Share News

రహదారులకు మోక్షం

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:21 AM

నర్సీపట్నంం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.

రహదారులకు మోక్షం

  • నర్సీపట్నం నియోజకవర్గంలో శరవేగంగా మరమ్మతు, అభివృద్ధి పనులు

  • రెండు విడతల్లో రూ.40 కోట్లు మంజూరు చేయించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

  • 587 సీసీ రోడ్లు, పది బీటీ రహదారులు

  • ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని అధికారుల లక్ష్యం

  • ప్రజలకు తీరనున్న కష్టాలు

నర్సీపట్నం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నంం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అయిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తున్నారు. నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం మండలాల్లో రూ.40 కోట్ల ఉపాధి హమీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, తారు రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వంలో రహదారులు ఎంత అధ్వానంగా వున్నాయో అందరికీ తెలిసిందే. రోడ్లను అభివృద్ధి చేయడం మాట అటుంచి.. కనీసం గోతులను కూడా పూడ్చలేదు. వర్షం కురిస్తే ఇబ్బందులు వర్ణనాతీతం. గోతుల్లో నీరు చేరి పంట కుంటలను తలపించేవి. వాహనాలు పాడైపోవడమే కాకుండా ప్రయాణించడానికి అధిక సమయం పట్టేది. మరోవైపు రహదారులకు ఇరువైపులా తుప్పలు పెరిగిపోయి రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వం, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల పరిధిలోని రహదారుల్లో గోతుల పూడ్చివేత పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఇక పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అంతర్గ రోడ్లను ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లుగా మార్చేస్తున్నారు. ఈ పనులన్నీ ఈ నెలాఖరునాటికి పూర్తిచేసి ఉగాది రోజున ప్రారంభోత్సవాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

తొలివిడత రూ.35 కోట్లతో 521 రోడ్లు అభివృద్ధి

నర్సీపట్నం నియోజకవర్గంలో 521 రోడ్లు అభివృద్ధికి ప్రభుత్వం రూ.35 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేసింది. వీటిలో 512 సీసీ రోడ్లు, 9 బీటీ రోడ్లు ఉన్నాయి. 369 సీసీ రోడ్లు,్ల ఆరు బీటీ రోడ్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో వున్నాయి. అన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయడానికి పీఆర్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలావుండగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఈ నెల 10వ తేదీన మరో రూ.5 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఒక బీటీ రోడ్డు, 75 సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు కొంతమేర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్‌ డీఈఈ ఈశ్వరరావును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ఈ నెలాఖరుకి బిల్లులు మొత్తం మంజూరు అవుతాయని తెలిపారు. బిల్లుల కారణంతో ఎక్కడా పనులు ఆగలేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Mar 24 , 2025 | 01:21 AM