JNTU Pharmacy College: కొత్త కొత్తగా...
ABN , Publish Date - Mar 05 , 2025 | 12:34 AM
జేఎన్టీయూ ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాసూటికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఓటీపీఆర్‌ఐ) నూతన శోభను సంతరించుకోనుంది. విద్యార్థులను వేధిస్తున్న భవనాల కొరత త్వరలోనే తీరనుంది. క్యాంప్‌సలోనే బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలను యాజమాన్యం నిర్మిస్తోంది. వీటితోపాటు అకడమిక్, అడ్మినిస్ర్టేషన ...

జేఎన్టీయూ ఫార్మసీ కళాశాలకు మహర్దశ
నూతనంగా హాస్టల్స్.. ఫార్మసీ బ్లాక్ భవనాల నిర్మాణం
వేగంగా సాగుతున్న పనులు.. విద్యార్థుల హర్షం
అనంతపురం సెంట్రల్, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాసూటికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఓటీపీఆర్‌ఐ) నూతన శోభను సంతరించుకోనుంది. విద్యార్థులను వేధిస్తున్న భవనాల కొరత త్వరలోనే తీరనుంది. క్యాంప్‌సలోనే బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలను యాజమాన్యం నిర్మిస్తోంది. వీటితోపాటు అకడమిక్, అడ్మినిస్ర్టేషన కార్యకలాపాలకు ఫార్మసీ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూడు భవనాలకు సంబంధించి అత్యధిక శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేయించడానికి అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు.
700మంది విద్యార్థులు
నాలుగు సంవత్సరాల బీఫార్మసీలో వంద, ఆరు సంవత్సరాల ఫార్మా-డీ, రెండు సంవత్సరాల కోర్సులైన ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీలో 30 చొప్పున కళాశాలలో సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా పదిశాతం ఈడబ్ల్యుఎస్, లేటర్ ఎంట్రీ ద్వారా మరో 50మందికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇలా ప్రతి ఏడాది దాదాపు 700మంది విద్యార్థులు ఓటీపీఆర్‌ఐ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కోర్సులు పూర్తి కాలంలో 10నుంచి 20 ల్యాబ్‌లు, ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సబ్జెక్టుల వారిగా అవసరమైన అంశాలపై లైబ్రెరీలు, కంప్యూ టర్ ల్యాబ్‌లు వినియోగించుకోవాలి. ఇలా అకడమిక్, ల్యాబ్‌లు, లైబ్రెరీలకు పదుల సంఖ్యలో వసతులతో కూడిన సరిపడా గదులు ఉండాలి. అరకొర వసతుల మధ్యనే ఇప్పటివరకు విద్యను కొనసాగిస్తున్నారు. ఈ సమస్యలకు ముగింపు పలికేలా మరికొన్ని నెలల్లో అన్నిరకాలుగా సంపూర్ణ వసతులు కల్పించేలా జేఎన్టీయూ నూతన యాజమాన్యం చర్యలు తీసుకుంది.
క్యాంప్‌సలోనే హాస్టళ్లు...
ఓటీపీఆర్‌ఐ కళాశాలలో ఫార్మ సీ, ఎమ్మెస్సీ కోర్సులకు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉంది. రాయలసీమ, కోస్తా ప్రాంతాలనుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఓటీపీఆర్‌ఐలో హాస్టల్ వసతి లేకపోవ డంతో ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, కమలానగర్, సాయినగర్, విద్యుతనగర్ ఇలా వివిధ ప్రాంతాల్లోని ప్రైవేట్ హాస్టళ్లలో వసతి పొందుతున్నారు. వారు ఉంటున్న హాస్టళ్ల నుంచి తరగతుల ప్రారంభ సమయానికి కళాశాలకు చేరుకోవడం సమస్యగా మారింది. ఈ క్రమంలో ఎప్పుడేమి జరుగుతుందోనని విద్యార్థులు, వారి
తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల క్యాపం్‌సలోనే బాల, బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు నిర్మాణం అవుతుండటంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా పనులు...
