Yearender 2024: విశ్లేషకులను కంగు తినిపించిన ఓటరు
ABN , Publish Date - Dec 25 , 2024 | 08:49 PM
ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
న్యూఢిల్లీ: 2024 ఎన్నికల సంవత్సరంగా పేరు పొందింది. లోక్ సభతోపాటు కొన్ని శాసన సభలకు జరిగిన ఎన్నికల్లో ఓటరు తీరు ఎవరికీ అంతుబట్టలేదు. ఈసారి 400 స్థానాలకుపైనే గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బీజేపీ నేత్వత్వంలోని ఎన్డీయేకు చావు తప్పి కన్ను లొట్టబోయింది. కాంగ్రెస్ గతం కన్నా బలపడింది. ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు కూడా బలం పుంజుకున్నాయి. అయితే, ప్రజల నాడిని చాకచక్యంగా పట్టగలిగే సెఫాలజిస్టులు, విశ్లేషకులు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అసలు ఫలితాల్లో విఫలమయ్యాయి.
Yearender 2024: మోదీ దూకుడుకు కళ్లెం
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్డీయే 293 స్థానాలకు పరిమితమైంది. ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామనే సంతృప్తి ఎన్డీయే పార్టీలకు మిగిలింది. ప్రధాని నరేంద్ర మోదీని కట్టడి చేయగలిగామనే సంతోషం ఇండియా కూటమి పార్టీలకు దక్కింది. రాహుల్ గాంధీకి లోక్ సభలో ప్రతిపక్ష నేత హోదా లభించింది. మోదీ స్పష్టమైన మెజారిటీ లేని ప్రభుత్వాన్ని నడపటం ఇదే మొదటిసారి.
లోక్ సభ ఎన్నికలు, శాసన సభల ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు అందరినీ ఆలోచింపజేసింది. హర్యానాలో కాంగ్రెస్, బీజేపీలకు చెరొక 5 లోక్ సభ స్థానాలు లభించగా, శాసన సభ ఎన్నికలు వచ్చేసరికి ఓటరు తీరు మారిపోయింది. బీజేపీ కూటమికి అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చింది. రైతులు, రెజ్లర్ల నిరసనలు,అగ్నివీర్ పథకంపై ఆగ్రహం వంటివి తమకు అధికారాన్ని కట్టబెడతాయని కాంగ్రెస్ ఊహించింది. కానీ, టిక్కెట్ల పంపిణీలో సామాజిక వర్గ సమీకరణాల్లో బీజేపీ సమతూకం పాటించి, విజయం సాధించింది. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో 48 స్థానాలను దక్కించుకుంది.
మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ)లను ఓటర్లు ఆదరించారు. కానీ కొద్ది నెలల్లోనే జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి అత్యధిక మెజారిటీతో పట్టం కట్టారు.
జమ్మూ-కశ్మీరులో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాను ఓడించిన ఓటర్లు, శాసన సభ ఎన్నికల్లో గెలిపించారు. అధికరణ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
ఒడిశాలో 24 ఏళ్ల బీజేడీ పాలనకు తెరపడింది. సంక్షేమం, సాంఘిక భద్రత పథకాలను అమలు చేసిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీకి ఇది అనూహ్యమైన దెబ్బ. ఆ పార్టీ శాసన సభ ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని అయినా గెలుచుకోలేకపోయింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు.
జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ప్రజలు ఎన్నుకున్నారు. మనీలాండరింగ్ కేసులో దాదాపు 5 నెలలు జైలు జీవితం గడిపిన హేమంత్ సొరేన్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హేమంత్ బంధువు చంపయీ సొరేన్‌ను బీజేపీలో చేర్చుకున్నప్పటికీ, ఆ పార్టీ అధికార పీఠానికి చేరలేకపోయింది. అందుకే ఓటరు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఎవరికి అందుతాయో చెప్పడం చాలా కష్టం.
For Rewind 2024 News కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
For National News And Telugu News