Share News

బిహార్‌లో మరో కుమార సంభవం?

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:08 AM

ఢిల్లీ దంగల్ తరువాత రాజకీయ రణ రంగస్థలం బిహార్‌కు మారింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీలో ఎదురైన పరాజయ– పరాభవాల నుంచి తేరుకొని, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాల ఊపుమీదున్న బీజేపీ– రాజధానిని...

బిహార్‌లో మరో కుమార సంభవం?

ఢిల్లీ దంగల్ తరువాత రాజకీయ రణ రంగస్థలం బిహార్‌కు మారింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీలో ఎదురైన పరాజయ– పరాభవాల నుంచి తేరుకొని, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాల ఊపుమీదున్న బీజేపీ– రాజధానిని దక్కించుకున్నంత సునాయాసంగా బిహార్‌లో ప్రభావ– ప్రాభవాలు చాటుకోగలదా అన్నది ప్రస్తుతానికి అనుమానమే. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల గడువు ఉన్నప్పటికీ, ఇప్పటికే రంగు మారుతున్న రాజకీయం భవిష్యత్తు చిత్రపటాన్ని సూచాయగా ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నితీశ్ అడుగుజాడల్ని అనుమానాలు నీడల్లా వెన్నాడుతున్నాయి. ఆరో దశకం చివర్లో హరియాణాలో పురుడుపోసుకున్న ‘ఆయారామ్‌.. గయారామ్‌’ సంస్కృతిని పునికిపుచ్చుకొని, రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా.. తనే ముఖ్యమంత్రిగా ఉండేలా పల్టురామ్ అవతారమెత్తిన నితీశ్, వయసు మీద పడిన దృష్ట్యా మరోసారి అలాంటి దుస్సాహసానికి తెగబడకపోవచ్చు.


కానీ, అధికారాన్ని సునాయాసంగా వదులుకోరని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అందుకు ఆయన ఎలాంటి ఎత్తుగడలు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరం. బిహార్‌లో రాజకీయ వాతావరణం యూపీ తదితర రాష్ట్రాల కన్నా పూర్తిగా భిన్నమైనది. హిందుత్వానికి పట్టుకొమ్మ వంటి యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని అయోధ్య రాముడే గట్టెక్కించలేకపోయాడు. ఇక బిహార్‌లోనైతే హిందూ సమాజం నూటికి నూరుపాళ్లు కులాలు, వర్గాలుగా చీలికలు పేలికలై ఉంది. హిందుత్వ గొడుగు నీడలోకి చేరి, ఒకే ఓటు బ్యాంకుగా.. ఉమ్మడిగా ఓటు వేసే పరిస్థితి ఎంత మాత్రం లేదు. అలాంటిది, బిహార్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే సీతామాత ఆలయం నిర్మిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడాన్ని బట్టి చూస్తే... ఒక ఎన్నికల వ్యూహకర్తగా ఆ రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితి అంచనాలో ఆయన, బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా విఫలమవుతున్నాయేమో అనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ‘బిగ్ జీరో’గా మిగిలిపోయాక బేరమాడే శక్తిని మరింతగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందనేది చూడాల్సిందే. ఎన్నికల పోరాటం స్థూలంగా చూస్తే లాలూప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ, నితీశ్ కుమార్ నాయకత్వంలోని పాలక జేడీ(యు) మధ్యేనని అనిపిస్తున్నప్పటికీ, అసలు సిసలు యుద్ధం జరిగేది మాత్రం కాంగ్రెస్, బీజేపీల నడుమే.


ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ సీఎం అభ్యర్థిగా గోదాలోకి దిగాలని బిహార్ సంకీర్ణ సర్కారులో ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ నిర్ణయించడం అనూహ్యమేమీ కాదు. జేడీ(యు)కు 12 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మనుగడకు అవెంతో కీలకం. ఈ దృష్ట్యా జేడీ(యు)తో కలిసి సాగడం వినా బీజేపీ ముందు మరో మార్గం లేదు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ నుంచే ముఖ్యమంత్రి ఎంపిక జరగాలన్న మహారాష్ట్ర ఫార్ములాకు బీజేపీ బిహార్‌లో తిలోదకాలు వదులుకొనకా తప్పలేదు. అగ్రవర్ణాల్లో పట్టుకలిగి ఉన్న బీజేపీ, నితీశ్ కారణంగా కుర్మిలు, తీవ్ర వెనుకబడిన (ఈబీసీ) కులాల ఓట్లు గంపగుత్తగా తమ కూటమికే లభిస్తాయని, దాంతో మరోసారి మంచి మెజారిటీతో గద్దెనెక్కగలమని ఆశిస్తోంది. ఢిల్లీలో జీరో మార్కుతో డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ, బిహార్‌కు సంబంధించినంతవరకు లాలూ తనయుడు తేజస్వీ యాదవ్‌ను సీఎం చేయడం వరకే తన పాత్రను పరిమితం చేసుకునేలా కనిపిస్తోంది. తాను గెలవకపోయినా.. గెలిచే అవకాశం ఉన్న పార్టీని ఓడించే సత్తా మాత్రం కాంగ్రెస్‌కు పుష్కలంగా ఉందని ఢిల్లీ ఎన్నికల్లో తిరుగులేని విధంగా రుజువైన దృష్ట్యా, ఆర్జేడీ సైతం కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలాగని పెద్ద సంఖ్యలో స్థానాలు డిమాండ్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా అంటే.. అదీ లేదు.


