Murdered హత్యచేసి.. చెట్టుకు ఉరేసి..
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:19 PM
Murdered and Hanged from a Tree ప్రియురాలిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అందరి కళ్లు గప్పి తప్పించుకోవాలని యత్నించాడు.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు.

మృతదేహాన్ని బైక్‌పై సాలూరు మండలానికి తీసుకొచ్చిన వైనం
చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పట్టుబడిన నిందితుడు
48 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
సాలూరు, మార్చి31(ఆంధ్రజ్యోతి): ప్రియురాలిని హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.. అందరి కళ్లు గప్పి తప్పించుకోవాలని యత్నించాడు.. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. గతనెల 28న సాలూరు మండలంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన గిరిజన యువతి కేసును పోలీసులు ఛేదించారు. చాకచక్యంగా వ్యవహరించి 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దీనికి సంబంఽధించి సోమవారం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఏఎస్పీ అంకితా సూరానా తెలిపిన వివరాల ప్రకారం..
సాలూరు మండలం కందులపఽథం పంచాయతీ మర్రివానివలసకు చెందిన వాటిక ఐశ్వర్య (20) విశాఖపట్నంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. విశాఖలోనే ప్రైవేట్ జాబ్ చేస్తున్న కరాసువలస పంచాయతీ దత్తివలసకి చెందిన పెరుమాళ్ల రాంబాబుతో కొద్ది నెలల కిందట పరిచయమైంది. ఇద్దరిదీ ఒకే మండలం కావడంతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. రాంబాబు వివాహితుడు అయినప్పటికీ తనను పెళ్లిచేసుకోవాలని ఐశ్వర్య తరచూ అడుగుతుండేది. రాంబాబు మాత్రం ఈ విషయాన్ని కొద్దిరోజులుగా దాటవేస్తూ వస్తున్నాడు. కాగా గతనెల 23న స్వగ్రామాలకు వచ్చిన వారు 26న శంబర డ్యామ్ వద్ద కలుసుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్య గట్టిగా రాంబాబును అడిగింది. దీంతో వారు విశాఖలోనే ఉండి సహజీవనం చేసుకోవాలని నిర్ణయించు కున్నారు. అనంతరం గత నెల 27న ఐశ్వర్య రాంబాబు బైక్‌పై విశాఖకు వెళ్లింది. అదే రోజు ఆరిలోవ ఏరియా, పైనాపిల్ కాలనీ, హుద్‌హుద్ షెల్టర్ ఎస్‌ఎఫ్3లో వివాహ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాంబాబు ఆమె మెడను తాడుతో బిగించి హతమార్చాడు. అనంతరం సమీపంలో ఉన్న ఆసుపత్రికి 108 సహాయంతో తీసుకెళ్లాడు. అక్కడ తనిఖీ చేసిన వైద్యులు యువతి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రాంబాబు తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. బైక్‌పైనే ఐశ్వర్య మృతదేహంతో వారు సాలూరు మండలం చీపురువలస వరకు పయనమయ్యారు. మార్గ మధ్యలో మానాపురం రైల్వే ట్రాక్ సమీపంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. దీంతో వారు మరో స్నేహితుడికి ఫోన్ చేసి పెట్రోల్ తెమ్మని చెప్పారు. ఆ వ్యక్తి కూడా బైక్‌పై వచ్చి రాంబాబు ప్లాన్‌కు సహకరించాడు. మొత్తంగా బైక్‌లపై వారు ముగ్గురు సాలూరు మండలం వరకు వచ్చారు. చీపురువలస సమీపంలో ఉన్న జీడితోటల్లోకి ఐశ్వర్య మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఆ యువతి ఉరివేసుక్నుట్లుగా చిత్రీకరించి వారు తిరుగు ప్రయాణమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు గత నెల 28న జీడితోటల్లో గిరిజన యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు వేగవంతం చేశారు. సెల్‌ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. రాంబాబుకు సహకరించిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సాలూరు పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ, ఎస్‌ఐలను ఆమె అభినందించారు.