Share News

AP Assembly Budget Session: 15 రోజులు.. 86 గంటలు

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:27 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయి. గత నెల 24న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో మొదలైన సమావేశాలు..

 AP Assembly Budget Session: 15 రోజులు.. 86 గంటలు

  • ఫలప్రదంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

  • ఉభయ సభల్లో 9 బిల్లులకు ఆమోదం

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫలప్రదంగా ముగిశాయి. గత నెల 24న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో మొదలైన సమావేశాలు.. గురువారం వరకు కొనసాగారు. 15 పనిదినాల్లో ఉభయసభలు జరిగాయి. తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఈ 15 రోజుల్లో శాసనసభలో 85 గంటల 52 నిమిషాల పాటు సభ్యులు మాట్లాడారు. నక్షత్ర గుర్తు కలిగిన 113 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలిచ్చింది. రెండు స్వల్ప వ్యవఽధి ప్రశ్నలకు మౌఖికంగా జవాబిచ్చింది. 17 నక్షత్ర మార్కు ప్రశ్నలకు సమాధానాలను సభలో ఉంచారు. 344 నిబంధన కింద ఒకటి, 74వ నిబంధన కింద రెండు అంశాలు చర్చించారు. ఎస్సీ వర్గీకరణపై చివరి రోజు చర్చించారు. సహకార బ్యాంకుల అవకతవకలపై సభాసంఘం విచారణ కోసం ఆమదాలవలస శాసనసభ్యుడు కూన రవికుమార్‌ చేసిన డిమాండ్‌ను అసెంబ్లీ ఆమోదించింది. దీనిపై సభాసంఘం వేస్తున్నట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈసారి జీరో అవర్‌లో ఎక్కువ మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే అవకాశాన్ని స్పీకర్‌ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కల్పించడంపైనా సంతృప్తి వ్యక్తమైంది. మండలి 14 రోజులు జరిగింది. 103 నక్షత్ర మార్కు ప్రశ్నలకు, 3 స్వల్ప వ్యవధి ప్రశ్నలకు ప్రభుత్వం జవాబిచ్చింది. 9 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినా.. ఎమ్మెల్సీలు మండలి సమావేశాల్లో పాల్గొన్నారు. కీలకమైన ప్రశ్నలు వేసి ప్రభుత్వం నుంచి సహేతుకమైన సమాధానాలు రాబట్టగలిగామని ఆ పార్టీ ఎమ్మెల్సీలు కొందరు తెలిపారు. మొత్తానికి.. ఐదేళ్ల తర్వాత మళ్లీ శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా ఉభయసభలూ అర్థవంతంగా జరిగాయన్న అభిప్రాయం సభ్యుల్లో కనిపించింది. వేడుకగా ఆటల పోటీలు.. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో ఈ క్రీడా పోటీలను నిర్వహించేవారు.


రాష్ట్ర విభజన జరిగాక.. 2014-19 నడుమ కూడా నాటి టీడీపీ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే జగన్‌ సీఎం అయ్యాక.. 2019-24 మధ్య ఆటలు లేవు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక.. మళ్లీ ఇప్పుడు శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను సభాపతి అయ్యన్నపాత్రుడు పునఃప్రారంభించారు. సభ్యులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.

ఎస్సీలుగా బేడ, బుడగజంగాలు!

కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానం

బేడ, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రానికి సిఫారసు చేస్తూ అసెంబ్లీ తీర్మానించింది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభలో ఈ తీర్మానాన్ని చదివి వినిపించగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బేడ, బుడగ జంగాలను గ్రూప్‌-1 కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు బేడ, బుడగ జంగాలు ఎస్సీలుగా లేరని, తెలంగాణతో కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వారిని ఎస్సీలుగా పరిగణించారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎస్సీల్లో లేరని తెలిపారు. అత్యంత వెనుకబడిన ఈ వర్గాలు ఎంతో కాలంగా తమను ఎస్సీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయని చెప్పారు.

Updated Date - Mar 21 , 2025 | 04:30 AM