మూడున్నర దశాబ్దాల క్రితం వరకు ఆ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం కాంగ్రెస్‌దే. అనేక కుంభకోణాలు, అరాచక పాలనతో బిహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చి, తీవ్ర అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఆర్జేడీకి తోక పార్టీగా నేడు అది తయారైంది. లాలూ పార్టీని మరోసారి అధికార పీఠం మీద కూర్చోబెట్టేందుకు ఉపకరించే ఒక సాధనంగా మాత్రమే మిగిలిపోయింది. ఎంతటి దురవస్థ...! బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉంటే.. అందులో పాలక కూటమివి 138. వాటిలో జేడీ(యు)వి 48 కాగా, 84 సీట్లతో బీజేపీ ఆధిపత్యం కలిగి ఉంది. అయినప్పటికీ, నితీశ్ చంచల స్వభావం దృష్ట్యా దూకుడు ప్రదర్శించకుండా బీజేపీ తమాయించుకుంటూ వస్తోంది. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మొత్తం ఏడుగురిని కొత్తగా చేర్చుకున్న సీఎం నితీశ్ కుమార్, అందర్నీ బీజేపీ నుంచే తీసుకోవడం.. అందులోనూ రాజ్‌పుత్‌, కుష్వాహ, కుర్మి, భూమిహార్లకు చోటు ఇవ్వడం ద్వారా బీజేపీతో మైత్రి కొనసాగింపునకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు బలమైన సంకేతాలు పంపారు. అటు లాలూ సైతం రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతే. తన కుమారుడిని ఎలాగైనా గద్దెనెక్కించే క్రమంలో ముఖ్యంగా ఎం–వై(ముస్లిం–యాదవ ఏకీకరణ) సూత్రాన్ని ఆయన అనుసరిస్తున్నారు. 18 శాతం ముస్లిములు, 17 శాతం యాదవుల ఓట్లకు ఆయన గురిపెట్టారు. కానీ.. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగైదు శాతం యాదవుల ఓట్లు ఎన్డీఏ కూటమికి పడినట్లు గణాంకాల్లో వెల్లడి కావడం.. లాలూకు కలవరం కలిగించే పరిణామమే. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తన జన స్వరాజ్ పార్టీ తరఫున 30–40 మంది ముస్లిం అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశం ఉంది.


మజ్లిస్ సైతం తన ఉనికిని బలంగా చాటుకునేందుకు సిద్ధపడుతోంది. ఈ దృష్ట్యా.. కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ముస్లిములు పూర్తిస్థాయిలో ఓట్లు వేస్తారా అన్నది అనుమానమే. నితీశ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ఇటు ఎన్డీయే కూటమినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్న నితీశ్, కొంతకాలంగా పలు కార్యక్రమాలకు గైర్ హాజరవుతున్న తీరు – విపక్షం చేతిలో తాజా ఆయుధంగా మారే సూచనలు ఉన్నాయి. నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ బిహార్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేయవచ్చునన్న ఊహగానాలు... ఈ నేపథ్యంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 30కి పైగా శక్తివంతమైన రాజకీయ కుటుంబాలు చక్రం తిప్పుతున్నాయి. బిహార్‌లోను ఇద్దరు వారసులు తేజస్వీ యాదవ్, చిరాగ్ పాసవాన్ తమదైన ముద్ర వేశారు. ఇప్పుడిక నిశాంత్ కుమార్ సైతం ముగ్గులోకి దిగితే.. రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగినట్టే. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ డిగ్రీ పొందిన నిశాంత్ కుమార్, ఇప్పటిదాకా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ... పుస్తకాలు, భజనలు, ధ్యానంతో గడిపేస్తున్నారు. తన వ్యాపకాలు ఏమిటో తను చూసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయి కలిగిన నాయకులు లేకపోవడం, నితీశ్ కుమార్ సైతం రెండో తరం నాయకుల్ని తయారు చేసుకోని నేపథ్యంలో.. నిశాంత్ కుమార్ మరో వారసుడిగా ఎన్నికల రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసే సూచనలు ఉన్నాయి. బిహార్ ఎన్నికలపై దీని ప్రభావం తథ్యం. అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం..!

పి. దత్తారాం ఖత్రీ సీనియర్ జర్నలిస్టు

ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 02:08 AM