Share News

భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లు

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:21 AM

భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్‌లతో వైసీపీ నాయకుడు వేల్పుల రమేశ్‌ చెలరేగిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు లెక్కలేనన్ని దందాలు నడిపి కోట్లకు పడగలెత్తారు. ఎంతో మంది ఈయన వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు. ఆరు కేసులు నమోదైనా చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు, అక్రమార్జనకు దిగడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రమేశ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

భూ కబ్జాలు.. సెటిల్‌మెంట్లు

- వైసీపీ నాయకుడు వేల్పుల రమేష్‌ నిర్వాకం

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనన్ని దందాలు

- కూటమి ప్రభుత్వంలోనూ వెనక్కి తగ్గని వైనం

- మొత్తం రమేశ్‌పై ఆరు కేసులు నమోదు

- ఎట్టకేలకు అరెస్టు చేసిన పోసులు

- పోలీసులపైకి కుక్కలను ఉసిగొల్పిన రమేశ్‌

- కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, బ్లాక్‌ మెయిలింగ్‌లతో వైసీపీ నాయకుడు వేల్పుల రమేశ్‌ చెలరేగిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు లెక్కలేనన్ని దందాలు నడిపి కోట్లకు పడగలెత్తారు. ఎంతో మంది ఈయన వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు. ఆరు కేసులు నమోదైనా చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు, అక్రమార్జనకు దిగడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రమేశ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

(ఆంధ్రజ్యోతి, కంచికచర్ల రూరల్‌):

కంచికచర్ల మండలం కీసర గ్రామానికి చెందిన వ్యక్తి వేల్పుల రమేష్‌బాబు. ఈయన సతీమణి వేల్పుల ప్రశాంతి 2014లో టీడీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. పార్టీ నిర్ణయం మేరకు ఆమెను ఎంపీపీగా ఎన్నుకున్నారు. అప్పటి వరకూ కేవలం కీసర, పెండ్యాల గ్రామాలకే పరిమితమైన రమేష్‌ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో స్నేహం ఏర్పరచుకొని అక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండలానికే చెందిన ఒక ముఖ్య నాయకుడి అండదండలతో ఐదేళ్ల పాటు రెచ్చిపోయి ప్రవర్తించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలలో సెటిల్‌మెంట్‌ల నుంచి భూ కబ్జాలు, బ్లాక్‌ మెయిలింగ్‌లతో కంచికచర్ల ప్రాంతాన్ని కంటతడి పెట్టించినట్లు తెలిసింది. అధికారుల బలహీనతలను తెలుసుకొని వారిని మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. రాజకీయంగా ప్రోత్సహించిన ఆ టీడీపీ ముఖ్య నాయకుడికి ఎదురు తిరిగే స్థాయికి చేరుకున్నారని, ఆర్థిక, రాజకీయ లబ్ధి కోసం రమేష్‌ను ప్రోత్సహించిన ఆ నాయకుడిని బహిరంగంగా ధిక్కరించి రాజకీయాలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎలాగైనా రమేష్‌ను రాజకీయంగా బలహీన పరచాలన్న ఆలోచనతో సదరు నాయకుడు రమేష్‌ సతీమణిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారని, మండల పరిషత సభ్యులంతా ఏకమైనా రమేష్‌ను ఏమీ చేయలేక పోయారని తెలిసింది. పార్టీ పెద్దలు కూడా అతనితో గొడవ పెట్టుకొనేందుకు వెనుకాడినట్లు సమాచారం.

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

ఈ క్రమంలో రమేష్‌ అకృత్యాలు తట్టుకోలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఆరు కేసులు నమోదయ్యాయి. దౌర్జన్యాలు, బెదిరింపులపై నాలుగు కేసులు, రెండు బైండవర్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో టీడీ పీని వీడిన రమేష్‌ వైసీపీలో చేరాడు. వైసీపీ విజయం కోసం గట్టిగా పని చేసిన రమేష్‌కు వైసీపీలోనూ అగ్ర స్థానం లభించింది. ఆయన సతీమణి ప్రశాంతిని జడ్పీటీసీగా నిలబెట్టి గెలిపించారు. 2014 నుంచి 2019 వరకూ సాగించిన హవాకు కొనసాగింపుగా బెదిరింపులు, సెటిల్‌మెంట్‌లకు తెగబడినట్లు సమాచారం. వైసీపీ ఐదేళ్ల పాలనలో సైతం తన అకృత్యాలతో కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటికి తోడు కోడి పందేలు, పేకాట, గ్యాంబ్లింగ్‌ వంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్లు సమాచారం. నాటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అండదండలు ఉండటంతో బెదిరింపులకు గురైన బాధితులు కేసులు కూడా పెట్టలేని స్థితికి చేరుకున్నారు. ఒకరిద్దరు ఽధైర్యం చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు.

