మిర్చి మంటలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:23 AM
రూ.కోట్ల విలువచేసే మిర్చి పంట.. కళ్ల మందే దహనమైంది. జగ్గయ్యపేట మండలం తొర్రగుంటపాలెంలో సాయితిరుమలగిరి అగ్రి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజీలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.15 కోట్ల విలువైన పంట బూడిదైంది. మిర్చి ఘాటుకు మంటలను ఆర్పడం కష్టతరమవుతుండగా, మరో రెండు రోజుల వరకు మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది.

జగ్గయ్యపేటలోని కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం
బూడిదైన రూ.15 కోట్ల విలువైన మిర్చి పంట
విద్యుత షార్ట్ సర్క్యూట్ కారణంగానేనని అంచనా
మంటలను అదుపు చేయలేకపోతున్న అగ్నిమాపక సిబ్బంది
ఆపరేషన్‌కు అడ్డుగా మారుతున్న మంటలు.. ఆపై ఘాటు
అదుపునకు మరో రెండు రోజులు పట్టే అవకాశం
రికార్డులను సీజ్ చేసిన మార్కెటింగ్ అధికారులు
ఇటీవలే రూ.6 కోట్ల రుణం తీసుకున్నట్టు నిర్ధారణ
ఫైర్ ఎన్‌వోసీ లేదు.. అగ్నినిరోధక యంత్రాలు కూడా లేవ్
యాజమాన్యం పరార్.. రైతుల అందోళన
జగ్గయ్యపేట/విజయవాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : జగ్గయ్యపేట శివారులో జాతీయ రహదారికి సమీపంలోని తొర్రగుంటపాలెంలో ఉన్న సాయి తిరుమలగిరి అగ్రి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్డ్ స్టోరేజీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. మిర్చిఘాటు కారణంగా అగ్నిమాపకశాఖ అధికారులు అష్టకష్టాలు పడుతూ మంటలను ఆర్పేందుకు కష్టపడుతున్నారు. ఈ ప్రమాదంలో రూ.15 కోట్ల విలువ చేసే మిర్చి పంట అగ్నికి ఆహుతైంది. స్టోరేజీ యాజమాన్యం పరారీలో ఉంది. తమ పంట అగ్నికి ఆహుతి కావటంతో రైతులు కోల్డ్ స్టోరేజీ దగ్గర ఆందోళన నిర్వహించారు. కోల్డ్ స్టోరేజీలో ఎలాంటి ఫైర్ ఎన్‌వోసీ లేదు. కనీసం అగ్ని నిరోధక వ్యవస్థలు కూడా లేవని తెలుస్తోంది. కాగా, వీటిపై అగ్నిమాపక శాఖ అధికారులు ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.
అదుపులోకి రాని మంటలు
మార్కెటింగ్ శాఖ అధికారులకు స్టోరేజీ యాజమాన్యం ఇచ్చిన గణాంకాల ప్రకారం 385 మంది రైతులు ఫిబ్రవరి నెలాఖరు వరకు 13,960 టిక్కీలు (బస్తాలు) ఇక్కడ నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. కోల్ట్ స్టోరేజీ యాజమాన్యం మాత్రం 40 వేల టిక్కీలు ఉన్నట్టు చెబుతోంది. మార్కెట్ విలువ ప్రకారం రూ.15 కోట్ల విలువచేసే మిర్చి కోల్డ్ స్టోరే జీలో ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం తెలియగానే జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫైర్ సర్వీసెస్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ జి.శ్రీనివాసులు, జిల్లా ఫైర్ ఆఫీసర్ జి.శంకర్రావులు దగ్గరుండి మంటలు నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈదురుగాలులు వీస్తుండటంతో మంటలు నియంత్రించటం కష్టంగా మారింది. భారీగా పొగలు రావటం, మిర్చి ఘాటుతో సహాయ చర్యలు చేసే సిబ్బందికి, అధికారులకు ఇబ్బందికరంగా మారింది. మంటలు ఎంతకూ నియంత్రణలోకి రాకపోవటంతో సెంటినీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి లిక్విడ్ కంప్రెస్సెడ్ కార్బన్ డై అక్సైడ్ ట్యాంకర్‌ను తెప్పించి, ఆ గ్యాస్ ద్వారా మంటలు నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలోని రెండు చాంబర్లలో ఒక చాంబర్‌లోనే సరుకు ఉంది. అధికారులకు కోల్డ్ స్టోరేజీ షట్లర్లను ఓవైపు తొలగించి పంటను కాపాడాలని యత్నించినా సఫలం కాలేదు. లోపలకు పోకుండా ఘాటైన పొగలు, మంటలు కింద వరకు వ్యాపించాయి. సంఘటనాస్థలాన్ని టీడీపీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ తదితరులు సందర్శించారు. అక్కడ జరుగుతున్న నియంత్రణా చర్యలను సమీక్షించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఆదుకునేందుకు కృషి చేస్తామని వారంతా హామీ ఇచ్చారు.
