thirsty Screams అప్పుడే దాహం కేకలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:22 PM
Just then the thirsty Screams జిల్లాలోని పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. వేసవి ప్రారంభంలోనే ‘మన్యం’ వాసుల గొంతెండుతోంది. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎండల తీవ్రతకు తోడు ముందస్తు ప్రణాళిక లేని కారణంగా ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు.

వేసవి ప్రారంభంలోనే గొంతెండుతున్న వైనం
కానరాని ముందస్తు ప్రణాళికలు
అల్లాడిపోతున్న మన్యం వాసులు
జిల్లాలోని పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. వేసవి ప్రారంభంలోనే ‘మన్యం’ వాసుల గొంతెండుతోంది. బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎండల తీవ్రతకు తోడు ముందస్తు ప్రణాళిక లేని కారణంగా ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు. కొళాయిల ద్వారా పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నా.. ఏ మాత్రం చాలడం లేదు. మొత్తంగా జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితేమిటోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాలకొండ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని 38 వేల మంది జనాభా ఉన్నారు. ఒక్కొక్కరికీ రోజుకు 135 లీటర్ల తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే కేవలం 70 లీటర్లు మా త్రమే సరఫరా చేస్తున్నారు. రోజుకు సరాసరి 5.2 ఎంఎల్‌డి తాగునీరు ప్రజలకు అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న రక్షిత పథకాలు ద్వారా 2.44 ఎంఎల్‌డి వరకే అందిస్తున్నారు. పాలకొండలో 2,176 పబ్లిక్ కుళాయిలు ఉండగా 436 ప్రైవేటు ట్యాప్‌లు ఉన్నాయి. 145 వరకు బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా అందుతున్న తాగునీరు అంతంతమాత్రమే కావడంతో పట్టణ ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొం టున్నారు. ప్రస్తుతం అందిస్తున్న తాగునీరు కూడా అంత సురక్షితమైనది కాదు. దశాబ్దాల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లు ఇప్పటికీ 70 శాతం మురుగునీటి కాలువల్లోనే ఉన్నాయి. ఇవి లీక్‌లు కావడంతో తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
శివారు ప్రాంతాలకు అందట్లే..
పాలకొండలో శివారు ప్రాంతాలైన గారమ్మ కాలనీ, ఎన్‌ఎస్‌ఎన్ కాలనీ, సంపత్‌సాయినగర్, శ్రీని వాసనగర్, ఎన్‌కే రాజపురంతో పాటు పట్టణం నడిబొడ్డున ఉన్న ఎంఎంనగర్, గాయత్రి కాలనీతో పాటు పలు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. అడపాదడపా నగర పంచాయతీ లోని ఓ ట్యాంకర్ ద్వారా తాగుగునీటిని సరఫరా చేస్తున్నప్పటికీ వారికి పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో ఆయా కాలనీవాసులు అందుబాటులో ఉన్న వాటర్‌ప్లాంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
వెనక్కి మళ్లిన నిధులు
పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2014-19లో నాన్ అమృత్ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.57 కోట్లు కేటాయించారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావుడిగా పనులు ప్రారంభించింది. 20 వార్డులకు గాను ఆరు వార్డుల్లో రోడ్లు తవ్వి పైపులైన్లు వేశారు. జగన్నాథస్వామి గుడి వద్ద ఎన్‌కేరాజపురం, ఆర్‌అండ్‌బిబీ బంగ్లా ప్రాంగణాల్లో రక్షిత నీటి పథకాలకు ప్రణాళికలు రూపొందించారు. కానీ పనులు సకాలంలో చేపట్టకపోవడంతో ఆ నిధులు వెనక్కి మళ్లాయి. మొత్తంగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. పట్టణ ప్రజలకు శాపంగా మారింది. నేటికీ ప్ర‘జల’కు కష్టాలు తప్పడం లేదు.
అరకొరగానే..
సాలూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణ వాసులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఉయదం వేళ గంట మాత్రమే కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా.. అవి వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. పట్టణంలో 29 వార్డులున్నాయి. పట్టణ జనాభా సుమారు 70 వేలకు మించి ఉన్నారు. కాగా వారికి పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. మున్సిపాల్టీలో మజ్జుల పేట వద్ద రెండు, గాంధీపార్క్ వద్ద ఒకటి, మక్కువ బైపాస్‌కు వెళ్లే మార్గంలో మరొకటి.. ఇలా నాలుగు రక్షిత నీటి పథకాలు నిర్మించారు. సుమారు 3,700 కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. అయితే 15వ వార్డు పెద్దకుమ్మరి వీధి, బంగారమ్మ కాలనీ, శ్రీనివాసనగర్, పీఎన్ బొడ్డవలస, రామాకాలనీలో కొంతభాగం, కేవీఆర్ రియల్ ఎస్టేట్‌కు సమీపంలో ఉన్న ప్రజలకు పూర్తిస్థాయిలో కుళాయి పాయింట్లు లేవు. దీంతో మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతవాసులకు తాగునీరు అందిస్తున్నారు. మరోవైపు ఉదయం వేళల్లో అరకొరగానే తాగునీరు సరఫరా అవుతుండ డంతో పట్టణ వాసులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా.. పట్టణంలో మక్కువ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న రక్షిత నీటి పథకం మెట్లు శిఽథిలమై పదేళ్లు గడిచినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటి వరకు దానిని శుభ్రం కూడా చేయలేదు. దీంతో ప్రజలు ఆ నీటినే తాగాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.
నిరీక్షించాల్సి వస్తోంది..
మా కాలనీకి పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. బిందెడు నీటి కోసం కుళాయి గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై అధికారులు స్పందించాలి.
- కె.రమణమ్మ, గారమ్మకాలనీ, పాలకొండ
========================
వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా
వేసవి దృష్ట్యా పట్టణంలోని శివారు ప్రాంతాల్లో కాలనీలకు రెండు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్ర‘జల’ కష్టాలు తీరుస్తాం.
- టి.జయరాం, నగర పంచాయతీ ఇన్‌చార్జి కమిషనర్, పాలకొండ