Political Discussion : జగన్ జల్సా భవన్‌లు !
ABN, Publish Date - Jan 19 , 2025 | 03:21 AM
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు సంస్థలను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్‌షా చేరుకున్నారు.
ప్యాలెస్‌లపై ఆరా తీసిన అమిత్‌షా
విలాసాల భవంతులపై ఆశ్చర్యం
బెంగళూరులో 36 ఎకరాల్లో..
హైదరాబాద్‌లో వంద గదులతో..
రుషికొండపై 500 కోట్ల ప్రజాధనంతో
హరిత ట్రైబ్యునల్ జరిమానా కూడా వేసింది
షాకు వివరించిన బాబు, లోకేశ్ తదితరులు
ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’పై చర్చ
ఆయన అర్హుడని అమిత్ షా అభిప్రాయం
ఎయిర్‌పోర్టులో అమిత్‌కు ఘన స్వాగతం
భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, నేతల రాక
పూలవర్షంతో స్వాగతించిన మహిళలు
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఘన స్వాగతం లభించింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం జాతీయ విపత్తు సంస్థలను ప్రారంభించడానికి విజయవాడకు అమిత్‌షా చేరుకున్నారు. ఆయన కోసం శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఇంటి ఆవరణలో కృష్ణా నది పక్కన నిర్మించిన తాత్కాలిక హాల్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులతో కలిసి అమిత్‌షా విందు ఆరగించారు. కృష్ణా తరంగాల మీదుగా... ఇంద్రకీలాద్రి పైనున్న కనకదుర్గమ్మ గుడి అలంకరణ కనిపించేలా అమిత్‌షాను కూర్చోబెట్టారు. ఎదురుగా గుడి చూస్తూ... ‘నది పక్కన మీ ఇల్లు చాలా బాగుంది’ అని అమిత్‌షా అన్నారు. అదే సమయంలో అనూహ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌ల గురించి అమిత్‌షా ఆరా తీసినట్లు తెలిసింది. జగన్‌కు ఎన్ని ప్యాలెస్‌లు ఉన్నాయని అమిత్‌షా అడగ్గా... బెంగళూరులో ఆరు ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నట్లుందని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘ఆరు కాదు..... మొత్తం 32 ఎకరాలు.అందులో పెద్ద ప్యాలెస్ కట్టుకొన్నారు. హైదరాబాద్‌లో కూడా ఆయన భవనంలో వంద గదులు ఉన్నాయి’’ అని మంత్రి లోకేశ్ వివరించారు. ముప్ఫై రెండు ఎకరాలా అని అమిత్ షా ఆశ్చర్యపోయారు. ‘ఇవి చాలవని విశాఖపట్నంలో రూ. ఐదు వందల కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి తాను ఉండటం కోసం భారీ భవనాలు నిర్మించారు.
నిబంధనలకు విరుద్ధంగా కట్టారని హరిత ట్రైబ్యునల్ ఆ నిర్మాణాలపై రూ. రెండు వందల కోట్లు జరిమానా విధించింది’’ అని చంద్రబాబు చెప్పారు. ఆ డబ్బులు జగన్ కట్టారా? అని అమిత్ షా అడిగారు. ఇంకా చెల్లించలేదని చంద్రబాబు బదులిచ్చారు. ‘‘హరిత ట్రైబ్యునల్ చాలా శక్తివంతమైంది. మేం గతంలో అండమాన్‌లో పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే భారీ జరిమానా వేశారు. దానికోసం అనేకసార్లు మాట్లాడి కొంత తగ్గించగలిగాం. జరిమానా కట్టడం తప్ప వేరే మార్గం లేదు’’ అని అమిత్ షా తన అనుభవం వివరించారు. జగన్ ఏం చేస్తున్నారు... తిరుగుతున్నారా.. అని అమిత్‌షా అడిగారు. ప్రకటనలు ఇవ్వడం తప్ప ఇంతవరకూ పెద్దగా తిరుగుతోంది లేదని, సుదీర్ఘ యాత్రలు చేయబోతున్నానని లీకులు మాత్రం ఇస్తున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వదగ్గ వ్యక్తి : అమిత్‌షా
టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు. ఆయన తప్పనిసరిగా ఇవ్వాల్సిన వ్యక్తి అని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాను దానిపై ఒక లేఖను కూడా ఇచ్చానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి ఆయనకు చెప్పారు. తెలుగు ప్రధాని పీవీ నర్సింహారావును గుర్తు చేసుకొన్న ఆయన.... పీవీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేశారు... ఎంత కాలం ఉన్నారని అడిగారు. ‘‘ఆయన కేవలం పదిహేను నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అప్పట్లో పదేపదే ముఖ్యమంత్రులను మార్చేది’’ అని చంద్రబాబు తెలిపారు. ఆ పార్టీ తరపున ఎక్కువ కాలం ఎవరు ముఖ్యమంత్రిగా చేశారని అమిత్ షా అడిగారు. ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లు చేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ఆయన కంటే కొంత ఎక్కువ కాలం చేసినట్లు గుర్తు’’ అని చెప్పారు. ఈ ప్రాంతంలో పండుతున్న పంటల గురించి కూడా అమిత్ షా అడిగారు. ‘‘ఈ ప్రాంతం రాష్ట్ర ధాన్యాగారంగా ప్రసిద్ధి.
రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలు పెరుగుతున్నాయి. గత కాలంలో ఈ ప్రాంతంలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదెకరాల భూమి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్ పక్కన ఒక ఎకరం అమ్మితే ఇక్కడ ఏభై ఎకరాలు వచ్చేలా పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్ అంత ఎదిగిపోయింది’’ అని చంద్రబాబు వివరించారు. అమరావతికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. మిర్చి, పొగాకు కూడా ఈ ప్రాంతంలో బాగా పండుతాయని పురందేశ్వరి చెప్పారు.
షాకు బాబు కృతజ్ఞతలు..
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవడానికి కేంద్రం ఉదారంగా సాయం చేయడం పట్ల అమిత్‌షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ఆయనకు వివరించారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనకబడిన ప్రాంతాలని, వాటిని అభివృద్ధి పథంలోకి తేవడానికి పోలవరం- బనకచర్ల అంతర్గత నదుల అనుసంధానం ప్రాజెక్టు ఎంతో కీలకమని ఆయనకు చంద్రబాబు వివరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా దీనికి సాయం చేయాలని కోరారు. విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఆయనకు వివరించి త్వరగా సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితి గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ రాష్ట్రానికి సంబంధించి తమ రాజకీయ ఆలోచన గురించి వివరించిన అమిత్ షా... అక్కడ కూడా బీజేపీ, టీడీపీ కలిసి పనిచేయడంపై చంద్రబాబుతో చర్చించారు. జమిలి ఎన్నికలు, మహిళల రిజర్వేషన్ కోసం పార్లమెంటు సీట్లు అదనంగా పెంచడం, ఎన్డీయే పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
అమిత్‌షాకు భారీ స్వాగతం..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర పర్యటనలో మునుపెన్నడూ లేని స్ధాయిలో భారీ స్వాగతం లభించింది. విశాఖ ఉక్కుకు కేంద్రం ఉదారంగా సాయం ప్రకటించిన నేపధ్యంలో తమ కృతజ్ఞత వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు ఆయనకు స్వాగత ఏర్పాట్లు ఈసారి కొంత భారీగా చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. వందల సంఖ్యలో మహిళలు కూడా విమానాశ్రయానికి వచ్చి కేంద్ర హోం మంత్రికి జయజయ ధ్వానాలు పలికారు. మార్గమధ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద... ఆ తర్వాత కొండవీటి వాగు ఎత్తిపోతల పఽథకం వద్ద కూడా వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. భద్రతా కారణాల రీత్యా అమిత్ షా మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా అభివాదం చేస్తూ సాగిపోయారు. మరి కొన్ని చోట్ల కూడా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకత్వం అనుకొన్నా భద్రత అధికారులు వారించడంతో ఆగిపోయింది. ఆయన నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన రావడానికి కొంత ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడకు వచ్చారు. అమిత్ షాకు పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ కలిసి చంద్రబాబు నివాసంలో పై అంతస్థుకు వెళ్లారు. అమిత్ షా, చంద్రబాబు సుమారు అరగంటపాటు విడిగా సమావేశం అయ్యారు.
Updated Date - Jan 19 , 2025 | 03:21 AM