Singareni: సింగరేణిలో జనరల్ మజ్దూర్లుగా బదిలీ వర్కర్లు
ABN , Publish Date - Aug 31 , 2024 | 04:04 AM
సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ విధానంలో నియమితులైన 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
2,364 మందిని క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కారుణ్య, డిపెండెంట్ విధానంలో నియమితులైన 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. వీరిలో 243 మంది మహిళలు కూడా ఉన్నారు. ఏడాదిలో భూగర్భ గనుల్లో 190 రోజులు, ఉపరితల గనులు, విభాగాల్లో 240 రోజులు విధులు నిర్వహించిన నేపథ్యంలో వీరిని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించారు.
ఈ నిర్ణయం సెప్టెంబరు 1 తేదీ నుంచి అమల్లోకి రానుంది. క్రమబద్ధీకరించిన వారిలో కంపెనీ వ్యాప్తంగా కార్పొరేట్ ఏరియాలో 25 మంది, కొత్తగూడెంలో 17, ఇల్లందులో 9, మణుగూరులో 21, భూపాలపల్లిలో 476, రామగుండం-1లో 563, రామగుండం-2 పరిధిలో 50, రామగుండం-3, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు పరిధిలో 240, శ్రీరాంపూర్‌లో 655, మందమర్రిలో 299, బెల్లంపల్లిలో 9 మంది ఉన్నారు.
జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినందున ఇంకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, డ్యూటీలకు గైర్హాజరు కావొద్దని కార్మికులకు సీఎండీ సూచించారు. ఎలాంటి నిరీక్షణ లేకుండా ఏడాదిలో నిర్ణీత మస్టర్లు (నిర్దిష్ట కాలవ్యవధి) పూర్తిచేసిన వారిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తుండటం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.