Nara Lokesh: జోడెద్దుల్లా అభివృద్ధి సంక్షేమం
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:41 AM
అభివృద్ధి, సంక్షేమాన్ని సమప్రాధాన్యంగా తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణతో పాటు పింఛన్లు, అన్న క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది

వాటికి సమప్రాధాన్యం ఇస్తున్నాం
ఐదేళ్లలో ఎలమంచిలి, అనకాపల్లి రూపు రేఖలు మార్చే బాధ్యత మాది: లోకేశ్
అచ్యుతాపురం (అనకాపల్లి జిల్లా), మార్చి 31 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి లోకేశ్ అన్నారు. గత పాలకులు ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా.. తాము ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రూ.243 కోట్ల అంచనాతో చేపట్టిన అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి (14 కిలోమీటర్లు) విస్తరణ పనులకు సోమవారం ఆయన అచ్యుతాపురంలో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెద్దుల్లా ముందుకు సాగుతున్నాయన్నారు. వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు చేసి.. ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ అందించడం లేదని చెప్పారు. ‘అన్న క్యాంటీన్లు తెరిపించి పేదల ఆకలి తీరుస్తున్నాం. మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. మరో రెండు నెలల్లో తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ ఇస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుతూ, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. యువగళం పాదయాత్ర సందర్భంగా వచ్చినప్పుడు అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డులో ఉన్న గోతులను స్కేలు పెట్టి కొలవాల్సి వచ్చింది. అధికారంలోకి రాగానే గోతులు పూడ్చేందుకు నిధులు మంజూరు చేశాం. అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో స్థానిక ప్రజలు, షాపుల యజమానులకు ఇబ్బంది లేకుండా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూస్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో రానున్న ఐదేళ్లలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషిచేసేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలి. ఈ ప్రాంతానికి ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్‌ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్క్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వస్తున్నాయి.
పెద్దఎత్తున వస్తున్న పరిశ్రమలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐదేళ్లలో అనకాపల్లి, ఎలమంచిలి రూపురేఖలు మార్చే బాధ్యత తీసుకుంటాం’ అని తెలిపారు. కూటమి కార్యకర్తలు కసితో ప్రజల కోసం అహర్నిశలూ కష్టపడాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలియజేసి పరిష్కరించుకోవాలని పిలుపిచ్చారు.
లోకేశ్‌కు ఘనస్వాగతం
అధికారంలోకి వచ్చాక తొలిసారి అచ్యుతాపురం వచ్చిన లోకేశ్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, టీడీపీ రాష్ట్ర అద్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్, పంచకర్ల రమేశ్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి, కేఎ్‌సఎన్‌ఎస్ రాజు, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రగడ నాగేశ్వరరావు, తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, పీవీజీ కుమార్, పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Latest AP News And Telugu News