Share News

Ugadi Awards: ఉగాది వేళ కళో దయం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:10 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను మరియు కళారత్న అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో సేవలందించిన 202 మందికి ఈ అవార్డులను సీఎం చంద్రబాబు అందజేయనున్నారు.

Ugadi Awards: ఉగాది వేళ కళో దయం

కళారత్న, ఉగాది పురస్కారాల ప్రకటన.. ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రకటించిన ప్రభుత్వం

86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది అవార్డులు

సాహిత్య రంగంలో కృత్తివెంటికి, నృత్య విభాగంలో త్రివిక్రమ్‌ సతీమణి సాయిసౌజన్యకు పురస్కారాలు..

జర్నలిజంలో తొమ్మిది మందికి గౌరవం

నేడు సీఎం చేతుల మీదుగా ప్రదానం

అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన ఈ పురస్కారాల ప్రకటనను తిరిగి పునరుద్ధరించి, శనివారం సాయంత్రం విజేతల జాబితాను విడుదల చేశారు. సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో ప్రముఖులను అవార్డులకు ఎంపిక చేశారు. ఈమేరకు శనివారం స్పెషల్‌ సీఎస్‌ ఆజయ్‌జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కళారత్న, ఉగాది పురస్కారాలతో కలుపుకొని మొత్తం 202 మందిని ఎంపిక చేశారు. ఇందులో 86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదగా విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు. చివరిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉగాది అవార్డులను అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పురస్కారాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్లీ ఆరేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కళారత్నలు..

సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు కళారత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. అలానే అచార్య ఎస్‌.రఘునాథశర్మకు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, సయ్యద్‌ నజీర్‌ ఆహ్మద్‌, దాట్ల దేవదానంరాజు, ఓలేటి పార్వతీశం, బొర్రా గోవర్ధన్‌, మన్నె శ్రీనివాసరావు తదితరులకు కూడా ఈ విభాగంలో అవార్డులు ప్రకటించారు. సంగీతంలో మల్లాది సోదరులు, నృత్యంలో ప్రముఖ సినిమా దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయిసౌజన్యకు పురస్కారం లభించింది. సినిమా విభాగంలో నటుడు పృథ్వీరాజ్‌, నాటక రంగంలో డోర్నాల హరిబాబు, కావూరి సత్యనారాయణ, హరికథ విభాగంలో సప్పా భారతీలకు కళారత్న అవార్డు ప్రకటించారు.


‘ఆంధ్రజ్యోతి’ సీనియర్‌ జర్నలిస్టుకు పురస్కారం

జర్నలిజంలో తొమ్మిది మందిని కళారత్న అవార్డు వరించింది. సీనియర్‌ జర్నలిస్ట్‌, ‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌ ఎడిటర్‌ కే నాగ సుధాకర్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇదే రంగం నుంచి ‘ఈనాడు’ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు, ‘స్వాతి’ ఎడిటర్‌ వేమూరి బలరాం, కొల్లు అంకబాబు, భోగాది వెంకటరాయుడు, వల్లీశ్వర్‌లను ఎంపిక చేశారు. సేవా రంగంలో ‘తానా’ మాజీ అధ్యక్షుడు కోమటి జయరామ్‌, సీహెచ్‌ మస్తానయ్య, ఇతరుల విభాగంలో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కొండా నరసింహరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు, ఐఆర్‌ఎస్‌ అధికారి ఎం.ప్రసాద్‌ ఎంపికయ్యారు.

ఉగాది పురస్కారాలు...

116 మందికి ఉగాది పురస్కారాలు లభించాయి. సాహిత్య విభాగంలో ఈతకోట సుబ్బారావు, చలపాక ప్రకాశ్‌, బండ్ల మాధవరావు, కె.వరలక్ష్మి, ఎస్‌.అబ్దుల్‌ అజీజ్‌, కుప్పిలి పద్మ తదితరులకు, నాటక రంగంలో చేగొండి వీరవెంకట సత్యనారాయణకు అవార్డులు ప్రకటించారు. కాగా, కళారత్న అవార్డు గ్రహీతలను రూ.50 వేల నగదు పురస్కారం, హంస ప్రతిమతో సత్కరిస్తారు. ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేల నగదు పురస్కారం, మెమెంటో అందిస్తారు.

అవార్డుల ప్రకటనలో ఆలస్యం..

అవార్డుల ప్రకటన శనివారం ఉదయం ఉంటుందని అంతా భావించారు. కానీ, ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం బాగా ఆలస్యం అయింది. మధ్యాహ్నం నుంచి విజేతలకు ఫోన్లు రావడం మొదలైంది. ఎట్టకేలకు సాయంత్రానికిగానీ పూర్తి జాబితా విడుదల కాలేదు. అవార్డులకు ఎంపికైన వారు ఆదివారం ఉదయానికి విజయవాడకు చేరుకోవాల్సి ఉంటుంది. పురస్కారాల ప్రకటనలో ఆలస్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగాను, తెలంగాణలోనూ ఉన్న అవార్డు విజేతలు అప్పటికప్పుడు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడంలో కొంత ఇబ్బందికి గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 05:04 AM