Share News

పంచాయతీ నిధుల భోక్తలపై చర్యలు నిల్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:13 AM

పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు కరువయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు పంచాయతీల్లోని నిధులను అడ్డగోలుగా దోచుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరించారు.

పంచాయతీ నిధుల భోక్తలపై చర్యలు నిల్‌

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా డ్రా

విచారణ పేరుతో జాప్యం చేస్తున్న అధికారులు

దర్శి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు కరువయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు పంచాయతీల్లోని నిధులను అడ్డగోలుగా దోచుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొన్ని పంచాయతీల్లో ఎలాంటి పనులు చేయకుండా లక్షలాది రూపాయలు డ్రా చేశారు. ఇంజనీరింగ్‌ అధికారులు కిక్కురుమనకుండా బిల్లులు చేశారు. నిధులు గోల్‌మాల్‌ విషయాలు బయటకురావడంతో కొన్ని గ్రామాల్లో స్థానిక నాయకులు ఉన్నతాధికారులకు పిర్యాదులు చేశారు. వారు నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ చేయించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

పలు పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం

మండలంలోని తూర్పువెంకటాపురం పంచాయతీలో రూ.25లక్షల నిధులు గోల్‌మాల్‌ అయ్యాయని ఆ గ్రామానికి చెందిన పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో కనిగిరి డీఎల్‌పీవోను విచారణాధికారిగా నియమించారు. సుమారు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ విచారణ పూర్తి చేయలేదు. జముకులదిన్నె, సామంతపూడి, కొత్తపల్లి, తదితర పంచాయతీల్లో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ నాయకులు ఒక పంచాయతీ కార్యదర్శిని పలుచోట్ల ఇన్‌చార్జ్‌గా నియమించి అడ్డగోలుగా నిధులు డ్రా చేసుకున్నారు. జనరల్‌ ఫండ్‌, 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు చేపల చెరువుల నగదును కూడా మార్చుకున్నారు. కొన్నిచోట్ల మొక్కుబడిగా పనులు చేశారు. కొన్ని నిధులకు పనులు చేసిన దాఖలాలు లేవు. అనంతరం ఎన్నికలు రావడంతో నిధుల దుర్వినియోగం విషయం మరుగునపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గతంలో ఫిర్యాదు చేసిన నాయకులు మళ్లీ ఉన్నతాధికారులను కలిసి నిధుల దుర్వినియోగంపై విచారణ ముందుకు సాగని విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో ఎలాంటి పనులు చేయకుండా అడ్డగోలుగా నిధులు డ్రా చేసినప్పటికీ ఇంజనీరింగ్‌ అధికారులు పనులు జరిగినట్లు బిల్లులు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అందుకు కారణమైంది. పంచాయతీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పుడైనా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 26 , 2025 | 02:13 AM