Share News

రూ.2కోట్లకు డీల్‌!

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:17 AM

బీసెంట్‌ రోడ్డులోని మహంతి ఫిష్‌ మార్కెట్‌పై రాజకీయ గద్దల కన్ను పడింది. హోల్‌సేల్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసం మార్కెట్‌ను తరలించేందుకు రూ.2 కోట్ల డీల్‌ కుదిరినట్టు సమాచారం. ఇప్పటికే సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ దగ్గర స్థల పరిశీలన జరిపినట్టు తెలిసింది. హోల్‌సేల్‌ వ్యాపారులతో చేతులు కలిపిన అధికార పార్టీ నాయకుడు ఒకరు రిటైల్‌ వ్యాపారులను బలవంతంగా తరలించే వ్యూహం అమలు చేస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఖాళీ చేయాలని కార్పొరేషన్‌ నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ భారీ డీల్‌పై హోల్‌సేల్‌ వ్యాపారుల్లో కొంత అసంతృప్తికి దారి తీయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 రూ.2కోట్లకు డీల్‌!

-మహంతి ఫిష్‌ మార్కెట్‌ త రలింపునకు కుదిరిన ఒప్పందం!

- సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ దగ్గర ఏర్పాటుకు స్థల పరిశీలన

- హోల్‌సేల్‌ వ్యాపారులతో చేతులు కలిపిన అధికార పార్టీ నాయకుడు!

- రిటైల్‌ వ్యాపారులను బలవంతంగా తరలించే వ్యూహం!

- ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న కార్పొరేషన్‌

- విలువైన స్థలంపై రాజకీయ గద్దల కన్ను!

బీసెంట్‌ రోడ్డులోని మహంతి ఫిష్‌ మార్కెట్‌పై రాజకీయ గద్దల కన్ను పడింది. హోల్‌సేల్‌ వ్యాపారుల ప్రయోజనాల కోసం మార్కెట్‌ను తరలించేందుకు రూ.2 కోట్ల డీల్‌ కుదిరినట్టు సమాచారం. ఇప్పటికే సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ దగ్గర స్థల పరిశీలన జరిపినట్టు తెలిసింది. హోల్‌సేల్‌ వ్యాపారులతో చేతులు కలిపిన అధికార పార్టీ నాయకుడు ఒకరు రిటైల్‌ వ్యాపారులను బలవంతంగా తరలించే వ్యూహం అమలు చేస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఖాళీ చేయాలని కార్పొరేషన్‌ నుంచి ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ భారీ డీల్‌పై హోల్‌సేల్‌ వ్యాపారుల్లో కొంత అసంతృప్తికి దారి తీయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగరంలోని మహంతి ఫిష్‌ మార్కెట్‌ను తరలించేందుకు అధికార పార్టీ నాయకుడొకరు రంగంలోకి దిగారు. హోల్‌సేల్‌ వ్యాపారులతో బేరం పెట్టారు. మొత్తం 40 మంది హోల్‌సేల్‌ వ్యాపారులను ఇక్కడి నుంచి తరలిపోయేలా ఒప్పించారు. బీసెంట్‌ రోడ్డును ఖాళీ చేసి సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ సమీపంలో వారికి ప్రత్యామ్నాయంగా మార్కెట్‌ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అడ్డగోలు వ్యవహారానికి కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌, ఎస్టేటు విభాగాలు కూడా సహకరిస్తున్నాయి. ఇక్కడ ఉన్న హోల్‌సేల్‌ వ్యాపారులతో పాటుగా రిటైల్‌ వ్యాపారులను కూడా ఖాళీ చేయాల్సిందిగా తమ సిబ్బందిని పంపి బెదిరిస్తున్నారు.

మత్స్యకారుల కోసం నాడు నిర్మాణం

బీసెంట్‌ రోడ్డులో పూర్వం రోజుల్లో పేద మత్స్యకారులు చేపలు అమ్ముకునేందుకు మహంతి మార్కెట్‌ను నిర్మించటం జరిగింది. బీసెంట్‌ రోడ్డు వస్త్ర వ్యాపారాలకు, సమీప ప్రాంతాలన్నీ కూడా అనేక వ్యాపారాలకు ఆలవాలంగా మారటంతో మహంతి ఫిష్‌ మార్కెట్‌ కాస్తా వ్యాపార కేంద్రంగా మారిపోయింది. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు మహంతి మార్కెట్‌లోకి ప్రవేశించారు. హోల్‌ సేల్‌ వ్యాపారుల ప్రవేశం మొదట్లో గొడవలను సృష్టించినా.. క్రమేణా హోల్‌సేల్‌ వ్యాపారులతో రిటైల్‌ వ్యాపారులు కూడా సర్దుకుపోయారు. పరస్పర ఆధార వ్యాపారం వల్ల ప్రయోజనాలు ఉంటాయన్న కారణంగానూ సర్దుబాటు కొనసాగింది. మహంతి ఫిష్‌ మార్కెట్‌లో క్రమంగా 40 మంది వరకు హోల్‌సేల్‌ వ్యాపారులు కొనసాగుతుండగా..100 మంది వరకు రిటైల్‌ వ్యాపారులు ఉన్నారు. ప్రస్తుతం మహంతి మార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారులకు సరిపోవటం లేదు. హోల్‌సేల్‌ వ్యాపారమే కాబట్టి వీరంతా ఎక్కడికి వెళ్లినా వ్యాపారం సాగుతుంది. రిటైల్‌ వ్యాపారులకు అలా ఉండదు. హోల్‌సేల్‌ వ్యాపారులంతా బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.

ఫిష్‌ మార్కెట్‌ తరలింపునకు స్కెచ్‌

బీసెంట్‌ రోడ్డులో హాకర్లు, చిరు వ్యాపారులను ఆదాయ మార్గాలుగా చేసుకున్న అధికార పార్టీ నాయకుడికి మహంతి ఫిష్‌ మార్కెట్‌ నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు బయటకు వెళ్లాలన్న అంశం కలిసి వచ్చింది. ఇంకేముంది ? హోల్‌సేల్‌ వ్యాపారులతో సంప్రదింపులు జరిపారు. ఫిష్‌ మార్కెట్‌ తరలింపునకు స్కెచ్‌ వేశారు. ప్రత్యామ్నాయంగా సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ప్లాంట్‌ దగ్గర స్థలాన్ని చూపారు. ఈ స్థలాన్ని పలువురు హోల్‌సేల్‌ వ్యాపారులు చూశారు. స్థలం అనువుగా ఉందని గుర్తించారు. ప్రతిపాదిత స్థలంలోకి మహంతి ఫిష్‌ మార్కెట్‌ను తరలించేందుకు వీలుగా హోల్‌సేల్‌ వ్యాపారుల దగ్గర బేరసారాలకు దిగారు. ఒక్కో వ్యాపారికి రూ.5 లక్షల టార్గెట్‌ పెట్టారు. ఈ విధంగా మొత్తం 40 మంది వ్యాపారుల నుంచి రూ. 2 కోట్ల మేర డీల్‌ ప్రతిపాదన తీసుకు వచ్చారు. ఈ డీల్‌కు సంబంధించి కొందరు వ్యాపారులు ఓకే చెప్పినా మరికొందరు మాత్రం పెద్ద డీల్‌ అని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ డీల్‌పై హోల్‌సేల్‌ వ్యాపారుల్లో అంతర్గతంగా రచ్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే మహంతి ఫిష్‌ మార్కెట్‌ తొలగింపునకు సంబంధించి కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం, ఎస్టేటు విభాగాలు రంగంలోకి దిగాయి. తమ సిబ్బందిని పంపించి మహంతి ఫిష్‌ మార్కెట్‌లోని రిటైల్‌ వ్యాపారులను ఖాళీ చేయాల్సిందిగా వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీంతో కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం, మహంతి ఫిష్‌ మారె ్కట్‌ రిటైల్‌ వ్యాపారుల నడుమ వివాదం నడుస్తోంది.

డబుల్‌ ధమాకా!

మహంతి ఫిష్‌ మార్కెట్‌ను కనుక తొలగిస్తే సదరు రాజకీయ నాయకుడికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా రూ. 2 కోట్ల డీల్‌ సాకారమవుతుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసే హోల్‌సేల్‌ ఫిష్‌ మార్కెట్‌లో రిటైల్‌ వ్యాపారులుగా తమ వాళ్లను పెట్టుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మరింత లబ్ధిని పొందవచ్చు. ఈ రెండూ కాకుండా బీసెంట్‌ రోడ్డులోని మహంతి మార్కెట్‌ స్థలాన్ని బడా బాబులకు కట్టబెట్టవచ్చు. ఈ వ్యవహారంలో కూడా భారీగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

Updated Date - Mar 24 , 2025 | 01:17 AM