కనిపించని యాజమాన్యం
మంటల గురించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం తర్వాత కనిపించలేదు. రైతులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట సీఐ పీ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు రైతులను శాంతింపజేశారు. కోల్డ్ స్టోరేజీలో తాము నిల్వ ఉంచిన సరుకు వివరాల పత్రాలను అందజేయాలని రెవెన్యూ అధికారులు కోరారు. కోల్డ్ స్టోరేజీ వద్దే ఓ క్యాంప్ ఏర్పాటుచేసి రైతుల వద్ద వివరాలు నమోదు చేస్తున్నారు.
మంటల ఘాటుకు అల్లకల్లోలం
జగ్గయ్యపేట చుట్టుపక్కల ఉన్న అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించి మంటలను అదుపు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. అగ్నిమాపక సిబ్బంది ఒక్కో అడుగు ముందుకు వేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. స్టోరేజీ మొత్తం అరలు అరలుగా ఉండటం, అందులో ఉన్న మిర్చి మండుతూ ఉండటంతో ఘాటు ఎక్కువగా బయటకు వస్తోంది. మిర్చి మండటంతో అగ్నిమాపక సిబ్బంది ఒళ్లంతా మంటలు పుడుతున్నాయి. మరోపక్క ఘాటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ మంగళవారం సాయంత్రానికి మంటలను కొంతవరకు అదుపు చేయగలిగారు. ఫైర్ టెండర్ల ద్వారా నీటిని బలంగా వెదజల్లినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో కీసర వద్ద ఉన్న సెంటినీ బయో స్పిరిట్స్ నుంచి లిక్విడ్ కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) ట్యాంకర్‌ను రప్పించారు. ఈ ట్యాంకర్‌లో ఉన్న వాయువు మొత్తం అయిపోయినా మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. కోల్డ్ స్టోరేజీలో మంటలు అదుపులోకి రావడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెబుతున్నారు. లోపల ఉన్న అగ్గిని ఆర్పడానికి బుధ, గురువారాల్లో ఆపరేషన్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటీవలే రుణం తీసుకున్న యజమాని
కోల్డ్ స్టోరేజీ నిర్వాహకుడు, యజమాని రావూరి శ్రీనివాసరావు.. లోపల ఉన్న మిర్చిపంటను హామీగా పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ధారించారు. సుమారు రూ.6.36 కోట్ల వరకు కొద్దిరోజుల క్రితమే బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అసలు లెక్కలు తేల్చడం కోసం కోల్డ్ స్టోరేజీ వద్ద ఉన్న రికార్డులను మార్కెటింగ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇలా బ్యాంకు నుంచి తీసుకున్న రుణం డబ్బును రైతులకు పంచాల్సి ఉంది. ఇంతలోనే అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాలను నియంత్రించడానికి ఉండాల్సిన భద్రతా చర్యలు కూడా ఇక్కడ లేవని తెలుస్తోంది. కోల్డ్ స్టోరేజీకి సంబంధించిన బీమా గడువు నెల క్రితం ముగిసినట్టు తెలిసింది. ఇదే కనుక జరిగితే బీమాను క్లెయిమ్ చేసుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుణం మొత్తంలో నుంచి బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాలని నిర్వాహకుడు శ్రీనివాసరావు నిర్ణయించినట్టు తెలిసింది. ఇంతలో ఈ దారుణం జరిగింది.