Share News

వెనుకబాటే!

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:17 AM

స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం విషయంలో జిల్లా బాగా వెనుకబడింది. మిగతా జిల్లాలతో పోలిస్తే చివరి స్థానాలలో ఉంది. విజన్‌-2047 లక్ష్యంగా తొలి ఐదేళ్ల (2024-29) ప్రణాళికలను ఏటా 15శాతం వృద్ధితో ప్రస్తుత ప్రభుత్వం వార్షిక సంవత్సరాల వారీగా రూపొందించిన విషయం విదితమే.

వెనుకబాటే!
అమరావతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న కలెక్టర్‌ అన్సారియా, ఎస్పీ దామోదర్‌

స్థూల ఉత్పత్తిలో 15, తలసరి ఆదాయంలో 18వ స్థానం

వచ్చే ఏడాది అంచనాలను కలెక్టర్ల సదస్సులో

జిల్లాల వారీ ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తగ్గుతున్న జిల్లా వాటా

తలసరి ఆదాయంలోనూ చివరనే!

నివేదికలతో హాజరైన కలెక్టర్‌ అన్సారియా

నేడు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

శాంతిభద్రతలపై సమీక్షలో పాల్గొన్న ఎస్పీ

ఒంగోలు మార్చి 25 (ఆంధ్రజ్యోతి): స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం విషయంలో జిల్లా బాగా వెనుకబడింది. మిగతా జిల్లాలతో పోలిస్తే చివరి స్థానాలలో ఉంది. విజన్‌-2047 లక్ష్యంగా తొలి ఐదేళ్ల (2024-29) ప్రణాళికలను ఏటా 15శాతం వృద్ధితో ప్రస్తుత ప్రభుత్వం వార్షిక సంవత్సరాల వారీగా రూపొందించిన విషయం విదితమే. ఆయా జిల్లాల్లో స్థానిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాల సద్వినియోగంతో కీలక రంగాలలో వృద్ధికి తీసుకునే చర్యలపై దృష్టి పెట్టింది. అలాగే మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి అంశాల వారీగా ప్రజల జీవన ప్రమాణాల పెంపు ద్వారా పేదరిక నిర్మూలన లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో మంగళ, బుధవారాల్లో కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసింది. తొలిరోజు వచ్చే ఏడాది ఆయా రంగాల వారీ లక్ష్యాలను ప్రకటించి వాటిని సాధించేందుకు యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. తొలుత రాష్ట్ర, జిల్లాల వారీ స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం అంచనాలు.. అందులో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, సర్వీసు రంగాల ద్వారా రాబడి వివరాలను సీఎం ప్రకటిం చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93ల క్షల కోట్లు కాగా వచ్చే ఏడాది (2025-26)కి రూ.18.65 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అలా రూ.3.72 లక్షల కోట్లు ప్రస్తుత ఏడాది కన్నా వచ్చే ఏడాది స్థూల ఉత్పత్తి పెరగనున్నట్లు అంచనా. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది తలసరి ఆదాయం రూ.2.66 లక్షల కోట్లు కాగా వచ్చే ఏడాదికి మరో 16.81శాతం వృద్ధితో రూ.3.11 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అదేసమయంలో జిల్లాల వారీ వివరాలను ప్రకటించారు. అందులో మన జిల్లా ప్రస్తుత ఏడాది స్థూల ఉత్పత్తి రూ.56,271 కోట్లు కాగా వచ్చే ఏడాది అది రూ.65,543 కోట్లుగా ఉంది. అలా ప్రస్తుతం ఏడాది కన్నా వచ్చే ఏడాది స్థూల ఉత్పత్తి దాదాపు రూ.9వేల కోట్లకుపైగా అధికంగా కనినిస్తున్నా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వృద్ధి కన్నా వెనుకబడి ఉంది.

మరో మూడు స్థానాలు దిగువే..

రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది జిల్లా స్థూల ఉత్పత్తి వాటా 15వ స్థానంలో 3.53శాతంతో ఉండగా వచ్చే ఏడాది కూడా 15వ స్థానంలోనే ఉండనున్నప్పటికీ రాష్ట్రంలో జిల్లాల వాటా 3.51శాతానికి తగ్గిపోనున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఇతర జిల్లాల్లో పెరుగుతున్నంత వేగంగా జిల్లాలో వృద్ధి కనిపించడం లేదు. ఇక తలసరి ఆదాయాన్ని చూస్తే ప్రస్తుత ఏడాది జిల్లాలో రూ.2,03,770 కాగా వచ్చే ఏడాది రూ.2,36,741గా అంచనా వేశారు. అలా దాదాపు రూ.33వేల మేర పెరుగుదల ఉన్నప్పటికీ రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తలసరి ఆదాయం పెరిగే వేగం ఇక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది తలసరి ఆదాయంలో జిల్లా 15వ స్థానంలో ఉంది. వచ్చేఏడాది మరో మూడు తగ్గి 18వ స్థానానికి పడిపోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

మంత్రి స్వామి హాజరు

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వచ్చే ఏడాది కీలక రంగాలైన వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 35.19శాతం, పారిశ్రామిక రంగం వాటా 23.32శాతం, సేవారంగాల వాటా 41.49శాతం ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. అదే జిల్లాలో పరిశీలిస్తే వచ్చే ఏడాది స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 40.79శాతం, పారిశ్రామిక రంగం వాటా 18.07శాతం, సేవా రంగాల వాటా 41.14శాతంగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా కలెక్టర్ల సదస్సుకు ప్రభుత్వం తరఫున జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి, ఆయా రంగాలవారీ కీలక అంశాలాపై నివేదికలతో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా హాజరయ్యారు. సదస్సులో రెండో రోజైన బుధవారం ఆయా అంశాలపై కలెక్టర్‌ అన్సారియా ఫవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం లా అండ్‌ ఆర్డర్‌పై నిర్వహించిన సమీక్షకు ఎస్పీ దామోదర్‌ హాజరయ్యారు.

Updated Date - Mar 26 , 2025 | 02:17 AM