కొండకర్ల ఆవలో నిలువు దోపిడీ!
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:16 AM
అచ్యుతాపురం, మునగపాక మండలాల సరిహద్దులో వున్న ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండకర్ల ఆవలో సందర్శకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.

పర్యాటకుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు
చేపల వేట సాగించాల్సిన బోట్లతో ఆవలో విహారం
ఒక్క బోటులో కూడా కానరాని లైఫ్ జాకెట్లు
ఫొటో షూట్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు తీసినా.. డబ్బులు ఇవ్వాల్సిందే
ఆవను రూ.కోటితో అభివృద్ధి చేసిన పంచాయతీ
ఆదాయంలో ఒక్క రూపాయి కూడా దక్కని వైనం
అచ్యుతాపురం రూరల్, మార్చి 23, (ఆంధ్రజ్యోతి):
అచ్యుతాపురం, మునగపాక మండలాల సరిహద్దులో వున్న ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండకర్ల ఆవలో సందర్శకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. సొమ్ముకొరిది.. సోకు మరొకరిది అన్న చందంగా గ్రామ పంచాయతీ నిధులతో ఆవ వద్ద అభివృద్ధి పనులు చేయగా, పర్యాటకుల నుంచి టికెట్ రూపంలో వసూలు చేసే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా పంచాయతీకి చెందడంలేదు. ఇక్కడ ఫైబర్ బోట్ల నిర్వాహకులు సిండికేట్‌గా ఏర్పడి, పర్యాటకులకు అడ్డగోలుగా దోచుకుంటున్నారు.
సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సుగా కొండకర్ల ఆవ పేరు పొందింది. కొండకర్ల, అందలాపల్లి, వాడ్రాపల్లి గ్రామాలకు చెందిన రెండు కులాల వారు అనాదిగా కాలంగా ఈ ఆవలో చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం పర్యాటకును ఆకర్షిస్తుండడంతో రెండు, మూడు దశాబ్దాల నుంచి సందర్శకుల రాక బాగా పెరిగింది. దీంతో చేపల వేటతోపాటు ఆవలో తాటిదోనెలపై పర్యాటకులను ఆవలో తిప్పుతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇటీవల కాలంలో పర్యాటకుల రాక మరింత అధికంగా వుండడం, తాటి దోనెలపై ఆవలో విహరించడం ప్రమాదకరంగా వుండడంతో వాటి స్థానంలో ఫైబర్ బోట్లు అందుబాటులోకి తేచ్చారు. అయితే చేపల వేట సాగించే ఫైబర్ బోట్లలో పర్యాటకులను ఎక్కించుకుని ఆవలో సందర్శించే వారితోపాటు ఆవ వద్ద ఫొటో షూట్‌లకు వచ్చే వారి నుంచి, షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించే వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. పర్యాటకుల నుంచి నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేయాలన్న నిబంధనలు ఏవీ లేకపోవడంతో బోట్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఒక్క బోటులో కూడా లైఫ్ జాకెట్లు లేవు.
కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ నిధులు సుమారు రూ.60 లక్షలతో మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు మేర సిమెంటు రోడ్డు వేయించారు. సీఎస్‌ఆర్ నిధులతో సోలార్ వీధి దీపాలు, టాయిలెట్లు, ఒక షెడ్డు, శుద్ధజల ప్లాంటు ఏర్పాటు చేశారు. రూ.20 లక్షలతో పిల్లల పార్కు, కార్ పార్కింగ్‌లను అభివృద్ధి చేశారు. మొత్తం మీద కోటి రూపాయలకుపైగా ఖర్చుచేశారు. కానీ పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి కూడా పంచాయతీకి చెందడంలేదు.