Share News

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్ట్ షాక్

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:32 PM

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది.

CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్ట్ షాక్

న్యూఢిల్లీ: ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య డీల్ కుదరడంతోనే బెయిల్ వచ్చిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ స్పందించింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బెయిల్ ఇస్తామా అని ప్రశ్నించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బైఆర్‌ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను న్యాయమూర్తులు తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తరపున వాదించిన లాయర్లు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సరికాదని కోర్ట్ వ్యాఖ్యానించింది. ‘‘ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి సీఎం పదవిలో ఉన్నారు. కాబట్టి కేసును బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా?’’ అంటూ అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూథ్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు. మరోసారి ఇలా జరగదని వారు కోర్టుకు హామీ ఇచ్చారు.


ఆయన (ముఖ్యమంత్రి) చేసిన ప్రకటనలు బహిరంగంగా ప్రచురితమయ్యాయని, పోలీసులు ఏదైనా చేస్తే వారిని వీధిలో కొడతారేమో అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ‘‘ ఆయన ఏమన్నారో మీరు చదివారా. ఒకసారి చదవండి. ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అనుమానాలు కలగజేస్తాయి’’ అని జస్టిస్ గవాయి అన్నారు.

పరస్పర గౌరవం ఉండాలి

‘‘ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటనలు చేయాలా?. రాజకీయ నాయకులు, న్యాయవ్యవస్థ మధ్య పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయ కారణాలతో మేము ఆదేశాలు జారీ చేశామని ఏ వ్యక్తైనా ఎలా చెప్పగలరు?. మీరు మమ్మల్ని గౌరవించనంత మాత్రాన మేము మీ కేసు విచారణను వేరే చోటికి బదిలీ చేస్తామా. ఇది దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం. నిన్ననే మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శికి (అటవీ, రెవెన్యూ శాఖ) నోటీసులు జారీ చేశాం. ఏదైనా రాజకీయ పార్టీని సంప్రదించిన తర్వాత మా ఆదేశాలను జారీ చేస్తామా?. మనస్సాక్షి, ప్రమాణం చేసిన విధంగా మేము మా విధులను నిర్వహిస్తాం’’ అని సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.


కాగా ఓటుకు నోటు కేసు బదిలీపై విచారణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాలను తారుమారు చేయగలరని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్ట్ తెలిపింది.

Updated Date - Aug 29 , 2024 | 04:59 PM