Share News

పరిషత్‌ ఫైట్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:19 AM

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా వైసీపీ నుంచి చేజారి టీడీపీ ఖాతాలో చేరుతున్నాయి. గురువారం జరగనున్న ఒక ఎంపీపీ, మరో వైస్‌ ఎంపీపీ, ఒక మండల కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక వ్యవహారం ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది.

పరిషత్‌ ఫైట్‌

ఎర్రగొండపాలెంలో రాజకీయం రసవత్తరం

వైసీపీలో గ్రూపుల గలాటా

అనుకూలంగా మార్చుకున్న అధికార పార్టీ

త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు

వైస్‌ ఎంపీపీ టీడీపీ ఖాతాలో చేరే అవకాశం

జగన్‌ వద్దకు వైసీపీ పంచాయితీ

చక్రంతిప్పుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా వైసీపీ నుంచి చేజారి టీడీపీ ఖాతాలో చేరుతున్నాయి. గురువారం జరగనున్న ఒక ఎంపీపీ, మరో వైస్‌ ఎంపీపీ, ఒక మండల కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక వ్యవహారం ఇరు పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు కీలకమైన పదవులు టీడీపీకి దక్కనున్నాయి. వైసీపీ నేతలు అధినేత జగన్‌ వద్దకు వెళ్లి పార్టీలోని విభేదాలను వివరించటంతోపాటు టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఫిర్యాదు చేశారు. కాగా కిందిస్థాయిలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు చతురతతో చక్రం తిప్పుతున్నారు. దీంతో గురువారం నాటి ఉపఎన్నికల ఫలితాలపై యావత్తు జిల్లా రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన చంద్రశేఖర్‌ ఉండగా టీడీపీ ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబు రాజకీయం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ను కొండపి నియోజకవర్గానికి జగన్‌ బదిలీ చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి వైసీపీలో గ్రూపు విభేదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు వాటిని అనుకూలంగా మార్చుకునే ప్రక్రియకు శ్రీకారం పలికారు. దీటైన రాజకీయ వ్యవహారాలు నిర్వహిస్తున్న ఎరిక్షన్‌బాబు కొంతకాలంగా స్థానిక సంస్థల్లో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలకు శ్రీకారం పలికారు. అందులో భాగంగా త్రిపురాంతకం, పుల్లలచెరువు మండల పరిషత్‌లపై దృష్టిసారించి కొంతమేర విజయం సాధించారు. త్రిపురాంతకం ఇన్‌చార్జి ఎంపీపీని, పుల్లలచెరువు వైస్‌ ఎంపీపీని టీడీపీలో చేర్చుకున్నారు. కీలకమైన దోర్నాల సర్పంచ్‌ను, మరో ఇద్దరు వైసీపీ నాయకులను ఆయన సైకిలెక్కించారు. ఈనేపథ్యంలో మండల పరిషత్‌లకు ఉప ఎన్నికలు రావడంతో రాజకీయం వేడెక్కింది.

రెండు మండలాల్లో పాగా దిశగా టీడీపీ

ప్రస్తుతం త్రిపురాంతకం ఎంపీపీ, పుల్లలచెరువు వైస్‌ ఎంపీపీ, ఎర్రగొండ పాలెం మండల పరిషత్‌లో కోఆప్షన్‌ సభ్యుల పదవులకు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలు రావడానికి గతంలో మంత్రి సురేష్‌ అవలంబించిన రాజీ సూత్రమే ప్రధాన కారణమైంది. త్రిపురాంతకం మండల పరిషత్‌లో 18 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను వైసీపీ నుంచి 17 మంది ఎన్నికయ్యారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అప్పట్లో ఎంపీపీ పదవి కోసం కోట్ల సుబ్బారెడ్డి, ఆపార్టీ నాయకుడు ఆంజనేయరెడ్డి భార్య ఆళ్ల సుబ్బమ్మలు పోటీపడ్డారు. అప్పటి మంత్రి సురేష్‌ ఇద్దరి మధ్య రాజీగా తొలి రెండున్నర సంవత్సరాలు సుబ్బారెడ్డి, ఆతర్వాత మరో రెండున్నరేళ్లు ఆళ్ల సుబ్బమ్మలు ఎంపీపీలుగా ఉండేలా రాజీసూత్రాన్ని అమలు చేశారు. ఆ ఒప్పందం ప్రకారం సుబ్బారెడ్డి రాజీనామా చేసే సమయానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఆయన స్థానంలో వైస్‌ ఎంపీపీగా ఉన్న సుబ్బమ్మను ఎంపీపీగా చేయాలని వైసీపీ భావిం చగా.. టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు చక్రం తిప్పారు. రెండో వైస్‌ ఎంపీపీగా ఉన్న గొట్టిముక్కల రెబ్కాను ఇన్‌చార్జి ఎంపీపీగా అధికారులు నియమించారు. ఈ నియామకం చెల్లదని ఆంజనేయరెడ్డి బృందం హైకోర్టుకు వెళ్లగా వైస్‌ ఎంపీపీలుగా ఉన్న ఇద్దరికీ సమాన అధికారం ఉంటుందని తేల్చి వారి పిటిషన్‌ కొట్టివేసింది. ఆ తర్వాత ఇన్‌చార్జి ఎంపీపీ రిబ్కా టీడీపీలో చేరిపోయారు. అయినప్పటికీ ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైసీపీ పక్షాన, ఒకరు టీడీపీ, ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.