రూ.22కోట్లతో ఓటీపీఆర్‌ఐ కళాశాల క్యాపం్‌సలో ఫార్మసీ బ్లాక్, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను నిర్మిస్తున్నారు. ఈ మూడు భవన నిర్మాణాలు దాదాపు స్లాబ్‌వరకు పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు త్వరగా చేయించేందుకు ఉన్నతాఽధికారులు పర్యవేక్షిస్తున్నారు. షిప్టుల వారిగా 24గంట లు కార్మికులు పనిలో ఉండి నిర్మాణాలను వేగవంతం చేయిస్తున్నారు. ఒక్కో హాస్టల్ భవనంలోని మూడు అంతస్థుల్లో 70 చొప్పున గదుల్లో విద్యార్థులు వసతి పొందేలా నిర్మిస్తున్నారు. విశాలమైన దాదాపు 40 తరగతి గదులు, అడ్మినిస్ర్టేషన, ల్యాబ్ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా ఫార్మసీ బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. మరో ఆరునెలల్లో నిర్మాణ పనులు పూర్తిచేసి వినియోగంలో తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రూ.22కోట్లతో..
విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించడం కోసం రూ.22కోట్ల నిధులు వెచ్చించి నూతన భవనాలు నిర్మిస్తున్నాం. వర్సిటీ, పీసీఐ నిబంధనల మేరకు క్యాంప్‌సలోనే హాస్టళ్లు ఉండేలా నిర్మాణాలు చేపట్టాం. ఇప్పటికే స్లాబ్‌వరకు భవనాలు పూర్తి చేశాం. మిగిలిన పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకున్నాం.
- ప్రొఫెసర్ కృష్ణయ్య, జేఎన్టీయూ రిజిస్ర్టార్
భయం, భయంగా..: నిఖిత, విద్యార్థిని
కాలేజ్ క్యాంప్‌సలో హాస్టల్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఓటీపీఆర్ కళాశాలలోనే ఫార్మసీ కోర్సు బాగుంటుందని చేరా. మా గ్రామానికి అనంతపురం నగరం దాదాపు 80 కిలోమీటర్ల దూరం. రోజు వచ్చిపోవాలంటే సాధ్యంకాని పని. అందుకే ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నా. ఈ క్రమంలో హాస్టల్ నుంచి కళాశాలకు వచ్చి పోవడానికి భయం భయంగా ఉంటోంది. మా భద్రతను దృష్టిలో పెట్టుకుని క్యాంప్‌సలోనే హాస్టల్ భవనాలు నిర్మిస్తుండటం సంతోషం.
పరుగు పరుగున...: మీనాక్షి, విద్యార్థిని
మూడేళ్లుగా ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నా. క్లాసులు, ల్యాబ్‌లకు సమయానికి హాజరుకావాల్సిందే. ఉద యం టిఫిన చేసి హాస్టల్‌నుంచి పరుగు పరుగున రావాల్సి వస్తోంది. ఇక మధ్యాహ్న భోజనానికి సమయం ఉంటే వెళ్తాం లేదంటే లేదు. త్వరలోనే హాస్టల్ సమస్యలు తీరబోతుండటం ఆనందంగా ఉంది.
సెక్యూరిటీ ఉంటుంది: లిఖిత, విద్యార్థిని
ప్రైవేట్ హాస్టళ్లలో నెలకు రూ.5వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కాలేజ్ క్యాంప్‌సలో అయితే అన్నిరకాల మెనూ కలిపినా రూ.3వేలకు మించదు. క్లాసులు, ల్యాబ్‌లకు సమయానికి వెళ్లవచ్చు. ఉదయం, సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవచ్చు. ముఖ్యంగా బాలికలకు సెక్యూరిటీ ఉంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కంగారు పడాల్సిన అవసరముండదు.
విద్యార్థుల భద్రత మాదే
జేఎన్టీయూలో చదవాలన్న ఆకాంక్షతో అనేక ప్రాంతాలు, జిల్లాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. వారికి భద్రత కల్పించడం మా బాధ్యత. నగర నడిబొడ్డున, కలెక్టరేట్‌కు ఆనుకుని కళాశాల ఉండటంతో అన్నింటకి సౌకర్యంగా ఉంటుందని తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పిస్తున్నారు. క్యాంప్‌సలోనే బాల, బాలికలకు వేరువేరుగా హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నాం. అధునాత వసతులు, సౌకర్యాలతో కూడిన ఫార్మసీ బ్లాక్ భవనం ఏర్పాటు కాబోతుంది. వర్సిటీ వీసీ, రిజిస్ర్టార్ సహకారంతో కొన్ని నెలలలోనే అందుబాటులోకి తెస్తాం.
- ప్రొఫెసర్ సుబ్బారెడ్డి, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....