TG Govt: దుబారా వద్దు!
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:29 AM
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాబడుల్లో లీకేజీలను నియంత్రిస్తున్న సర్కారు.. తాజాగా కార్యాలయాల నిర్వహణ వ్యయాలపై దృష్టి సారించింది.
అత్యవసరమైతేనే ఖర్చు పెట్టండి
హెచ్‌వోడీలు, కలెక్టర్లకు సీఎస్ ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాబడుల్లో లీకేజీలను నియంత్రిస్తున్న సర్కారు.. తాజాగా కార్యాలయాల నిర్వహణ వ్యయాలపై దృష్టి సారించింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటూ రాష్ట్రంలోని వివిధ శాఖల విభాగాధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రాబడులైన వస్తు సేవల పన్ను(జీఎస్టీ), అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకాలు, వాహనాల పన్నులు, రిజిస్ట్రేషన్ల ఫీజులు, గనులు, భూగర్భ ఖనిజాల సీనరేజీ చార్జీల్లో ఎలాంటి లీకేజీలు ఉండకూడదని ఇప్పటికే ప్రభుత్వం సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. లీకేజీలకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటోంది. అలాగే.. ఇప్పుడు కార్యాలయాల నిర్వహణ ఖర్చులపై దృష్టి సారించింది.
సాధారణంగా హెచ్‌వోడీలు, కలెక్టరేట్లు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు, వివిధ శాఖల జిల్లా అధికారుల కార్యాలయాల్లో అత్యవసర ఖర్చుల కోసం కొంత సొమ్మును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కార్యాలయాల్లో ఏసీలు, ఫ్యాన్లు, ఫర్నిచర్, ఇతర సదుపాయాల కల్పనకు డబ్బు ఖర్చు చేస్తుంటారు. కొంతమంది హెచ్‌వోడీలు తమ చాంబర్ల ఆధునికీకరణ పేరిట దుబారా వ్యయం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి వ్యయాలపై నియంత్రణ పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తే.. తప్పకుండా తమ శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్‌వోడీల అనుమతి తీసుకోవాలని సూచించింది.