రెబల్‌ ఎంపీటీసీ సభ్యులతో అవగాహన

ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికలు రావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీలో రెబల్‌ ఎంపీటీసీ సభ్యులను ఎరిక్షన్‌బాబు మచ్చిక చేసుకున్నారు. ఆ వర్గానికి ఎంపీపీ పదవి ఇచ్చేందుకు సహకారం అందిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. రాజుపాలెం ఎంపీటీసీ సభ్యురాలు చల్లా జ్యోతిని ఎంపీపీ చేసేవిధంగా వైసీపీ రెబల్‌ ఎంపీటీసీలతో అవగాహన కుదిరింది. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఒక ఎంపీటీసీ కుటుంబసభ్యులపై దౌర్జన్యానికి దిగారు. దళిత వర్గానికి చెందిన ఆ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో ఆంజనేయరెడ్డి, ముడివేముల ఎంపీటీసీ సుబ్బారావులు అట్రాసిటీ కేసులో చిక్కుకున్నారు. ఆంజనేయరెడ్డి రిమాండ్‌లో ఉండగా సుబ్బారావు పరారీలో ఉన్నాడు. టీడీపీ సహకారం పొందుతున్న వైసీపీ రెబల్‌ వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. వైసీపీతో ఉన్న ఎనిమిది మందిలో ఆంజనేయరెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ఏప్రిల్‌ 1వతేదీకి వాయిదా పడింది. ఓటింగ్‌కు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలన్న ఆయన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెల్లడికానుంది. ఒకవేళ కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా ఆంజనేయరెడ్డితో వైసీపీ మద్దతుదారుల సంఖ్య ఏడుకు చేరుతుంది. పరారీలో ఉన్న మరో ఎంపీటీసీ సుబ్బారావు ఓటింగ్‌కు రావాలని ప్రయత్నించినా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. దీంతో టీడీపీ మద్దతు ఉన్న చల్లా జ్యోతి ఎంపీపీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందిన సమాచారం మేరకు ఎన్నికల్లో వారు విజయం సాధిస్తే టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాతే ప్రమాణ స్వీకారం చేయవచ్చు అనేది సమాచారం.


పుల్లలచెరువులోనూ అంతే

పుల్లలచెరువు మండలంలో కూడా టీడీపీ చక్రం తిప్పింది. అప్పట్లో మంత్రిగా ఉన్న సురేష్‌ ఇక్కడ కూడా ఎంపీపీ పదవిని రెండేళ్లు ఒకరికి, మరో రెండేళ్లు ఇంకొకరికి చివరి ఏడాది మరొకరికి కేటాయిస్తూ ఒప్పందం చేశారు. ఆ ప్రకారం తొలుత ఎంపీపీగా ఎన్నికైన లాజరు రాజీనామా చేయగా వైస్‌ ఎంపీపీగా ఉన్న వెంకటయ్య ఎంపీపీ అయ్యారు. ఇటీవల ఆయన్ను ఎరిక్షన్‌బాబు టీడీపీలో చేర్చుకున్నారు. ప్రస్తుతం వెంకటయ్య స్థానంలో వైస్‌ ఎంపీపీగా కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ సభ్యులు ఉండగా 11 మంది వైసీపీ, నలుగురు టీడీపీ నుంచి గెలుపొందారు. ఎంపీపీ టీడీపీలో చేరడంతో వారి సంఖ్య ఐదుకు పెరిగింది. దీనికి తోడు ఐటీవరం, ముటుకుల, మర్రివేముల ఎంపీటీసీ సభ్యులు కూడా టీడీపీకి మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఎంపీటీసీలపై ప్రభావం చూపే వైసీపీ నాయకులు కొందరు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ ఎంపీటీసీల బలం ఎనిమిదికి చేరింది. వైస్‌ ఎంపీపీగా నాయుడుపాలెం ఎంపీటీసీ నాగభూషణంను టీడీపీ రంగంలో దింపింది. వైసీపీ నాయకులు కుస్తీ పడుతున్నారు. పదిహేను మంది ఎంపీటీసీల్లో ఎనిమిది మంది టీడీపీలో ఉన్నందున వైస్‌ ఎంపీపీ టీడీపీకి అవకాశం ఉంది.

విభేదాలే కొంపముంచాయి..

ఎర్రగొండపాలెం మండల పరిషత్‌లో మైనారిటీ వర్గం నుంచి ఎంపికైన కోఆప్షన్‌ సభ్యుడు మృతిచెందడంతో ఆ పదవికి గురువారం ఎన్నిక జరగనుంది. మండలంలో మొత్తం 18 మంది ఎంపీటీసీ సభ్యుల్లో వైసీపీ తరఫున పది, టీడీపీ తరఫున ఎనిమిది మంది ఉన్నారు. దీంతో మరో ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులను రాబట్టుకొని కోఆప్షన్‌ పదవిని చేజిక్కించుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉన్న మూడు పదవులను వైసీపీ కోల్పోయి టీడీపీ చేజిక్కించుకునే అవకాశం రావడం వెనుక ఆపార్టీ నాయకుల కృషితోపాటు వైసీపీ కిందిస్థాయి నాయకుల్లో విభేదాలు కారణమన్న చర్చ నడుస్తోంది. అయితే వాటిని ఆపార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌ సరిచేయలేకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Updated Date - Mar 26 , 2025 | 02:20 AM