Share News

Guntur : అట్టహాసంగా ‘ఆలపాటి’ నామినేషన్‌

ABN , Publish Date - Feb 08 , 2025 | 05:18 AM

కూటమి పార్టీల తరఫున తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి భారీ ప్రదర్శనగా ఆలపాటిని గుంటూరు కలెక్టరేట్‌కు ఊరేగింపుగా తోడ్కొనివెళ్లారు.

Guntur : అట్టహాసంగా ‘ఆలపాటి’ నామినేషన్‌

  • తరలివచ్చిన కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీల శ్రేణులు

  • జనసంద్రంగా మారిన గుంటూరు నగరం

గుంటూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం అట్టహాసంగా జరిగింది. కూటమి పార్టీల తరఫున తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి భారీ ప్రదర్శనగా ఆలపాటిని గుంటూరు కలెక్టరేట్‌కు ఊరేగింపుగా తోడ్కొనివెళ్లారు. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కొలుసు పార్థసారఽథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, రాష్ట్ర శాసన సభ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, కామినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, గల్లా మాధవి, మొహమ్మద్‌ నసీర్‌, జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్‌, అరవిందబాబు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఆలపాటికి తోడుగా ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్మికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ కూటమి పిలుపులో భాగంగా జనసేన ఆలపాటికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ శ్రేణులు ఆలపాటి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయన్నారు. ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ కూటమి ధర్మం ప్రకారం తెనాలి సీటును ఆలపాటి త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా పట్టభద్రులు ఇచ్చే గెలుపుతో తాను మండలిలో తన గళం వినిపిస్తానని చెప్పారు. ప్రభుత్వానికి- పట్టభద్రులకు మధ్య వారధిగా నిలిచి వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Feb 08 , 2025 | 05:20 AM