Ration Card e-KYC రేషన్‌కార్డుల ఈకేవైసీకి గడువు పెంపు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:18 PM
Extension of Deadline for Ration Card e-KYC రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పెంచింది. ఈ నెల 30 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
జియ్యమ్మవలస, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పెంచింది. ఈ నెల 30 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవగా గతనెల 31లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. కానీ పెండింగ్ కార్డుదారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోకుంటే మే నుంచి రేషన్ అందే అవకాశం లేదని తేల్చి చెప్పింది. నకిలీ రేషన్‌కార్డులను తొలగించి అర్హులకు మాత్రమే సబ్సిడీపై నిత్యావసర సరుకులు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ అధికారులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ పరిస్థితి
-జిల్లాలో పాలకొండ, పార్వతీపురం డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 15 మండలాలు, 451 పంచాయతీలు, 2,282 గ్రామాలు ఉన్నాయి. మొత్తంగా 55,104 అంత్యోదయ కార్డులు, 2,22,049 తెలుపు రేషన్‌కార్డులు ఉన్నాయి. జిల్లాలో 8 మండల లెవెల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లు ఉన్నాయి. వీటి ద్వారా పాలకొండ డివిజన్‌లో 259 ఫెయిర్ ప్రైస్ (ఎఫ్‌పీ) షాపులు, పార్వతీపురం డివిజన్‌లో 319 ఎఫ్‌పీ షాపులు , 101 డీఆర్ డిపోలు ఉన్నాయి. 196 ఎండీయూ వాహనాల ద్వారా ప్రతినెలా కార్డుదారులకు సరుకులు అందిస్తున్నారు.
- జిల్లాలో 2,77,153 రేషన్‌కార్డుల్లో 8,16,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ ఈకేవైసీ చేయాల్సి ఉంది. ఇంతవరకు 7,35,287 మందికి ఈకేవైసీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. ఇంకా 81,572 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది.
ఇబ్బందులు
- ఈకేవైసీని రేషన్ డీలర్లు, సేల్స్‌మెన్ చేస్తుండగా.. ఐదేళ్లలోపు పిల్లలకు వేలి ముద్రలు పడటం చాలా కష్టమవుతోంది.
- గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఆశ్రమ పాఠశాలల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. వీరికి ఈకేవైసీ చేసే అవకాశం సేల్స్‌మెన్‌కు లేకపోతోంది.
- వృద్ధులకు ఇంటి వద్ద ఉంచేసి జిల్లాలో ఎంతోమంది వలస వెళ్లిపోయారు. వారికి ఫోన్ చేసి రమ్మన్నా వచ్చే అవకాశాలు తక్కువ.
ఆఫ్‌లైన్ షాపుల పరిస్థితేంటి..?
జిల్లాలో మొత్తం 60 ఆఫ్‌లైన్ షాపులు ఉన్నాయి. ఇవన్నీ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ఉన్నవే. అయితే ఇక్కడ కూడా ఈకేవైసీ చేయాలంటే ఇబ్బందులు తప్పేటట్లు లేదు. వీరందరికీ ఈకేవైసీ చేయాలంటే కచ్చితంగా ఆయా ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉన్న చోటుకు ప్రజలు రావల్సిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో మీటర్ల కొద్ది కాలినడకన రావల్సిన పరిస్థితి ఉంది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
పూర్తి చేస్తాం
ఈకేవైసీ విషయంలో ప్రభుత్వం ఈనెల 30 వరకు గడువు ఇచ్చింది. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈకేవైసీ పూర్తి చేస్తాం. దీనిపై డిపో డీలర్లు, సేల్స్‌మెన్ ఎండీయూ ఆపరేటర్లకు ఆదేశాలిచ్చాం.
- ఐ.రాజేశ్వరి, ఇన్‌చార్జి డీఎం, జిల్లా సివిల్ సప్లైస్ శాఖ, పార్వతీపురం మన్యం