Ugadi Celebrations: ఉగాది వేడుకలకు ముస్తాబు
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:05 AM
రాజధాని అమరావతిలో ఉగాది వేడుకలు శుభ్రంగా నిర్వహించేందుకు 50 ఎకరాలు సిద్ధం చేస్తారు. పీ4 విధానాన్ని ఉగాది రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారని సీఎస్ తెలిపారు

రాజధానిలో 50 ఎకరాలు సిద్ధం
సభా ప్రాంగణంలో రెండు షెడ్లు ఏర్పాటు
పీ4కి కూడా ఇక్కడి నుంచే సీఎం శ్రీకారం
ప్రారంభ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
మంగళగిరి/అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఉగాది వేడుకలకు ముస్తాబవుతోంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక వైపు స్థలాన్ని ఆ వేడుకలకు వేదికగా నిర్ణయించారు. గత వారం రోజులుగా ఆ ప్రాంగణాన్ని వేడుకల కోసం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పీ4 విధానాన్ని కూడా ఉగాది రోజునముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఇదే ప్రాంగణాన్ని ఏప్రిల్ మూడవ వారంలో ప్రధాని మోదీ పర్యటనకు కూడా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ సభకు 250 ఎకరాలను ఇక్కడ సిద్ధం చేయాలని నిర్ణయించారు. అయితే ఈనెల 30న నిర్వహించనున్న ఉగాది వేడుకలకు మాత్రం 50 ఎకరాలను మాత్రమే వినియోగించుకోనున్నారు.
ఉగాది రోజు పీ4 లాంఛనంగా ప్రారంభం: సీఎస్
ఉగాది రోజున సీఎం చంద్రబాబు పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజలు, భాగస్వామ్యం) విధానాన్ని రాష్ట్ర స్థాయిలో లాంఛనంగా ప్రారంభించనున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశఛని చెప్పారు. ఉగాది రోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ పీ4 ప్రారంభ కార్యక్రమం అమరావతి వేదికగా జరుగుతుందన్నారు. సుమారు 11,500 మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఇందులో 3 వేల వరకు మహిళలు ఉండొచ్చని చెప్పారు.
ఉగాది రోజున ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’
తెలుగు సంవత్సరాది రోజున రాష్ట్రంలో ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పీ4 కార్యక్రమంలో భాగంగా దీన్ని అమలు చేస్తామన్నారు. దీనికి ‘మార్గదర్శి-బంగారు కుటుంబం’ అని నామకరణం చేశామన్నారు. గురువారం విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడు పూటలా తిండిలేని పేదలు ఉన్నారని, వారి జీవన ప్రమాణాలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాళ్లతోనే ఉండాలన్నది తన జీవిత ఆశయమని, పేదరికంలో ఉన్న వాళ్లను పైకి తీసుకువస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, పార్టీ నాయకులు ఫారూక్ షిబ్లీ, జలీల్‌ఖాన్, నెట్టెం రఘురాం, కంభంపాటి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
For More AP News and Telugu News