుతామని చెబుతున్న కాంగ్రెస్‌ సర్కారు.. అందుకు తగినట్టుగా బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చింది. జీహెచ్‌ఎంసీకి వివిధ పనుల నిమిత్తం గత సర్కారు రూ.182 కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రూ.2,654 కోట్లకు పెంచింది. బల్దియాకు ప్లానింగ్‌ కమిషన్‌ గ్రాంట్లు రూ.387 కోట్ల నుంచి రూ.411 కోట్లకు పెంచారు.

Updated Date - Jul 26 , 2024 | 08:17 AM