స్థలం కొనిపెడతానని రూ.22 లక్షలు స్వాహా

2024 ఎన్నికలకు ముందు తన గ్రామానికి చెందిన అంగిరేకుల రాంబాబు అనే వ్యక్తికి స్థలం కొనిపెడతానని చెప్పి రూ.22 లక్షల నగదు తీసుకున్న వేల్పుల స్థలం కొని పెట్టకపోగా, ఆ సొమ్ము తిరిగి ఇవ్వలేదని సమాచారం. బాధితుడు పలు మార్లు తన డబ్బులు ఇవ్వాలని కోరగా, వేల్పుల తన అనుచరులతో బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ఇటీవల ఆయన నేరుగా బాధితుడి ఇంటికే వెళ్లి బెదిరించినట్లు సమాచారం.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా..

2024 ఎన్నికల సమయంలోనూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన వైసీపీ గూండాలు, రౌడీలు, కబ్జా కోరులు సైలెంట్‌ అయ్యారు. కొందరైతే ఊళ్లు సైతం వదలి వెళ్లిపోయారు. వేల్పుల మాత్రం అదే ఊపును కొనసాగిస్తున్నారు. టీడీపీ ముఖ్య నేతలతో ఉన్న పాత పరిచయాల వల్లనో లేక స్వతహాగా ఉన్న ధైర్యంతోనో గానీ తన అకృత్యాలకు కనీసం విరామం కూడా ఇవ్వడంలేదని తెలిసింది.

అధికార పార్టీ నాయకులపై దాడికి యత్నం

ఇటీవల మునేటి వరదల కారణంగా నిరాశ్రయులైన వారిని కంచికచర్ల క్లబ్‌లో ఉంచారు. వారికి ప్రభుత్వం ద్వారా ఆహారం అందించారు. బాధితులను కలిసేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీ పీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా అధికార పార్టీ నాయకులపై దాడులు చేసేందుకు వేల్పుల కర్రలు, రాళ్లతో క్లబ్‌ వద్దకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై వారిని వెనక్కు పంపారు. అధికారం ఉన్న కూటమి నాయకులు అతనికి ఎదురు వెళ్లలేకపోయారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పంపిణీ సమయంలో కూడా వేల్పుల దౌర్జన్యంగా ట్రాక్టర్లకు ఇసుకను లోడ్‌ చేయించుకొన్నట్లు సమాచారం. ప్రతి లారీకి తమకు సొమ్ము చెల్లించాలని డిమాండ్‌ చేసి మరీ నగదు దండుకున్నట్లు తెలిసింది. మొత్తం మీద వేల్పుల అకృత్యాలు ఇంకెంత కాలం ప్రజలు భరించాల్సి ఉందో వేచి చూడాలి.

అరెస్టు సమయంలో హైడ్రామా

ఎట్టకేలకు వేల్పుల రమేశ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేసి కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నందిగామ కోర్టులో హాజరుపరిచారు. వైసీపీ అఽధికారంలో ఉండగా, ఆయన అడ్డగోలుగా పంచాయితీలు చేయడంతో పాటు ఒప్పుకోని వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనపై ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై శనివారం సాయంత్రం అరెస్టు చేస్తారని తెలుసుకున్న రమేష్‌ తన అనుచరులను ఇంటికి రప్పించుకున్నారు. పోలీసులు ఇంట్లోకి రాకుండా అడ్డగించడమే కాకుండా తన ఇంట్లో కుక్కను వారిపైకి ఉసిగొల్పారు. చివరకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు రమేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ వాహనం ఎక్కనని పట్టుబట్టడంతో సొంత వాహనంలోనే స్టేషన్‌కు తరలించారు. మొత్తం ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 24 , 2025 | 01:21 AM