జడ్పీ కోఆప్షన్ సభ్యునిపై ఎమ్మెల్యే ఫైర్
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:25 AM
మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్‌పై పలుమారు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.

మండల సమావేశంలో అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణపై సుందరపు ప్రసంగం
మధ్యలో అడ్డుపడిన నర్మాల కుమార్
తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
అభివృద్ధి విషయంలో రాజకీయాలు వద్దని సలహా
అయినా ఆగని జడ్పీ కోఆప్షన్ సభ్యుడు
సమావేశం నుంచి బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే హుకుం
అచ్యుతాపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి):
మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు నర్మాల కుమార్‌పై పలుమారు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుందరపు విజయకుమార్ మాట్లాడుతూ, అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు విస్తరణ ఎప్పుడో పూర్తికావాల్సిందని, కానీ జాప్యం కారణంగా భూ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం రూ.200 కోట్లకు పెరిగిందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిర్వాసితులను టీడీఆర్‌లకు ఒప్పించామని అన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు, ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడుతుండగా.. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు (వైసీపీ) నర్మాల కుమార్ అడ్డుతగిలి.. రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు టీడీఆర్‌లు ఇస్తామని చెబుతున్నారని, టీడీఆర్‌ల గురించి నిర్వాసితులకు వివరించాలని అన్నారు. దీంతో ఎమ్యెల్యే ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేగా తాను ఒక అంశంపై మాట్లాడుతున్నప్పుడు, అది పూర్తికాకుండానే మధ్యలో అవాంతరం కలిగిస్తే ఎలా? తాను మాట్లాడడం పూర్తయిన తర్వాత సందేహాలను వ్యక్తం చేయాలని సూచించారు. నర్మాల కుమార్ మళ్లీ ఏదో చెప్పబోగా.. ఎమ్మెల్యే తీవ్రంగా స్పదించారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలు వద్దని సున్నితంగా మందలించారు. అయినాసరే నర్మాల కుమార్ మాట్లాడడం ఆపకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మధ్యలో మాట్లాడొద్దన్నానా! అసలు నువ్వు మాట్లాడొద్దు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలియదు. కామన్‌సెన్స్ లేకపోతే ఎలా? జడ్పీ కోఆప్షన్ సభ్యుడు వేదికపై కోర్చోవచ్చని ప్రొటోకాల్‌లో వుందా? ముందు నువ్వు బయటకు వెళ్లు’’ అని కోపంగా అన్నారు. అయినాసరే నర్మాల కుమార్ ఇంకా ఏదో చెప్పబోతుండగా... ఇలాగైతే తానే బయటకు వెళ్లిపోతానంటూ ఎమ్మెల్యే విజయకుమార్ కుర్చీలో నుంచి లేచారు. దీంతో వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి.. జడ్పీ కోఆప్షన్ సభ్యుడిని మందలించారు. ఇటువంటి తరుణంలో కూడా నర్మాల కుమార్ ఏదో ఆనబోతుండగా.. ‘నసగవద్దు. ముందు బయటకు వెళ్లు’ అని ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. మీరు కాదు అధికారులు చెప్పాలని కుమార్ అంటుండగా.. వారు చెప్పరు తానే చెబుతున్నానని, ముందు బయటకు వెళ్లు అని గద్దించడంతో కుమార్ సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు.