Share News

ఇంటి పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:11 AM

ల్లాలో భారీగా పేరుకుపోయిన ఇంటి పన్ను బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. డివిజనల్‌ పంచాయతీ అధికారులు ఈ ప్రక్రియను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

ఇంటి పన్ను బకాయిలపై ప్రత్యేక దృష్టి

జిల్లావ్యాప్తంగా రూ.20కోట్ల పెండింగ్‌

వసూలుకు అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో భారీగా పేరుకుపోయిన ఇంటి పన్ను బకాయిల వసూళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. డివిజనల్‌ పంచాయతీ అధికారులు ఈ ప్రక్రియను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలాఖ రుకు వందశాతం వసూలు లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంటి పన్ను విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీగా బకాయిలు ఉండిపోయాయి. వీటి వసూలు ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులకు కత్తిమీద సాములా మారింది.

లక్ష్యం రూ.58.58 కోట్లు.. వసూలు రూ.38 కోట్లు!

జిల్లాలోని 38 మండలాల్లో ఉన్న మొత్తం 719 గ్రామ పంచాయతీల్లో రూ.58.58 కోట్ల మేర పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సుమారు రూ.38 కోట్లు మాత్రమే రాబట్టారు. ఇంకా రూ.20 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉంది. పన్ను వసూలుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ జిల్లా అధికారులతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ఈనెలాఖరులోపు నూరుశాతం రాబట్టాలని ఆదేశాలు ఇచ్చారు. ఆమేరకు జిల్లా పంచాయతీ అధికారి జి.వెంకటనాయుడు అవసరమైన చర్యలు చేపట్టారు. ఏరోజుకారోజు మండలాల వారీగా పన్నుల వసూళ్లను సమీక్షిస్తూ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పన్నుల వసూలు బాధ్యతను కేవలం పంచాయతీ కార్యదర్శులకు వదిలి వేయకుండా మండల స్థాయిలో ఉండే ఈవోఆర్‌డీలు, డివిజనల్‌ పంచాయతీ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. ఆర్థిక సంవత్సరం ముగిసే ఈనెలాఖరు లోపు పూర్తిస్థాయిలో వసూలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

ప్రజలకు అవగాహన

జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను వసూళ్లలో పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. అక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పన్నుల ద్వారా వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆవిషయమై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు ఇతర సిబ్బంది కూడా నిత్యం ఇంటి పన్ను వసూళ్ల కోసం తిరుగుతున్నా కొన్ని పంచాయతీలో ప్రజానీకం ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Mar 26 , 2025 | 02:11 AM