బుడమేరులో మట్టి దందా!
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:19 AM
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు పాలడుగు రాంప్రసాద్, వడ్లమూడి చిన్ని సిఫారసుతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాజాగా బుడమేరులో మట్టి దందాకు తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా మూడు రోజులుగా వందలాది లారీల మట్టిని తవ్వి ఉంగుటూరు, ఉయ్యూరు, గన్నవరం ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన డ్రైనేజీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పాములపాడు డీసీ చైర్మన్ యార్లగడ్డ రవి ఉన్నతాధికారులతో మాట్లాడి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు.

- అనుమతిలేకుండా మూడు రోజులుగా మట్టి తవ్వకాలు
- ఉంగుటూరు, ఉయ్యూరు, గన్నవరం ప్రాంతాలకు తరలింపు
- గత వైసీపీ ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్వాకం
- చోద్యం చూస్తున్న డ్రైనేజీశాఖ అధికారులు
- నిలుపుదల చేయించిన పాములపాడు డీసీ చైర్మన్ యార్లగడ్డ రవి
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరులు పాలడుగు రాంప్రసాద్, వడ్లమూడి చిన్ని సిఫారసుతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాజాగా బుడమేరులో మట్టి దందాకు తెరలేపారు. ఎటువంటి అనుమతులు లేకుండా మూడు రోజులుగా వందలాది లారీల మట్టిని తవ్వి ఉంగుటూరు, ఉయ్యూరు, గన్నవరం ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన డ్రైనేజీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పాములపాడు డీసీ చైర్మన్ యార్లగడ్డ రవి ఉన్నతాధికారులతో మాట్లాడి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు.
ఆంధ్రజ్యోతి-గుడివాడ:
నందివాడ మండలం చేదుర్తిపాడు వద్ద బుడమేరు వెడల్పు, ఎత్తును పెంచే విధంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. మాజీ మంత్రి కొడాలి నాని అండతో బుడమేరు కట్టలను పటిష్ట్టపరచకుండా, ఎత్తు పెంచకుండా వందలాది టిప్పర్లతో కాంట్రాక్టర్ మట్టిని అమ్మేసుకున్నారు. గుడివాడలోని జగనన్న కాలనీ మెరకకు మట్టిని తరలించి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. గడ్డం గ్యాంగ్‌లో సదరు కాంట్రాక్టర్ కూడా సభ్యుడని వైసీపీ వర్గాలు బాహాటంగానే పేర్కొంటున్నాయి.
ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైం అనుమతులు లేకుండానే..
కాంట్రాక్టు నిర్ణీత గడువు పూర్తైన గడువు సమయాన్ని డ్రైనేజీ అధికారులు పెంచలేదు. గత వైసీపీ హయాంలో మొదలైన పనులకు ఎటువంటి ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్(ఇ.వో.టి) లేకుండానే గత మూడు రోజులుగా సదరు కాంట్రాక్టర్ మట్టి దోపిడీ సాగిస్తున్నాడు. గడువు సమయం పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్ అర్జీ పెట్టుకున్నట్లు డ్రైనేజీ అధికారులు పేర్కొంటున్నారు. డ్రైనేజీ చీఫ్ ఇంజినీర్ నుంచి ఎటువంటి అనుమతులు రాకుండానే మూడు రోజులుగా యథేచ్ఛగా మట్టి తవ్వి తరలించేస్తున్నాడు.
పెగ్ మార్కింగ్ చేయడంతో మొదలు
డ్రైనేజీకి సంబంధించిన భూమి ఎంత మేర ఉందో ఇటీవల డ్రైనేజీ అధికారులు రెవెన్యూ అధికారులతో పెగ్ మార్కింగ్ చేయించారు. దీంతో ఎటువంటి అనుమతులు లేకుండానే సదరు కాంట్రాక్టర్ మట్టితవ్వకాలు ప్రారంభించి వేరే ప్రాంతాలకు తరలించసాగారు. ఉంగుటూరు, ఉయ్యూరు, గన్నవరం పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్‌లకు మట్టిని అమ్ముకున్నట్లు సమాచారం.
నిద్రావస్థలో డ్రైనేజీ శాఖ
గత మూడు రోజులుగా పగులు, రాత్రి తేడా లేకుండా బుడమేరు నుంచి మట్టిని టిప్పర్లలో తరలిస్తుంటే డ్రైనేజీ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మట్టి తరలిస్తున్నట్లు కిందస్థాయి సిబ్బంది నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని అధికారులు పేర్కొనడం గమనార్హం.
వైసీపీ వాళ్లకు వత్తాసు
వైసీపీ సానుభూతి కాంట్రాక్టర్‌కు డ్రైనేజీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మట్టి దోపిడీ జరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకుండా డ్రైనేజీ అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై నందివాడ మండల టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చేదుర్తిపాడు వద్ద కట్టల పట్టిష్టత ఎక్కడా?
గత వైసీపీ హయాంలో బుడమేరులో చేదుర్తిపాడు వద్ద నుంచి మట్టిని తరలించుకు పోయారు. కట్టలను పటిష్ట పరచకపోవడం, ఎత్తును సరైన పరిమాణంలో పెంచకపోవడంతో గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల్లో గ్రామం 20 రోజుల పాటు నీటిలో మునకేసింది. తాజాగా చేపట్టే పనుల్లో అయినా కట్టలను పటిష్ట పరిచి, ఎత్తు పెంచాలని చేదుర్తిపాడు గ్రామస్తులు కోరుతున్నారు.
అనుమతులకు అర్జీ పెట్టుకున్నారు
ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైం(ఇ.వో.టి) కోసం కాంట్రాక్టర్ అర్జీ పెట్టుకున్నారు. డ్రైనేజీ చీఫ్ ఇంజినీర్ వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఎటువంటి గడువును పెంచలేదు. మట్టి బయట ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలియడంతో పనులను నిలుపుదల చేశాం.
- గణపతి, డీఈ, డ్రైనేజీ శాఖ
మట్టి తరలింపును అడ్డుకున్నాం
బుడమేరు నుంచి అక్రమంగా మట్టిని ఉంగుటూరు, గన్నవరంలోని ప్రైవేట్ స్థలాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందింది. వెంటనే డ్రైనేజీ అధికారులకు సమాచారమిచ్చి మట్టి తరలింపును అడ్డుకున్నాం.
- యార్లగడ్డ రవి, పాములపాడు డీసీ చైర్మన్